జర్నలిస్టు రాజకీయాల్లో కొత్త మలుపులు

502

దేవులపల్లి అమర్, కే శ్రీనివాసరెడ్డి.. జర్నలిస్టు ప్రతినిధులుగా పేరుగడించిన ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగానూ విమర్శలు చేసుకుంటున్నారు. వారి గురించి తెలిసిన వారు ఆశ్చర్యపోతారు గానీ ఇది నిజం. ఏపీలో యూనియన్ నేతల నుంచి ప్రభుత్వ సలహాదారులుగా ఎదిగిన వారు జర్నలిస్టుల సంక్షేమం మరచిపోయారా అని శ్రీనివాసరెడ్డి పరోక్షంగా అమర్ ని ఎద్దేవా చేశారు. ఆ వెంటనే అమర్ కూడా రంగంలో దిగారు. ఏపీలో జర్నలిస్టుల మీద దాడులు జరగడం లేదని, ఉత్తరాదిన జరుగుతుంటే ఎందుకు మిన్నకున్నారంటూ జాతీయ నాయకుడిగా ఉన్న ఒకనాటి తన సహచరుడిని ప్రశ్నించారు. ఇదో ఆసక్తికర సంవాదం.

దానికి తోడు ఆగష్టు 17 ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని సావదాన దినంగా జరపాలని ఆ సంఘం నిర్ణయించింది. కానీ దానిని సగర్వ దినంగా పాటించాలని అదే సంఘానికి అనుబంధంగా ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, సాక్షి బ్యూరో చీఫ్‌ శ్రీనివాస్ తో పాటుగా ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పీఆర్వో మాణిక్యాలరావు ఓ ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని జగన్ విస్మరించారని ఏపీడబ్ల్యూజే నేతలు విమర్శిస్తే, త్వరలో తీపి కబురు అందుతుందని విడిగా ప్రకటన విడుదల చేసిన నేతలు పేర్కొన్నారు.
చాలాకాలంగా ఏపీడబ్ల్యూజే ఒక పిలుపునిస్తే ఏదో మేరకు అమలు చేయడమే చూశాం. తొలిసారిగా బహిరంగంగా భిన్నాభిప్రాయాలు వినిపించడం విశేషం. ఇది ఆ సంఘ ప్రతిష్టను దెబ్బతీస్తుందనడంలో సందేహం లేదు. జర్నలిస్టులకు కూడా ఏదో మేరకు కీడు చేస్తుందనడం కూడా నిస్సందేహం.