రోల్ మోడల్ గా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర

271

– పాదయాత్ర పర్యవేక్షణకు జాతీయ నాయకుల రాక
– టీఆర్ఎస్ పాలనలో మోసపోయిన వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేలా యాక్షన్ ప్లాన్
– కుల సంఘాల నేతలను కలిసి పాదయాత్రకు సంఘీభావం కోరాలని నిర్ణయం
– పాదయాత్ర సన్నాహక సమావేశాల్లో నిమగ్నమైన బీజేపీ రాష్ట్ర నాయకత్వం
– పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కమిటీల పనితీరుపై సమీక్ష
– సమన్వయంతో పనిచేస్తూ పాదయాత్రను విజయవంతం చేయాలని కోరిన నేతలు

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుండి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ ను కనివినీ ఎరగని రీతిలో సక్సెస్ చేయాలని బీజేపీ నిర్ణయించింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాదయాత్ర సన్నాహాక ఏర్పాట్లపై శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ నేతలు సుధీర్ఘ సమీక్ష నిర్వహించారు. పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సంఘటన్ ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, సహ ప్రముఖ్ లంకల దీపక్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పై పాదయాత్ర లో భాగంగా ఏర్పాటు చేసిన 30 కమిటీల పనితీరుపై సమీక్షించారు.
టీఆర్ఎస్ పాలనలో మోసపోయిన వర్గాలన్నింటినీ పాదయాత్ర ద్వారా కలుసుకుని సీఎం కేసీఆర్ మోసాలను ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశం నిర్ణయించింది.

అందులో భాగంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పేరుతో కేసీఆర్ మాటలను నమ్మి మోసపోయిన కుల సంఘాల పెద్దలందరినీ కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపేలా కోరేందుకు నేతలు సిద్ధమయ్యారు.అదే విధంగా నిరుద్యోగ భ్రుతి ఇస్తామని, ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగట్టే యాక్షన్ ప్లాన్ లో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగ సంఘాలను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపేలా కోరేందుకు సిద్దమైంది.

పాదయాత్ర కొనసాగే ప్రాంతంలో ఎదురయ్యే స్థానిక సమస్యలతోపాటు నిమ్జ్ భూసేకరణ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి పెండింగ్ పనులను పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రస్తావిస్తూ ప్రజలను ఛైతన్యం చేయాలని నిర్ణయించారు.మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం సైతం ‘ప్రజా సంగ్రామ యాత్ర’పై ప్రత్యేక ద్రుష్టి సారించింది. పాదయాత్ర తీరుతెన్నులు, సన్నాహక ఏర్పాట్ల పర్యవేక్షణకు సెంట్రల్ కమిటీ నుండి నలుగురు నాయకులను తెలంగాణకు పంపాలని నిర్ణయించింది. అలాగే పాదయాత్రకు కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు హాజరై సంఘీభావం తెలిపేలా కార్యాచరణ రూపొందించింది.
పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన 30 కమిటీల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయా కమిటీలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఎప్పటికప్పుడు ఆయా కమిటీల పనితీరుపై సమీక్షించాలని నిర్ణయించారు.ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాతోపాటు కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు రెండు, మూడు రోజుల్లో వర్క్ షాప్ నిర్వహించాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు.

‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఉద్దేశాలను కొత్తగా రూపొందించిన పాటలను వివరిస్తూ కళాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. పాదయాత్ర తొలిదశలో భాగంగా 25 మంది కళాకారులను ఎంపిక చేసి వారికి ఈ వర్క్ షాప్ లో తగిన శిక్షణ ఇవ్వనున్నారు.పాదయాత్రలో భాగంగా తామూ నడిచేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువత ముందుకు వస్తున్న నేపథ్యంలో అందులో 300 మందిని ఎంపిక చేసి…పాదయాత్ర ఉద్దేశం, లక్షాలను వివరించడంతోపాటు పాదయాత్రలో అనుసరించాల్సిన పద్దతులపై కూడా వారికి శిక్షణ ఇవ్వనున్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర ను కేంద్ర నాయకత్వం మోడల్ గా తీసుకోవాలని భావిస్తున్న అంశంపై సమావేశంలో చర్చకొచ్చింది. అందులో భాగంగా పాదయాత్రను పర్యవేక్షించడానికి కేంద్రం నుండి నలుగురు నాయకులు వస్తున్న విషయాన్ని సమావేశంలో వివరించిన నాయకులు పాదయాత్ర పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటూ పరిశీలన జరిపే అవకాశాలున్న నేపథ్యంలో పాదయాత్రను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా ఆయా కమిటీలు కృషి చేయాలని కోరారు.తొలిదశ పాదయాత్ర 7 జిల్లాల గూండా సాగుతున్నందున ఆయా జిల్లాల నాయకులతోనూ పాదయాత్ర ప్రముఖ్, సహ ప్రముఖ్ లు ఎప్పటికప్పుడు సమావేశమై పనితీరును అడిగి తెలుసుకుంటున్నారు.