తొత్తులుగా పోలీసులు: పీతల సుజాత

219

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. సోమవారం సుజాత మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలపై జరిగే అత్యాచారాలను, హత్యలను ఆపలేని ప్రభుత్వం, న్యాయం చేయాలని అడిగిన ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్‌ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్నారు. అమల్లో లేని దిశ చట్టం పేరు చెప్పి ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు చేసే వారికి వైసీపీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందన్నారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ దళిత నాయకులపై చేయి చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా వ్యహరించాల్సిన పోలీసులు రాక్షసంగా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు జులుం ప్రదర్శించాల్సింది నిందితులపై కానీ న్యాయం చేయమని అడిగే ప్రతిపక్ష నాయకులపై కాదన్నారు. లోకేష్‌ని వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నిరసన కార్యక్రమాలు చేస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని పీతల సుజాత హెచ్చరించారు.