పారదర్శక కేంద్రాలు..అంగన్‌వాడీలు

220

అంగన్‌వాడీ కేంద్రాల సేవలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పటిష్ట చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాలంటే అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే గత పరిస్థితిని చక్కదిద్ది తల్లీబిడ్డలకు ఉపయోగపడే కేంద్రాలుగా తీర్చిదిద్దింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ కేంద్రాలను మరింత పారదర్శకంగా నిర్వహించేలా తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయి.

పైన పేర్కొన్న రెండు యాప్‌లు ఈ కేంద్రాల సేవల్ని మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికే యాప్‌ల నిర్వహణపై అంగన్‌వాడీ టీచర్లకు, అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మంగళవారం టీసీఎస్‌ సాంకేతిక నిపుణులతో వర్చువల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం 32,59,042 మందికి అందించే పౌష్టికాహారంతోపాటు ఇతర సేవలను వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌ (మొబైల్‌ అప్లికేషన్‌)లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నారు. రాష్ట్ర మహిళా, శిశుసంక్షేమశాఖ పర్యవేక్షణలో ఈ ఏడాది జనవరి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్‌లో సాంకేతిక లోపాలను చక్కదిద్దడంతో కొద్దిరోజులుగా మంచి ఫలితాలు ఇస్తోంది. దీన్ని యూజర్‌ ఫ్రెండ్లీగా రూపొందించడంతో పనితీరు బాగుంది. రాష్ట్రంలోని మొత్తం అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు 3,24,378 మంది, బాలింతలు 2,23,085 మంది, మూడేళ్లలోపు చిన్నారులు 15,64,445 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 11,47,134 మంది ఉన్నారు.

వారి వివరాలను వైఎస్సార్‌ యాప్‌లో అప్‌డేట్‌ చేసి వారిలో ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం, వైద్యం వంటి సేవలు అందుతున్నది లేనిది అప్‌డేట్‌ చేస్తున్నారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్‌ నంబరుతో సహా అనుసంధానం చేశారు. పౌష్టికాహారం అందించి లబ్ధిదారుల బయోమెట్రిక్‌ సేకరిస్తారు. దీనివల్ల ఏ అంగన్‌వాడీ కేంద్రంలో ఎంతమందికి, ఎప్పుడు పౌష్టికాహార పంపిణీ జరిగిందనేది క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లోపాలను చక్కదిద్దే వీలు కలుగుతుంది.

అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరాలో లోపాలు లేకుండా చేసేందుకు ఏపీ డెయిరీ ‘మిల్క్‌ యాప్‌’ను కొద్దిరోజుల కిందట అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని 181 స్టాక్‌ పాయింట్లకు పాల వ్యాన్‌ చేరుకునే వరకు జియో ట్రాకింగ్‌ సిస్టంతో ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతోంది. ప్రతినెల సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా తల్లీబిడ్డలకు పంపిణీచేసే పాలప్యాకెట్ల వివరాలను యాప్‌లో అప్‌డేట్‌ చేయాలి. యాప్‌లో లబ్ధిదారుల బయోమెట్రిక్‌ సేకరించడం ద్వారా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎంతమంది తల్లీబిడ్డలకు పౌష్టికాహార పంపిణీ జరిగింది. ఏయే ప్రాంతాల్లో పంపిణీ పూర్తయింది. ఇంకా ఎవరికైనా పౌష్టికాహారం అందకపోతే కారణాలేమిటి? ఇలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌’ దోహదం చేస్తుంది.

ఏ పాల వ్యాన్‌ ఎక్కడ బయలుదేరింది. నిర్దేశించిన ప్రాంతానికి ఎప్పటికి చేరింది.. ఇలా పాల వ్యాన్‌ బయలుదేరిన దగ్గర్నుంచి పాలు అందించేవరకు దాన్ని కనిపెట్టేలా జియో ట్రాకింగ్‌ దోహదం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏపీ డెయిరీ రూపొందించిన ‘మిల్క్‌ యాప్‌’లో అప్‌డేట్‌ అవుతుంటాయి.