అది దేవకన్యలు జలక్రీడలాడిన చోటు!

247

బొమ్మవరం,తాలూకా చిట్టివేలి సమ్మతు కోడూరు మజుకూరు వెలమ కరణం గంగుల తిమ్మప్ప వ్రాయించినది. క్రీ.శ.1812 -13 అంగీరస శేషాచల పర్వతానికి ఉత్తరం నల్లకొండ ఒక ఉన్నతమైన పర్వతం. ఆ పర్వతానికి పడమట రెండు పరుగుల దూరంలో గొప్ప అరణ్య స్థలం. అక్కడ రెండు చిన్న గుంటల సందులో ఎల్లప్పుడూ దివ్యమైన నీరు నిలిచి ఉండేది. అక్కడికి క్రీడా సూక్తులయిన దేవ కన్యకలు వస్తూ ఉండేవారు. కరికాల చోళ మహారాజు రాజ్యం చేసేటప్పుడు సమీప జనపదాల పుణ్య పురుషులకు తెలిసిన సంగతి. జల క్రీడల ఆసక్తితో ప్రతి దినం దేవకన్యలు వస్తూ ఉండడం చూచిన స్థలజ్ఞులు ఆ ప్రాంతాన్ని కన్యకల చెరువు అని పిలుచుకునేవారు. అది దివ్యస్థలంగా ప్రసిద్ధి చెందింది.

చోళ మహారాజుల కాలంలో ఆ కన్యకల చెరువుకు ఆగ్నేయ భాగంలో అడవి కొట్టి అనేక బ్రాహ్మణులకు జీవనోపాధి చేశారు. వారికి వృత్తి క్షేత్రాలు ఏర్పాటు చేసి గ్రామం కట్టించారు. ఆ గ్రామంలో హరిహరాదుల దేవాలయాలు ప్రతిష్ఠ చేయించారు. ఆ గ్రామానికి బ్రహ్మ వరం అని పేరు పెట్టారు. ప్రజల వాడుకలో అది బొమ్మవరం అయింది. కన్యకల చెరువు ఆసరాగా పొలం సాగు అయింది.

ఈ బొమ్మవరం గ్రామం మీసరగండ కటారి సాలువ రంగప్ప దేవమహారాజులు గారికి అమరంగా నడిచింది. ఈ రంగప్ప రాజు గ్రామానికి నైరుతి భాగంలో కోట కట్టించాడు. కోటలో వరదరాజులు దేవాలయం ఈశ్వర దేవాలయం కట్టించి ప్రతిష్ఠ చేయించాడు.

కోటకు పడమట కన్యకల చెరువు విస్తారంగా తవ్వించి కట్ట బలం చేయించాడు. రెండు తూములు పెట్టించాడు. చెరువు కింది మాగాణిని విస్తరించేటట్లు చేశాడు. గ్రామం పెంపు చేయించాడు. తూర్పు పరుగు దూరంలో ఉండే కుంజరనది వరకు పట్నం బస్తీ చేయించాడు. అప్పట్లో నిర్మాణం అయిన దేవాలయాలు.

1 గ్రామ దేవత బొమ్మవరం ఎల్లమ్మ దేవాలయం
2 హనుమంతరాయని దేవాలయం
3 వీరభద్రుని దేవాలయం

కొన్నాళ్ళకు రంగప్ప రాజుగారు స్వర్గస్థులయ్యారు. వీరి కుమారుడు మలిదేవరాజు బొమ్మవరం భోగేశ్వర స్వామికి పూర్వం నడుస్తూ ఉన్న స్వాస్థ్యం చాలదని చెరువు కింద 10 కుంటలు భోగేశ్వరుని దీపారాధనకు సోమవారం నైవేద్యానికి ధారా పూర్వకంగా సమర్పించాడు. ఇందుకు శాలివాహనశకం 1363 (క్రీ.శ 1441) దుర్మతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య నాడు మోజే బొమ్మవరం గ్రామానికి ఉత్తరం చెరువు తూము వద్ద పావుపరుగు దూరంలో దిగువన ఉంది. ఆయన ఇంకా గ్రామంలో ఉండే హరిహరాదుల దేవాలయాలకు నిత్యోత్సవాదీ సమస్త ఉత్సవాలు యథావిధిగా నడిపించాడు.

