మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

211

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? దాని ఉపయోగమేమిటి? కొంత మంది తాయత్తుతో కూడా కట్టుకుంటారు? దానికి శాస్త్రీయమైన కారణాలేమిటో చూద్దాం.

తమిళంలో ‘తాయ్’ అంటే తల్లి. ‘అత్తు’ అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు తల్లి నుండి ఖండించినది అని అర్ధం. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీన కాలంలో బిడ్డ పుట్టగానే, మంత్రసాని బొడ్డుతాడు నుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి, ఒక గొట్టంలో పోసి మూతపెట్టి ఉంచేది. బారసాల అయినాక ఆ గొట్టాన్ని, ఒక త్రాటికి కట్టి దానిని మొలత్రాడుగా కట్టేవారు. అదే తాయత్తు.

ఈ ఆచారం ఇప్పుడు కూడా తమిళనాట అనేక ప్రాంతాలలో, పల్లెపట్టుల్లో కొనసాగుతోంది. ఎవరికైనా పాము కరిచినా, ఏదైనా పెద్ద జబ్బు చేసినా, సిద్ధ వైద్యులు ఈ తాయత్తులోని రక్తాన్ని తీసి, ఇతర మందులు కలిపి వైద్యం చేసేవారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి స్టెమ్ సెల్స్ కావాలంటే అతని మొలత్రాడును తడిమితే సరిపోతుంది. అది దాచడానికి అంతకంటే భద్రమైన ప్రదేశం ఏది?

అయితే కాలక్రమంలో ఇలా స్టెమ్ సెల్స్ భద్రపరిచే జ్ఞానం లుప్తమైపోయింది. కేవలం ఆచారం మాత్రం మిగిలింది. తాయెత్తు గొట్టంలో ఏం ఉంచాలో తెలీక , రాగిరేకులపై వ్రాసిన యంత్రాలు వంటివి ఉంచి కట్టడం ప్రారంభించారు. మెల్లగా తాయత్తు అన్నది మూఢ నమ్మకం అన్న నమ్మకం ప్రబలి, తాయత్తును వదిలి కేవలం మొలత్రాడు మాత్రం కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు అదీ పోయింది. పోయి ఇది వచ్చింది …

ఇప్పుడు బొడ్డు తాడు నుండి స్టెమ్ సెల్స్ సేకరించి భద్రపరిచే బ్యాంకులు, భారతదేశంలో కూడా ఉన్నాయి. అయితే ఈ ఆధునిక తాయత్తులను చాలా జాగ్రత్తగా క్రయోజెనిక్ ఉష్ణోగ్రతలలో భద్రపరచాలి. అది ఉంటే కాన్సర్ లాంటి ఏ రోగాన్నైనా నయం చేయవచ్చనీ, భవిష్యత్తులో మనిషి అవయవం ఏదైనా కోల్పోతే , ఈ రక్తం నుండి మళ్లీ ఆ అవయవాన్ని పునరుత్పత్తి చేసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, ఇప్పుడు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ దిశగా కృషి జరుగుతోంది కూడా.

అయితే తాయత్తుల్లోపోసి మొలత్రాటికి కట్టి ఉంచితే, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఈ స్టెమ్ సెల్స్ బ్రతుకుతాయా? బ్రతకవు. వాళ్లు ఏం పసర్లు కలిపి ఏ ప్రాసెసుతో వాటిని సజీవంగా ఉంచారో, అసలు సజీవంగా ఉంచగలిగారో లేదో, వాటిని ఎలా పునర్వినియోగం చేస్తారో ఇప్పుడు మనకు తెలియదు. స్టెమ్ సెల్స్ ఉపయోగం గురించి ఆధునిక వైద్య విజ్ఞానం గుర్తించింది నిన్నమొన్ననే. మొలత్రాడు, తాయత్తులు ఏనాటివి? మరి శతాబ్దాలుగా అలా సేకరించిన వారు ఏ భౌతిక ప్రయోజనం లేకుండానే, కేవలం మూఢ నమ్మకంతో అలా చేశారా? అంటే తెలియదు. వారికి స్టెమ్ సెల్స్ గురించిన పరిజ్ఞానం ఉండేది అనడానికి ఆచారాలే తప్ప ఆధారాలు ఇప్పుడు దొరకడం లేదు. కనుక దానిని గురించి వాదించడం కూడా నిరుపయోగమే.

భారతదేశంలో ఇలా బొడ్డుతాడు నుండి రక్తాన్ని సేకరించి తాయత్తుల్లో నింపి, మొలత్రాటికి కట్టి భద్రపరచడంలో ఏదో అంతుచిక్కని ప్రాచీన విజ్ఞానం ఉందని శాస్త్రవేత్తలు కూడా ఊహిస్తున్నారు. ఆ దిశగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. గూగుల్లో వెదికితే దాని మీద జరిగిన పరిశోధనల వివరాలు దొరుకుతాయి (ఉదా : Panwar, Amishi, “Banking on Cord Blood: Decoding Amulets and Canisters in South India.” PhD thesis, Graduate Institute of International and Development Studies, Geneva, 2020.)

ఇప్పుడు మన ప్రాచీన విజ్ఞానం గురించి మాట్లాడితే “అన్నీ వేదాల్లోనే ఉన్నాయిలే” అనే వెటకారపు మాటలే ఎదురౌతాయి. కానీ నిండు మనుసుతో పరిశోధించేవారికి, మూఢాచారాలుగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎన్నో విషయాల్లో అబ్బురపరచే సైన్సు సంగతులు తెలుస్తాయి.