దోశ.. ఆ పేరెలా వచ్చిందంటే..

311

నెల్లూరు సీమను పరిపాలించిన మనుమసిద్ధి మహారాజు ఆస్థానంలో కమ్మటి కవిత్వం చెప్పిన కవి తిక్కన, మహావీరుడు అయిన ఖడ్గ తిక్కన మాత్రమే కాదు. కమ్మటి వంటలు చేసే నారాయణ శర్మ కూడా ఉండేవారు. రాజు గారికి ప్రతీ రోజు ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, ఉప్పు పొంగలి తప్పనిసరిగా ఉండాల్సిందే. దానితో పాటు కొబ్బరి చట్నీ, కారప్పొడి, కమ్మటి సింహపురి మొలగొలకుల గ్రాసం తిన్న గేదెల ద్వారా వచ్చిన సువాసనతో కూడిన నెయ్యి, కమ్మటి పులుసు తప్పని సరి.

కానీ ఓ రోజు నారాయణ శర్మ గారు ఖర్మ కాలి భార్యతో గొడవపడి కొద్దిగా అన్యమనస్కంగా ఇడ్లీ పిండి రుబ్బుతుంటే నీళ్లు ఎక్కువై పల్చన అయిపోయింది. అంతే ప్రాణాలు ఉగ్గ బెట్టుకొని మంత్రిగారి దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. మంత్రి శివారాధ్యుల వారు కళ్లెర్ర చేసి ఉరిశిక్షే అన్నారు. చావు ఎలా తప్పదని చివరి సారిగా తనకు ఆప్తమిత్రులు అయిన భిషగ్వరుడు మాధవాచార్యుల వారి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన వెంటనే ఓ ఉపాయం చెప్పి నేను చూసుకుంటానులే అని అభయం ఇచ్చారు.

ఆరోజు రాజుగారి అల్పాహారాన్ని పర్యవేక్షిస్తున్న మాధవాచార్యుల వారు … ఓ పల్చటి అట్టు నేతితో వేసి తీసుకొచ్చారు. రాజు గారు తిని, రుచికి ఆశ్చర్యపోయి మాధవుల వారిని ఇది ఎలా తయారు చేశారు అని అడిగారు. వెంటనే మాధవులవారు వంటగదిలోకి రాజు గారిని తీసుకు వెళ్లి పెనం మీద పల్చటి ఇడ్లీ పిండిని వేసి చక్కగా నెరిపారు. అట్టు అద్భుతంగా వచ్చింది. పిండి పెనం మీద వేసేటప్పుడు రెండు సార్లు సుఁయ్ … సుఁయ్ అని చప్పుడు వచ్చింది. అంతే పక్కన ఉన్న తిక్కన గారు ఆనందంతో
“ద్వే సుఁయ్” (రెండు సుయ్ లు) అని ఈ కొత్త అట్టుకి నామకరణం చేసేసారు.

ఆ ద్వే సుఁయ్ రూపాంతరం చెంది దోశగా మారి జన బాహుళ్యం లోకి వచ్చిందన్న మాట. ఇలా విక్రమ సింహపురి లో పుట్టిన దోశ విశ్వవ్యాప్తమై అనేక శతాబ్దాలుగా కొత్త రుచులను చేర్చుకుంటూ మసాలా దోశ, కారం దోశ, ఉప్మా దోశ, ఉల్లి దోశ అంటూ మార్పులు, రూపాంతరాలు, మెరుపులు చేసుకుంటూ మన గుండెల్లోకి చేరి పోయిందన్న మాట.!!