ఇంతవరకు జగన్ రెడ్డి రమ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు?

181

-గుమ్మడి సంధ్యారాణి, పంచుమర్తి అనూరాధ

రాష్ట్రంలో రెండేళ్లుగా మహిళలు, ముఖ్యంగా దళితులపై వరుసగా అఘాయిత్యాలు, హత్యలు చోటుచేసుకుంటున్నా జగన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గుంటూరులో పట్టపగలే దళిత విద్యార్థిని రమ్యను హత్య చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. బాధిత కుటుంబాన్ని జగన్ రెడ్డి పరామర్శించక పోగా.. ధైర్యం చెప్పేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నేతలను బలవంతంగా అక్రమ అరెస్ట్ లు చేయడం దుర్మార్గం. ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.

టీడీపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రతిపక్ష పార్టీగా బాధితులకు అండగా నిలబడటం తప్పా? రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడో జగన్ రెడ్డి అండ్ కో మంటగలిపారు. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన జగన్ రెడ్డి.. ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నేతలను మాత్రం అక్రమంగా జైలులో వేయడంలో మాత్రం విజయవంతం అయ్యారు. వైసీపీ ఆర్భాటంగా తీసుకువచ్చిన దిశ చట్టం ఏమైంది? 10 నిమిషాల్లో తాడేపల్లి రాజాప్రసాదం నుంచి గుంటూరు వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించవచ్చు.కానీ దళితులన్న చిన్న చూపుతోనే జగన్ రాలేదు.

తెలంగాణలో దిశ అత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ చేసినందుకు కేసీఆర్ ను చప్పట్లు కొట్టి అభినందించిన వ్యక్తి.. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరిగుతుంటే కళ్ళు అప్పగించి చూడటం సిగ్గుచేటు. నీచులకు, కిరాతకులకు జగన్ ప్రభుత్వం బంధువుగా మారింది. దళిత విద్యార్థిని రమ్య కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు టీడీపీ పోరాటం ఆగదు.