ఈ విధంగా మలిదేవరాజు పట్నం ఏలుతూ ఉండగా (హంపి) విజయనగరంలో నరపతి సింహాసనానికి అధిపతిగా ఉండిన మీసరగండ సాళువ నరసింహదేవ రాయలవారికి మలిదేవరాజుకు విరోధం కలిగింది. సాళువ వీరనరసింహరాయలు దండుతో బొమ్మవరానికి వచ్చాడు. బొమ్మవరానికి తూర్పున అగ్గితిప్ప లేదా కొరివి తిప్ప అని సన్న కొండ ఉంది. ఆ కొండకు పడమట దిన్నెఉంది. ఆ దిన్నెమెట్టు వలె ఉండగా కొండకు తూర్పుగా మొదలు చేసి నేలపాటు నుంచి కోన దడెకు రా(తి)కట్టు కట్టి ఆమార్గాన ఫిరంగి బండ్లు నడిపించాడు. పై దిన్నె మీద మోర్చా కాయం చేశాడు. అక్కడినుంచి కోట మీదికి గుండ్లు నడిపించాడు. కోట పోటు అయింది. మలిదేవరాజు కోటలోని పిన్న పెద్దలు నగరి ఎదుట కోనేట్లో దూకి తనువులు విడిచారు.

వీర నరసింహదేవరాయలు నగరులు పడ గొట్టించి ఉదయగిరి వైపు వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి బొమ్మవరం రాయరాణువకు చెల్లుతూ ఉండేది. పులుగులనాటి సీమలోకి అణకువ అయిఉండేది. యుద్ధసమయంలో హడావిడి చేతను దోపుచేతను బొమ్మవరం పట్టణంలోని సంసారులు గ్రామం విడిచి ఇతర స్థలాలకు లేచిపోయారు. గ్రామం ఉజాడు అయింది. అది మొదలు దేవాలయాలకు పరామర్శ తక్కువ అయింది. దినదినమూ దేవాలయాలు ఖిలమైపోయాయి. ఇప్పుడు కోట బురుజులు ఆవరణం పై కోట ఒకటి లోపల నగళ్ళ కోట ఒకటి ఆవరణములు ఉన్నతంగా కనబడుతూ ఉన్నాయి.(క్రీ.శ.1812 నాటికి) రెండు మట్లు (8మూరలు) పొడుగున ఉన్నది.

అది పై ఆవరణం కోటలో పడమటి వైపున ప్రాకారం లోతట్టు రాళ్ల తెట్టె దగ్గర దేవాలయం యొక్క గుణావర్ధనం ఇటుక కట్టు ఉన్నది. అక్కడికి పడమట కుటద్రుమమూలంలో నాసిక శిథిలమయిన శ్రీ మహావిష్ణువు శిలావిగ్రహం ఉంది. శంఖ చక్ర గదాఅది సాధన యుక్తంగా వరద అభయ హస్తాలతో విగ్రహం ఉంది. అక్కడికి ఉత్తరంగా కొంతదూరం వెళితే కోట అర గడి పైన అమ్మవారి విగ్రహం, భైరవేశ్వరుని విగ్రహం ఉన్నాయి. అక్కడ నుంచి వాయవ్యంగా సమీపంలో విఘ్నేశ్వర విగ్రహం ఉంది. ఇవి కాక మరికొన్ని శివ లింగాలు ఉన్నవి. మరి కొన్ని విగ్రహాలు మట్టి,రాళ్లతో పూడి ఉన్నట్లు స్థలజ్ఞులు చెబుతున్నారు. ఈ ప్రకారం కోట ఖిలపడింది. స్వల్పగ్రామంగా మిగిలింది.

