బానిసగా వర్ణించిన ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలి: తలసాని

206

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి, ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బానిసగా వర్ణించిన ఈటల భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మత్య్స, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి శ్రీనివాస్ యాదవ్ గెలుపు లాంఛనమేనని వెల్లడించారు. ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగితే 60లక్షల టీఆర్‌ఎస్ కుటుంబసభ్యులు చూస్తూ ఊరుకోరని అన్నారు.

మంత్రి తలసాని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొండపైన హోటల్ హరితలో మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాలపై కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రతిపక్ష పార్టీలు బాధ్యత లేకుండా నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారని ఆరోపించారు. దళిత బంధు రాష్ట్ర పథకమని, ఏదో ఒక ప్రాంతంలో ముగిసేది కాదని, రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తామని పేర్కొన్నారు.యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిర్మాణాలు చరిత్రలో నిలిచిపోయేలా జరుగుతున్నాయని, హిందువులమని చెప్పుకునే కేంద్ర అధికార బీజేపీ దేశంలో ఎక్కడనైనా దేవాలయాలు నిర్మించారా? హిందు పండుగులను అధికారికంగా నిర్వహించారా? అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. పూర్తి ప్రభుత్వ ఖర్చులతోనే యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర పథకాల అమలుతీరుపై కేంద్ర ప్రభుత్వమే ప్రశంసిస్తుంటే, ఇక్కడి బీజేపీ నాయకులు మాత్రం విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఏడేళ్లుగా రాష్ర్టానికి ఒక పథకానైనా తీసుకువచ్చారా అని బీజేపీ నాయకులను అడిగారు. యువతను లీడర్లను చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు.

7 ఏండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. త్వరలో 50 నుంచి 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ భీకూ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.