కేసీఆర్ “నిజస్వరూపం”

263

జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో పొగడ్తలు: “కేసీఆర్ గారు చాలా ఔదార్యం ఉన్న మంచి వ్యక్తి”

కేసీఆర్ గారి నోట – నాటి మాట: “గోదావరి జలాలను శ్రీశైలం రిజర్వాయరు ద్వారా రాయలసీమకు అందించి రతనాలసీమగా మార్చడానికి సహకరిస్తా!”

నిన్నటి మాట: “బేసిన్లు లేవు – భేషజాలు లేవు”

నేటి మాట: “కృష్ణా నదీ జలాలపై రాయలసీమకు హక్కే లేదు. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్, ముచ్చుమర్రి, మాల్యాల అక్రమ నిర్మాణాలు, వాటిని బంద్ చేసి తెలుగుగంగ, గాలేరు – నగరి, హంద్రీ-నీవా, కె.సి.కెనాల్ కు శ్రీశైలం రిజర్వాయరు నుండి నీటి తరలింపుకు అడ్డుకట్ట వేయండి. కె.సీ. కెనాల్ ద్వారా తుంగభద్ర నీటిని అధికంగా వాడుకొంటున్నారు, నిరోధించండంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు హుకుం జారీ చేశారు”

నిత్య కరవు పీడిత రాయలసీమకు కృష్ణా జలాల తరలింపే ఏకైక పరిష్కారమని 1960 దశకం నుండి కమ్యూనిస్టులు, ఇతరులు చేసిన పోరాటాల ఫలితంగా కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు మూడున్నర దశాబ్దాల నుండి నిర్మాణంలో ఉన్నాయి.
వాటికి పర్యావరణ, అటవీ అనుమతులున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 11(10) జాబితాలో పొందుపరచారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా కృష్ణా – గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధులను నిర్ధేశిస్తూ జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కోన్నారు. అయినా, కేసీఆర్ వాటిని అక్రమ ప్రాజెక్టులంటూ, నీటి సరఫరాను ఆపేయాలంటూ నానా యాగీ చేస్తున్నారు.
కేసీఆర్ గారి నిజస్వరూపాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తించారా!

– టి.లక్ష్మీనారాయణ
కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక