సుఖదుఃఖాలు సహించడమే సాత్విక లక్షణం!

461

సుఖం మానవుని సహజ గుణం. మానవుడు సాత్విక కర్మల చేత సుఖాన్ని పొందుతాడు. అప్పటికే ఉన్న దుఃఖములను పోగొట్టుకుంటాడు. ఇదీ మానవుని కర్తవ్యము. కానీ మానవులు తమ అజ్ఞానం వలన, తాము చేసే రాజస, తామస కర్మల వలన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నారు. రాజస గుణం కలవాడికి వాడు చేసే కర్మల వలన సుఖం లభిస్తుంది. తామస గుణం కలవాడికి, నిద్రలో, నిద్రలాంటి మత్తులో సుఖం లభిస్తుంది. కాబట్టి మానవులు అనుభవించే సుఖము ఎలా వస్తుంది అంటే వాళ్ళు చేసే పనుల వలన వస్తుంది. అందుకే మానవులు అందరు “నేను సుఖంగా ఉన్నాను” అనే భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనినే పాజిటివ్ థింకింగ్ అని అంటారు. దానికి అవసరమయ్యేది అధ్యాత్మ విద్య దానిని అభ్యాసం చేస్తే నిరంతరం సుఖం కలుగుతుంది. సుఖాలను పొందడం దుఃఖాలను పోగొట్టుకోవడం మన చేతిలో ఉంది. అది కేవలం అభ్యాసం వలననే వస్తుంది కానీ మాటల వలన రాదు.

కొంత మందికి సుఖం ఇస్తుంది. కానీ ఏది తినాలి అనేది మన చేతుల్లో ఉంది. మితంగా తింటే సుఖం. ఎక్కువగా తింటే దుఃఖం. నీరు తాగితే దాహం తీరి సుఖం ఇస్తుంది. కాని తాగకూడనివి తాగితే దాహం ఎక్కువ అవుతుంది. మత్తు వస్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కక్కేస్తాడు. తరువాత అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అలవాట్లు. ఈ అలవాట్లు మంచివి అయితే పరవాలేదు. కానీ చెడ్డవి అయితే దుఃఖం తెచ్చిపెడతాయి.

ఒకే వస్తువు, ఒకే పరిస్థితి, ఒకడికి సుఖం కలిగిస్తే మరొకడికి దుఃఖం కలిగిస్తుంది. ఆంధ్రాలో పుట్టిన వాడికి ఆవకాయ రుచిగా ఉంటే, నార్త్ లో పుట్టిన వాడికి నోరుమండుతుంది. ఇక్కడ సాంబార్, రసం, ఇత్యాది రుచిగా ఉంటే, నార్త్ లో వాడికి రొట్టె, కూర రుచిగా ఉంటుంది. కాబట్టి దేనికైనా నాలుక అలవాటు పడాలి. ఇంకొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే కొంత మంది మగాళ్ళకు, కట్టుకున్న భార్య తప్ప, ఇతర స్త్రీలంతా అందంగానే ఉంటారు. ఒకడు ఒక కారు అమ్ముతుంటే ఆనందం. అదే కారును కొనుక్కున్న వాడికి ఆనందం. అమ్మిన వాడికి ఆ కారు రేటు పెరిగితే దుఃఖం. కొన్న వాడికి అదే కారు ఇంకా తక్కువగా వస్తుందంటే దుఃఖం. ఇలా సుఖదుఃఖాలు ఒకటి వెంబడి ఒకటి వస్తుంటాయి పోతుంటాయి. వీటికి అంతులేదు. వీటిని సహించడమే సాత్విక లక్షణం.