నరసింహ రాయల తరువాత కృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు కాలంలో ఈ గ్రామం పులుగుల నాటికి చెల్లుతూ ఉండేది.వీర సదాశివ రాయలు రాజ్యం చేస్తూ ఈ బొమ్మ వరం గ్రామాన్ని శ్రీమన్ మహామండలేశ్వర గురవరాజు చిన్న సంగయ్య దేవ మహారాజు గారికి స్వాధీనం చేశాడు. వారు తమ ఏలుబడిలో బొమ్మవరం గ్రామంలోని మంగలి పన్ను కానికందాయం సర్వ మాన్యం సెలవిచ్చారు. ఇందుకు శాసనం శా.శ.1480 (క్రీ.శ.1558) కాళయుక్తి సంవత్సర ఆషాఢ శుద్ధ పంచమినాడు శిలాశాసనం వ్రాయించాడు. మోజే బ్రహ్మ వరం గ్రామం పడమ హనుమంతరాయని దేవాలయం ఎదుట ఈ శిలాశాసనం నిలవ పాతి ఉన్నది.

శ్రీరంగ రాయలవారి దినాల్లో ఈ గ్రామాన్ని నగరిపాడులో కలుపుకున్నారు. వెంకటపతి రాయల కాలంలో మట్ల ఎల్లమ రాజుగారు పులుగులనాడు అమరంగా పాలించిన నాటినుండి ఈ ప్రాంతం వారికి చెల్లింది. ఎల్లమరాజు తరువాత ఆయన కుమారుడు తిరు వెంగళనాథరాజు ఆ తరువాత ఆయన కుమారుడు కుమార అనంతరాజు పులుగుల నాడును పాలించారు. (వెంకటపతి రాయల కాలం నుంచి సిద్ధవటం కేంద్రంగా మట్లి రాజులు రాజ్యం చేశారు).

బొమ్మవరం గ్రామం పొలిమేర ఎల్ల సరిహద్దులు కల్లలు పడి ఉండగా మట్ల కుమార అనంతరాజు గారి ముద్ర కర్త ఓండ్ర బసవయ్య పొలిమేర హద్దులు ఏర్పాటు చేయించాడు. అడ్డనగారి పాపన్న పొలిమేర సరిహద్దులు తీర్చాడు. అందుకు అట్లమద్ది స్థలంలో పదికుంటల చేను పొలిమేర మాన్యంగా ఇచ్చారు. ఇందుకు శా.శ.15 57 (క్రీ.శ 1633) భావ సంవత్సర వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు శిలాశాసనం బొమ్మవరం గ్రామానికి తూర్పు ఎల్లమ్మ దేవాలయం ముందర నిలబెట్టి ఉన్నది.

( మహమ్మదీయుల ప్రాభవం పెరగడంతో) మట్ల వారు సిద్ధవటం కోట విడిచి పశ్చిమ రాజ్యానికి లేచిపోయారు. ఆ తరువాత గోలకొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్షాగారి దినాల్లో పెద్ద ఓరంపాడు నల్లమారు చిన్నపరెడ్డికి పులుగుల నాడు సీమ పెద్దరెడ్డి తనం ముకర్రరు ఖాయం చేశారు. ఈయనకు పెనుబాల కొర్లకుంట నగరపాడు గ్రామాల రెడ్డితనం మిరాశి ఏర్పాటు చేశారు. బొమ్మ వరంలో మడి 20 కుంటలు నిర్ణయించారు. చిన్నపరెడ్డి గ్రామవ్యవహారం చేశాడు. చిన్నపరెడ్డి తరువాత ఆయన కుమారుడు కృష్ణారెడ్డి ఈ వ్యవహారం చేశాడు.

