ఆఫ్ఘనిస్తాన్‌ దిశగా ఆంధ్రా పాలన

367

దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. రమ్య అనే దళిత విద్యార్థినిపై ఒక యువకుడు దాడి చేసి కత్తితో పొడిచి అత్యంత పాశవికంగా హతమార్చడం దారుణమైన విషయం. పట్టపగలు అందరూ చూస్తుండగా ఈ యువతిపై ఒక యువకుడు దాడిచేసి అనేకమార్లు కత్తితో పొడుస్తున్నా అక్కడున్న జనం ప్రేక్షకపాత్ర వహించడం కన్నా బాధ్యతరహిత విషయం మరొకటి లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం తీసుకువచ్చామని, మహిళలపై నేరాలకు పాల్పడిన వ్యక్తులపై 21రోజుల్లో విచారణ పూర్తి చేసి వారికి జైలు శిక్ష విధిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. ఈ చట్టం చేసి దాదాపు రెండేళ్లయినా ఇంతవరకు ఒక్క కేసులో కూడా ఈ విధంగా ఎవరికీ శిక్ష పడలేదు. మహిళలపై అత్యాచారాలు సైతం ఆగలేదు. స్వయానా జగన్‌ చెల్లెలు సునీత తనకు ఆంధ్రాలో రక్షణ లేదని, తనకు ప్రాణభయం ఉన్నదని పోలీసులకు మొర పెట్టుకున్నారంటే ఆంధ్రాలో శాంతి భద్రతలు ఏంత ఘోరంగా ఉన్నాయో అర్థమవుతోంది.

అర్థరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పారు. కానీ, స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజే… అర్థరాత్రి కాదు, పట్టపగలే అందరూ చూస్తుండగా మహిళను దారుణంగా హత్యచేశారంటే ఆంధ్రాలో నేరస్థులకు ఎటువంటి భయంలేదని తెలుస్తోంది. ఆంధ్రాలో వైకాపా నాయకులే గుండాలమాదిరిగా వ్యవహరిస్తున్నారు. నేరాలు చేసినవారికి వారు అండగా నిలుస్తున్నారు కాబట్టే ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి.
హత్యకు గురైన అమ్మాయి కుటుంబ సభ్యులను పరామర్శించటం కోసం వెళ్లిన నారా లోకేష్‌ను, నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర ఇంకా మరికొందరు తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్టు చేయటం దుర్మార్గం. పరామర్శే పాపం అయినట్లు తెలుగుదేశం నాయకులపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించటం, ఆ ప్రాంతంలో యుద్ధవాతావరణం సృష్టించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుపై రూరల్‌ ఎస్పీ చేయి చేసుకోవడం నీచమైన చర్య.గతంలో వైఎస్‌ మరణించిన తరువాత కొంతమంది మరణిస్తే వారిని పరామర్శిస్తానని చెప్పి ఒక పరామర్శ యాత్రనే జగన్‌ చేపట్టారు.

ఈరోజు తెలుగుదేశం నాయకులు అన్యాయానికి గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే అదేదో ఘోరం, నేరమన్నట్లుగా వందలాది మంది పోలీసులు మోహరించి టీడీపీ నాయకులను అరెస్టు చేశారు. వీరే కాదు, జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత టీడీపీ నాయకులను ఏదో ఒకపేరుతో ఒకరి తరువాత మరొకరిని అరెస్టు చేసి జైళ్లకు పంపి తానేదో గొప్ప విజయం సాధించినట్లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేల కోట్లు సంపాదించి జైలుకు వెళ్లి 16నెలలు జగన్‌ చిప్పకూడు తినివచ్చారు. కనుక తన మాదిరిగానే అందరూ జైలుకు వెళ్లాలనే ఆలోచనతో జగన్‌ దుర్మార్గంగా ప్రతిపక్ష నాయకులను అక్రమంగా నిర్బంధించి జైళ్లకు పంపుతున్నారు.

ఆప్ఘనిస్తాన్‌లో నేడు చట్టాలు, శాసనాలు, రాజ్యాంగం ఏదీ పనిచేయడం లేదు. తుపాకీ ఉన్నవాడిదే రాజ్యం. ఆంధ్రాలో సైతం అధికారం ఉన్నవాడిదే రాజ్యం. దళితులు, మైనార్టీలు, మహిళలపై యథేచ్ఛగా దాడులు సాగుతున్నాయి. చట్టాలు అధికారంలో ఉన్నవారికి చుట్టాలైపోయాయి. జగన్‌ చేసిందే చట్టం, శాసనంగా పాలన సాగుతోంది. అవినీతి విలయతాండవం చేస్తోంది. ఏరోజు ఎవరిపై వైకాపా గూండాలు ఆప్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల మాదిరిగా దాడి చేస్తారోనని భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ దుర్మార్గం ఎల్లకాలం కొనసాగదు. ప్రజలు అన్నిటినీ పరిశీలిస్తున్నారు, మీపాపం పండేరోజు దగ్గరలోనే ఉంది. జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లేరోజు ఎంతో దూరంలో లేదు.

కాట్రగడ్డ ప్రసూన
మాజీ ఎమ్మెల్యే, ఉపాధ్యక్షురాలు` టీడీపీ టీఎస్‌