సొంత స్థలంలో దౌర్జన్యంగా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..

189

ఓటేసి గెలిపించినందుకు తగిన శాస్తి చేస్తున్నాడు..
– ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు.

వినుకొండ: తమ తాతల నాటి సొంత పొలంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దౌర్జన్యంగా అక్రమ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయటం చట్టవిరుద్ధమని భూమి బాధితుడు చవలం శ్రీనివాస్ రావు, భార్య జ్యోతి, వినుకొండ జయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత భూమిలో నుండి అక్రమంగా JCB యంత్రాలతో చేపడుతున్న పనులను బాధిత రైతులు అడ్డుకున్నారు. బాధితుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమకు 4.75 ఎకరాల భూమి కలదని, ఈ భూమే మాకు జీవనాధారం అని, ఇద్దరు ఆడపిల్లలకు పసుపు కుంకుమ కింద కొంత భూమిని ఇవ్వడం జరిగిందన్నారు.

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మరికొందరు కలిసి మా అనుమతులు లేకుండా సమాచారం ఇవ్వకుండా సొంత భూమిలో నుండి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం ఏమిటని, ఓట్లేసి గెలిపించినందుకు ఎమ్మెల్యే తగిన శాస్తి చేస్తున్నారని ఆవేదన చెందారు. మా భూమిలో నుండి రోడ్డు వేయడానికి వీలు లేదని అన్నారు. జయలక్ష్మి మాట్లాడుతూ మాకు ఉన్న 70 సెంట్లు భూమి మొత్తంలో ఎమ్మెల్యే అక్రమంగా రోడ్డు వే యిస్తున్నారని ఆరోపించారు. తమ పొలాలకు వెనుక ఉన్న వారికి రోడ్డు అవసరమని ఒప్పందం కుదుర్చుకుని ఇలా చేయడం చట్టవిరుద్ధం అన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు చట్టపరంగా కోర్టును ఆశ్రయించడం జరుగుతుందని హెచ్చరించారు. వెంటనే రోడ్డు పనులు నిలిపి వేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.