సంస్కరణలతో తెలంగాణ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’ : కేసీఆర్‌

350

తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకున్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి.. అటుపై సాయుధ దళాల నుంచి గౌరవ వందనం అందుకున్నారు ఆయన. అనంతరం కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ఉద్ఘాటించారు. ‘‘ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్‌ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు.

ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా చాటి చెప్పారు. దేశంలో కనీస అవసరాల కోసం ప్రజలు ఇంకా అల్లాడే పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశం సాధించిన అభివృద్దిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకొన్న రోజు నుండి అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు.రాష్ట్ర జీఎస్‌డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆ సంస్కరణలతో తెలంగాణ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా నిలిచిందని సీఎం కేసీఆర్‌ అభివర్ణించారు.

రైతులకు రూ.50వేల లోపు రుణాల మాఫీ ఇవ్వడంతో పాటు ధరణి పోర్టల్‌ ద్వారా భూమి లెక్కలు తేల్చామని, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, వరంగల్‌లో అధునాతన ఆస్పత్రిని నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ప్రగతి భవన్‌లో….
ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.