అమర్ జీ మీకిది తగదు!

741

తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్లు అని తెలుగులో ఓ సామెత ఉంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ గారి పత్రికా ప్రకట విషయంలో ఖచ్చితంగా అతికినట్లు ఉంది. రాష్ట్ర కేంద్ర స్థాయిలో జర్నలిస్టుల యూనియన్ ద్వారా నాయకత్వ స్థాయికి ఎదిగిన అమర్ కు తగిన స్థాయిలో ఆయన ప్రకటన‌లేదు. ఆయన పత్రికా ప్రకటన పూర్తిగా అసత్యాలు, అర్ధ సత్యాలతో కూడినదిగా ఉంది. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఐజేయూ జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాసరెడ్డి ఈనెల 11 న విజయవాడలో జరిగిన పత్రికావిలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలను అసత్యాలుగా చిత్రీకరించేందుకు అమర్ ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఉప్పు, పులుసు తింటున్న, సర్వ సౌకర్యాలు అనుభవిస్తున్న ప్రభుత్వ మీడియా సలహాదారు అంతకన్నా భిన్నంగా ప్రకటన చేస్తారని ఆశించడం ఏపీయూడబ్ల్యూజే ఒక సాధారణ సభ్యుడిగా తప్పే అవుతుంది. శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన ప్రతి విషయం, ఏపీలో జర్నలిస్టులు అనుభవిస్తున్న దారుణ పరిస్థితులపై వ్యక్తం చేసిన ఆవేదన అక్షర సత్యాలు. ఇది ఆయనకు జర్నలిస్టుల యూనియన్ పట్ల ఒక జాతీయ నాయకుడికి ఉండాల్సిన నిబద్ధతను వెల్లడిస్తున్నది. అటువంటి వ్యక్తిపై బురద జల్లేందుకు అమర్ ప్రయత్నించడం దురదృష్టకరం. ఆయన నిబద్ధత గురించి అమర్ కు తెలియంది కాదు. ఆయన పూర్తి సహాయ సహకారాలతోనే ఈ ప్రస్తుత స్థాయికి తాను ఎదిగిన విషయం కూడా అమర్ కి బాగా తెలుసు.

అమర్ శుక్రవారం చేసిన పత్రికా గోష్టిలో ముఖ్యమంత్రి, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే జర్నలిస్టుల హెల్త్ స్కీం పై , ప్రమాద బీమా పథకంపై తొలి సంతకం చేశారని అమర్ గారు చెప్పారు. ఇది పచ్చి అబద్దం. ఎంత మంది జర్నలిస్టులకు ప్రమాద బీమా, హెల్త్ కార్డులు అందజేశారో ఆయనే చెప్పాలి. రెండు, కోవిడ్ సోకి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు శ్రీనివాసరెడ్డి, అమర్ ల సమక్షంలో సీఎం అంగీకరించి జీవో జారీ చేశారు. కానీ ఆ జీవోని సమాచార శాఖామంత్రి, సమాచార శాఖ కమిషనర్ భేఖాతరు చేసి నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించి ఆ జీవోతో తమకు సంబంధం లేదని చెప్పడం వాస్తవం కాదా. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ధిక్కరించడం కాదా అమర్ గారు జర్నలిస్టులకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ జీవో ప్రకారం కరోనా బారిన పడి మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించి ఆదుకోకుండా ఆకుటుంబాలను మానసిక హింసకు గురి చేయడం ఎంత వరకూ సమంజసం. అది జర్నలిస్టు కుటుంబాలపై హింసగా అమర్ కు అనిపించలేదా.

ఈనెల 17 వ తేదీన ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవాన్ని సావధాన దినంగా పాటించి జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలని నాయకత్వం ఆందోళనకు పిలుపు ఇచ్చిన తరువాత అమర్ ఆఘమేఘాలమీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మద్ధతుగా ప్రకటన చేయడం సిగ్గుచేటు. మృతి చెందిన జర్నలిస్టులకు రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని మించి శాశ్వత వసతి గృహ వసతి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన చెప్పుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆందోళనకు పిలుపు ఇవ్వకముందు ఈ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదో అమర్ గారికే తెలియాలి. గత రెండేళ్లుగా రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రిడేషన్స్ మంజూరు చేయకుండా సాచివేత వైఖరిని అవలంభించి సమాచార శాఖ కమిషనర్ తనకు సన్నిహితుడైన ఒక వాహినివారి పెద్ద మనిషి తో కోర్టులో కేసు వేయించడం వాస్తవం కాదా..? ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అక్రిడేషన్ కమిటీలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపగా గతంలోనే కేంద్రం వాటిని అమోదించింది. ఆ మార్గదర్శకాలలో కమిటీలలో జర్నలిస్టుల సంఘం ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టంగా పేర్కొన్న విషయం ఎంతో అనుభవజ్ఞులైన అమర్ కు తెలీదా. అక్రిడేషన్ కమిటీని కమిషనర్ అధికారులతో నింపుతున్నప్పుడు అమర్ ఎందుకు నోరు మెదపలేదు. ఇప్పుడు కమీటీలలో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించే యోచన చేస్తున్నట్లు ఆయన ప్రకటించడం ఏపీయూడబ్ల్యూజే ఇచ్చిన ఆందోళన పిలుపు పర్యవసానం కాదా..?

చిన్న పత్రికలకు సంబంధించి అక్రిడేషన్ లను నిరాకరించేందుకు జీఎస్టీ నిబంధనలను పెట్టిన విషయం అమర్ కు తెలియదా.? ఇప్పుడు దాన్ని సడలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించడంలోనే జర్నలిస్టుల పై సమాచార కమిషనర్ హింసకు పాల్పడినట్లు తెలుస్తోంది. రూ.2 కోట్లు టర్నోవర్ మించని ఏ సంస్థ అయినా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు నిబంధనలు వర్తించదనే విషయం అమర్ జీ కి తెలియదా.? గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికలకు ఏ ఒక్క ప్రభుత్వ యాడ్ అయినా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా.? మరి ఏ విధంగా జీఎస్టీ అడుగుతారు.? అందుచేత రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్పందించి తన సమక్షంలో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులతో భేటీకి ఒక తేదీని ఖరారు చేసే వరకూ ఏపీయూడబ్ల్యూజే నిర్ణయించిన ఆందోళన కార్యక్రమం యధావిధిగానే కొనసాగించాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

ధన్యవాదాలతో

ఇట్లు
ఎస్కే బాబు
సీనియర్ జర్నలిస్టు
విజయవాడ