మరికొంత కాలానికి మట్ల అనంతరాజు, వెంకట రామరాజు గార్లు పశ్చిమ రాజ్యం నుంచి వచ్చి పులుగులనాడు పొత్తపినాడు కట్టుకున్నారు. లోగడ కార్యఖడ్గాలలో తమకు సహకరించిన ఏకరిగొల్ల శ్రీ మన్ మహానాయకాచార్యులైన పెద్దఓబుల నాయని గారి రామానాయుడు గారికి బొమ్మ వరం గ్రామం శ్రీముఖ క్రీ.శ 1693సంవత్సరంలో ఇచ్చారు.

రామానాయుడి దగ్గర కార్యకర్త అయిన పోతినాయని నాగమనాయని మందలకు పారుపత్యం చేస్తూ ఉన్న తాసిలి పాపి నాయుడు బొమ్మవరం శ్రీ హనుమంత దేవునికి అఖండ దీపానికి ఈ క్రింది గ్రామాలు సమర్పించాడు.

1మౌజే మజుకూరు వాయవ్యాన పావుపరుగు దూరంలో మారా వారి పల్లె.
2 మౌజె మజుకూరు నైరుతి మూల పావు పరుగు దూరంలో శేషం పల్లి.
3 మౌజే తూర్పు అరపరుగు దూరంలో పయ్యావుల వారి పల్లె.
4 మౌజె మజుకూరు పరుగు దూరంలో మంగళంపల్లి.

ఈ పల్లెల్లోనూ, బొమ్మవరం లోనూ బందెల రొక్ఖం హనుమంత దేవుని దీపారాధనకు ఇచ్చేవారు. ఇందుకు దాఖలా శిలాశాసనం మౌజే బొమ్మ వరానికి పడమట హనుమంత రాయుడు దేవాలయం ఎదుట పాతి ఉన్నది.

ఇటీవల తిరువెంగళనాథ రాజుగారు ఏలుతూ ఉండగా వెంకట రామ రాజు గారి కుమారుడు అనంత రాజు గారు తమ తండ్రి పేరట ఎర్రగుంట్ల కోటలో కోట వెంకట రామరాజు పురం అనే అగ్రహారం చేసి అగ్రహారం వృత్తులకు మడి భూమికి గానూ శాలివాహన శకం 1625 క్రీ.శ.1703 స్వభాను సంవత్సరంలో బొమ్మ వరం లో మడి కుంటలు 360 చేనికి గానూ అదివరకూ బొమ్మవరం లోకి చెల్లి చెన్నవంక పల్లి అనే పల్లె వలయ వామనశాసనంతో కూడా అగ్రహారికులకు కేటాయించారు.

తిరువెంగళ నాథ రాజుగారి ప్రభుత్వంలోనే వీరి తమ్ముడు అయిన కుమార అనంతరాజు గారు శా.శ. 1626 (క్రీ.శ.1704) తారణ సంవత్సరంలో బొమ్మవరం గ్రామంలోని 40 కుంటల చేను ప్రత్యేకించి కాలువ వీరరాఘవ భట్లకు కండ్రిక సర్వమాన్య అగ్రహారంగా ఇచ్చారు. ఈ రెండు అగ్రహారాల కైఫియత్ ప్రత్యేకంగా వ్రాయబడింది.

1 మోజే బొమ్మ వరానికి దక్షిణం కమ్మపల్లె పరుగు దూరంలో ఉంది.
2 మౌజే బొమ్మవరానికి తూర్పు పరుగు దూరంలో గద్దలరేవుల పల్లి
3 ముజే ముప్పావు పరుగు దూరంలో రాచపల్లి.

కుమార అనంతరాజు గారి దొరతనం లో బొమ్మవరం పులుగుల నాడు సీమకు చెందింది. తరువాత అనంత రాజు గారు దొరతనం చేశాడు. తరువాత ఆయన కుమారుడు చిన్న వెంకటరామరాజు ఒక సంవత్సరం చేశాడు. పింగళసంవత్సరం క్రీశకం1737 చైత్ర శుద్ధ ద్వాదశినాడు కోటలో కాలం చేశాడు.