ప్రత్తిపాడు దేశంలో కుమ్ములాటలు

224

ప్రత్తిపాడు దేశంలో కుమ్ములాటలు
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం లో ఓసి ఇంచార్జి నియామకం

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ఏకంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నే బాహ- బాహి కి దిగారు ఆ పార్టీ కార్యకర్తలు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోనీ వట్టిచెరుకూరు మండలం లో గ్రామ కమిటీల నియామకం లో కార్యకర్తలు కుర్చీలు తీసుకొని ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు. ఇలా ప్రత్తిపాడు తెలుగుదేశంలో అంతర్గత కుమ్ములాటలు ఎగువ స్థాయి నుండి దిగువ స్థాయి నాయకుల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాయిన డొక్కా మాణిక్య వరప్రసాద్, వైసిపి గూటికి చేరారు. దీనితో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను సీనియర్ నాయకులు మాకినేని పెదరత్తయ్యకు అప్పగించారు.
ఆయన అంటే పొసగని వారు పార్టీ లో చాలామంది ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం లో ఓసి ఇంచార్జ్ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో మరొక ప్రముఖ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అనుచరుడు పూనాతి రమేష్ కు రత్తయ్య కు మధ్య విభేదాలు అందరికీ తెలిసిందే. ప్రత్తిపాడులో పార్టీ బలంగా ఉన్నా, నాయకుల మధ్య విభేదాల తో విజయం వరించని దీనస్థితి ఇక్కడ నెలకొంది. స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయకుండా వలస నేతలకు టికెట్లు ఇవ్వడంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శలున్నాయి.

ఆనాడు రావెల కిషోర్ బాబు కు టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రిని కూడా చేశారు. ఆయన పార్టీ నాయకులతో సఖ్యత లేకపోవడం పార్టీని వీడిపోవడం జరిగింది. మాణిక్య వరప్రసాద్ కూడా పార్టీని వదిలి వెళ్లారు. ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకుని పోటీ చేసి ఓడిపోయిన కందుకూరి వీరయ్య అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు అంతంతమాత్రంగా హాజరవుతున్నారు. ఎస్సీ నియోజకవర్గం లో ఓసీల పెత్తనాన్ని జీర్ణించుకోలేక నే ఎస్సీ నాయకత్వం ఇక్కడ బలపడ లేదన్న వాదనలు లేకపోలేదు. ఏది ఏమైనా అధినేత చంద్రబాబు ఉండే జిల్లాలో నియోజకవర్గాల్లో పార్టీలో కుమ్ములాటలు నెల కొనడం ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా క్యాడర్ లో ఉత్సాహన్ని నింపేందుకు నేతల మధ్య విభేదాలను సరిచేసి పార్టీని ముందుకు నడిపించాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతున్నారు.
– వీఆర్సీ