గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్ పి సిసోడియా

87

సీనియర్ ఐఎఎస్ అధికారి అర్ పి సిసోడియా గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1991 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆర్ పి సిసోడియా సర్వీసులో ప్రవేశించిన నాటి నుండి ఇప్పటి వరకు పలు కీలక పదవులు నిర్వహించి వన్నె తెచ్చారు. ప్రభుత్వం సోమవారం జరిపిన సాధారణ బదిలీలలో భాగంగా రాజ్ భవన్ లో గవర్నర్ కార్యదర్శిగా గత రెండు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న ముఖేష్ కుమార్ మీనాను ఆహార శుద్ది పరిశ్రమల విభాగం కార్యదర్శిగా బదిలీ చేయగా, ఆ స్ధానంలో సిసోడియా నియామకం జరిగింది. ప్రస్తుతం సిసోడియా కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ గా వ్యవహరిస్తూ కీలక బాధ్యతలలో ఉన్నారు.

సమైఖ్య రాష్టంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అదనపు కమీషనర్ గా, నల్గొండ జిల్లా కలెక్టర్ గా, ఈ సేవ విభాగం సంచాలకులుగా, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించారు. ఉద్యానవన శాఖ కమిషనర్ గా, మానవ వనరుల అభివృద్ది సంస్ధ సంచాలకులుగా విశేష గుర్తింపు గడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య రాజకీయ కార్యదర్శిగా ప్రదాన భూమిక పోషించారు. మరో వైపు కేంద్ర సర్వీస్ లో సైతం క్రియా శీలకంగా వ్యవహరించిన సిసోడియా కేంద్ర ఉన్నత విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి గా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాజస్దాన్ కు చెందిన సిసోడియా జంతు శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ అనంతరం అఖిల భారత సర్వీస్ కు ఎంపికయ్యారు.