అన్ని కులాల వారు అర్చకులు కావచ్చు

209

– స్టాలిన్ సంచలన నిర్ణయం

అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బలహీన వర్గాలకి చెందిన 58 మందికి అవకాశం కల్పిస్తూ ఇవాళ(శనివారం-ఆగస్టు 14) అర్చక నియామక పత్రాలను అందించారు. దీంతో దేవాలయాల్లో అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని పోరాడిన దివంగత నేత కరుణానిధి ఆశయాన్ని కుమారుడు స్టాలిన్ నెరవేర్చారు.

అంతేకాదు.. తమిళనాడులోని ప్రముఖ ఆలయాలలో అన్ని వర్గాలకు చెందిన నూతన అర్చకులను సీఎం స్టాలిన్ శనివారం నియమించారు. మరోవైపు రానున్న రోజులలో తమిళనాడులోని అన్ని ప్రముఖ దేవాలయాలలో మహిళా అర్చకులను కూడా నియమిస్తామని.. మహిళలతోపాటు అర్చకత్వంలో ఎటువంటి వివక్షత లేకుండా అన్ని కులాల వారికీ అవకాశం కల్పిస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మహిళా అర్చకులకు శిక్షణ తరగతులను ప్రారంభించింది స్టాలిన్ ప్రభుత్వం.