దళితబంధును విజయవంతం చేసే బాధ్యత దళిత యువతదే: సీఎం కేసీఆర్‌

226

దళితబంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, యువతదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘దళిత బంధును విజ‌యం సాధించితీరుతది. నిన్న‌నే 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుపుకున్నాం. ఈ 75 ఏండ్ల‌లో భార‌త‌దేశంలో ప్ర‌ధాని, పార్టీ కానీ ద‌ళిత కుటుంబాల‌ను ఆదుకోవాలే, ఇంటికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని ఎవ‌రైనా మాట్లాడారా? క‌నీసం వాళ్ల మైండ్‌కైనా వ‌చ్చిందా? ఆ దిశ‌గా ఆలోచ‌న చేసిండ్రా? చేయ‌లేదు. ఈ పథకం ఏడాది కిందనే మొద‌లుకావాలి. కానీ క‌రోనా వ‌ల్ల సంవ‌త్స‌రం ఆల‌స్య‌మైంది. ఐదు రూపాయాలు కూడా ఇవ్వ‌లేనోడు.. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతుండు. ప‌క్క‌న బాంబులు ప‌డ్డ‌ట్టు భ‌య‌ప‌డుతుండ్రు. ద‌ళితులు బాగుప‌డొద్దా. ఎవ‌రెవ‌రకి ఇస్తారో అని చెప్పాలంటుండ్రు. కుండబ‌ద్ధలు కొట్టి చెబుతాం, అందరికీ ఇస్తాం. ద‌ళిత మేధావులు, ర‌చ‌యిత‌లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువ‌త‌కు మ‌న‌వి చేస్తున్నా. ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేసే బాధ్య‌త మీ మీద‌నే ఉంది’ అని సీఎం తెలిపారు.

మొత్తం మంత్రివ‌ర్గం, పార్లమెంట్ స‌భ్యులు, శాస‌న‌స‌భ్యులు, ఎమ్మెల్సీలు వేదికపై ఉన్నారని, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల త‌ర‌పున నూటికి నూరు శాతం విజ‌య‌వంతం చేస్తామ‌ని సీఎస్ సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.భవిష్యత్‌లో భారత్‌లో జరగబోయే దళిత ఉద్యమానికి హుజురాబాదే పునాది అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాల్గో దశలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎస్సీలకు దళితబంధు ఇస్తామని ప్రకటించారు. రాబోయే 15 రోజుల్లో ఇంకో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని, దళితులు కూడా దనవంతులుగా మారి చూపించాలన్నారు. దళితబంధు ఇస్తామనగానే కిరికిరిగాళ్లు కొండి పెడుతున్నారని దుయ్యబట్టారు. పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయన కేసీఆర్‌ ధ్వజమెత్తారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలున్నాయని తెలిపారు.హుజురాబాద్‌లో వచ్చేనెల, రెండు నెలల్లో అందరికీ దళితబంధు వస్తుందని చెప్పారు. మిషన్‌ భగీరథపై విపక్షాలు వెకిలి మాటలు మాట్లాడాయని, ఏ పథకం ప్రవేశపెడతామన్నా విపక్షాలవి అపోహలు, అనుమానాలేనని కేసీఆర్ తప్పుబట్టారు.

ప్రభుత్వ దళిత ఉద్యోగులకూ దళితబంధును వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ‘హుజూరాబాద్‌లో ఉన్న‌టువంటి ప్ర‌తి ఒక్క ద‌ళిత కుటుంబానికి రెండు నెల‌ల్లో ఈ డ‌బ్బులు ఇస్తాం. హుజూరాబాద్ కాడ అంద‌రికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేయాలి. 25 ఏండ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు.. సిద్దిపేట ద‌ళిత చైత‌న్య జ్యోతి అని ప్రారంభించాం. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాట‌లు రూపొందించాం. 25 ఏండ్ల నుంచి నా మ‌స్తిష్కంలో ఉంది. ప్ర‌పంచవ్యాప్తంగా అణ‌గారిన, అణిచివేయ‌బ‌డ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. భార‌త‌దేశంలో ద‌ళితుల మాదిరిగా ప్ర‌పంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివ‌క్ష‌కు గుర‌య్యాయి. అంబేద్క‌ర్ పోరాటం వ‌ల్ల అన్ని ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయి.’ అని సీఎం అన్నారు.

’అయినా ఇప్పటికీ సామాజిక వివ‌క్ష ఎదుర్కొంటున్నారు. ఈ బాధ నుంచి విముక్తి కావాలి. ఇవాళ తెలంగాణ నుంచి చేసే ప‌ని దేశ‌మంతా వ్యాపించాలి. ఇవాళ మేం చేస్త‌మంటే అడ్డంకులు సృష్టిస్తున్నారు. రెండు నెల‌ల్లో హుజూరాబాద్‌లో ప‌థ‌కం అమ‌ల‌వుతుంది. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో హుజూరాబాద్ ద‌ళితులే ఆద‌ర్శం కావాలి. రాష్ట్రంలో 17 ల‌క్ష‌ల పైచిలుకు ద‌ళిత కుటుంబాలు ఉన్నాయి. రైతుబంధు త‌ర‌హాలోనే ద‌ళిత బంధు వ‌స్త‌ది. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులైన ద‌ళిత సోద‌రుల‌కు కూడా ద‌ళిత బంధు వ‌ర్తిస్తుంది.’ అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

‘ఒకాయ‌న‌కు 4 ఎక‌రాల భూమి ఉంటే రైతుబంధు వ‌స్తున్నది. రైతుబంధు లాగే ద‌ళిత బంధు వ‌ర్తిస్తుంది. ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు చివ‌రి వ‌రుస‌లో ఉండి తీసుకోవాలి. మ‌న ద‌ళితజాతిలో కూడా భూమి, జాగ లేని వాళ్లున్నారు. నెత్తి మీద అప్పులు ఉన్నాయి. అటువంటి వారికి మొట్ట‌మొద‌టి వ‌రుసలో ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటూ పోతాం. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ద‌ళితబంధు ఇచ్చే హామీ నాది. రెండు పూట‌లు పస్తులుండే వాళ్లు ల‌క్ష‌ల మంది ఉన్నారు. వారు ముందుగా తీసుకోవాలి. అత్య‌ధికంగా జ‌నాభా ఉన్న కులం ఏది అంటే ఎస్సీలే. 75 ల‌క్ష‌ల జ‌నాభా ఉంది. అతి త‌క్కువ ఆస్తులు, భూములు ఉన్న వారు కూడా ఎస్సీలే. ఇది ప్ర‌జాస్వామ్యం అయితే ప్ర‌జ‌లు ప్ర‌భువులు అయితే ద‌ళితులు ఎందుకు ప్ర‌భువులుగా లేరు. ఈ వివ‌క్ష ఎన్ని శ‌త‌బ్దాలు కొన‌సాగలే. ఇది ఉండ‌కూడ‌దు.’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.