టీటీడీకి మహా జంబో కమిటీ?

590

– 70 మందికి సిఫార్సులు?
– 55 మందితో కొత్త బోర్డు?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి నియమితులయిన నేపథ్యంలో సభ్యుల నియామకంపై కసరత్తు ప్రారంభమయింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక దేవాలయాల్లో ఒకటయిన టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం, ప్రతిసారీ విపరీతమైన పోటీ ఉంటుంది. దానికోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, కేంద్రమంత్రులు, పీఠాధిపతుల నుంచి కూడా భారీ సంఖ్యలో సిఫార్సులు వస్తుంటాయి. వారితోపాటు, స్థానికంగా ఉన్న రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలకు కూడా చోటు కల్పించడం ఏపీ ముఖ్యమంత్రులకు కత్తిమీద సాములా మారుతుంటుంది. ఈసారి ఆ వంతు జగన్‌కు వచ్చింది.

నిజానికి టీడీపీ పాలకమండలి సభ్యుల సంఖ్య గత రెండున్నరేళ్ల వరకూ 15 మందికే పరిమతమయింది. ఈ సంఖ్యను జగన్ సీఎం అయిన తర్వాత 25కి పెంచారు. ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఎక్కువమందికి పదవులివ్వాలన్న లక్ష్యంతో, మరో 11 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. నిజానికి చంద్రబాబు నాయుడు ఈ ఆహ్వానితుల వ్యవస్థను ప్రారంభించారు. సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సహా మరో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆ సంఖ్యను 11కి పెంచారు.

కాగా పాత పాలకమండలి పదవీకాలం ముగిసి, కొత్తగా వైవి సుబ్బారెడ్డి మరోసారి చైర్మన్‌గా నియమితులయిన నేపథ్యంలో, బోర్డు సభ్యుల సంఖ్యను మరింత పెంచాలన్న యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా మొత్తం బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను 55 వరకూ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం వరకూ కేవలం 15 మంది మాత్రమే ఉన్న పాలక మండలిలో.. 12 మంది నామినేటెడ్ సభ్యులు, టీటీడీ ఈఓ, ప్రిన్సిపల్ సెక్రటరి (రెవిన్యూ), దేవదాయ శాఖ కమిషనర్లు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండేవారు. ఆ 12 మంది నామినేటెడ్ సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మహిళలు, ఒక ఎస్సీ, ఒక బీసీ వర్గానికి చెందిన సభ్యులుండేవారు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఈ విధానం అమలయింది. విభజన తర్వాత సీఎం అయిన చంద్రబాబునాయుడు ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఆ సంఖ్యను ప్రస్తుత సీఎం జగన్ 11కు పెంచి, అసలు పాలకవర్గసభ్యుల సంఖ్యను 25కు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు.

టీటీడీలో చోటు కోసం ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిఫార్సులు వచ్చినట్లు చెబుతున్నారు. వీరుకాకుండా సీఎం జగన్ మిత్రులు, వైసీపీ కీలక నేతల బంధు మిత్రులు, మహారాష్ట్ర పారిశ్రామికవేత్తలు సిఫార్సు చేసిన వారి సంఖ్య 70కి చేరుకున్నట్లు సమాచారం. వీరిలో ఎంత వడపోసి కసరత్తు చేసినా, అందులో 53 మందిని తొలగించడానికి అసలు సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. ఆ ప్రకారంగా మొత్తం 55 మందిని నియమించే అవకాశాలున్నట్లు వైసీపీ వర్గాల సమాచారం.

ఎక్స్ అఫిషియో అవసరమా?
నిజానికి టీటీడీలో ప్రిన్సిపల్ సెక్రటరి (రెవిన్యూ) ఎక్స్ అఫిషియో సభ్యుడు కాదు. బోర్డు తీర్మానాలు ఆమోదించేది ఎలాగూ రెవిన్యూ సెక్రటరీనే కాబట్టి, మళ్లీ ఆయనను ప్రత్యేకంగా బోర్డులో ఎలా నియమిస్తారన్న చర్చ చాలా ఏళ్ల నుంచి నడుస్తోంది. అలాగే తుడా చైర్మన్ కూడా అప్పట్లో టీటీడీ మెంబరు కాదు. కానీ వైఎస్ సీఎం అయిన తర్వాత రమణాచారి కోసం, బోర్డులో ప్రిన్సిపల్ సెక్రటరి (రెవిన్యూ) హోదా కల్పించినట్లు అధికార వర్గాలు చెబుతుంటాయి. తుడా చైర్మన్ అనేది రాజకీయపరమైన నియామమయినందున, అ వ్యక్తి హిందూయేతరుడైతే నిబంధనల ప్రకారం టీటీడీ పాలకమండలికి అనర్హుడవుతారు. అందుకే వైఎస్ ప్రత్యేకంగా తుడా చైర్మన్ కోసమే కాకుండా, ప్రిన్సిపల్ సెక్రటరి (రెవిన్యూ) హోదాలో ఇద్దరినీ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా చేర్చారు. అయితే వైఎస్ మృతి చెందిన సీఎంగా వచ్చిన రోశయ్య ప్రిన్సిపల్ సెక్రటరి (రెవిన్యూ)ని తొలగించి, ఆయన స్థానంలో ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్)ని నియమించారు. రోశయ్య తర్వాత సీఎంగా వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఆ విధానాన్నే కొనసాగించారు. తిరిగి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీఎం అయిన చంద్రబాబు నాయుడు, మళ్లీ వైఎస్ విధానాన్నే అమలుచేశారు.

జంబో కమిటీకి చోటేదీ?
కాగా జంబో కమిటీని నియమిస్తారన్న ప్రచారం నేపథ్యంలో.. అసలు అంతమంది సభ్యులు ఎక్కడ కూర్చుంటారన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. ప్రస్తుతం బోర్డు కార్యాలయమయిన అన్నమయ్య భవన్‌ను, కేవలం 28 మంది కూర్చునేందుకే డిజైన్ చేసినట్లు నాటి బోర్డు సభ్యులు చెబుతున్నారు. చంద్రబాబు సీఎం కాకముందు వరకూ టీటీడీ పాలకమండలి సమావేశాలు ఎస్వీగెస్ట్‌హౌస్‌లో జరిగేవి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత అన్నమయ్య భవన్ నిర్మించి, దాని చుట్టూ బోర్డు సభ్యుల విడిదికి 25 కాటేజీలు నిర్మించారు.

అయితే ప్రస్తుతం అన్నమయ్య భవన్‌లో జరిగే సమావేశాలకూ స్థలం సరిపోవడం లేదని బోర్డు మాజీ సభ్యులు చెబుతున్నారు.చైర్మన్, ఈఓ, పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతోపాటు.. ముగ్గురు జేఈఓలు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, లా ఆఫీసర్ కూడా సమావేశాల్లో పాల్గొంటారు. వీరు కాకుండా చైర్మన్ పీఏలు, టీటీడీ పీఆర్వోలు కూడా హాజరవుతుంటారు. దీనితో ఎవరు ముందువస్తే వారికే ముందు వరసలో సీట్లు లభించే పరిస్థితి ఏర్పడింది. ఒక్కోసారి సీట్లు లేక పక్కనే ఉన్న యాంటీరూమ్, డైనింగ్ హాల్‌లో కూడా సర్దుకోవడం తమకు అలవాటయిందని బోర్డు మాజీ సభ్యుడొకరు చెప్పారు. ‘ఇప్పుడు బోర్డు సఖ్యను 55కు పెంచితే అన్నమయ్య భవన్ సరిపోదు. పైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఆస్థానమండపంలో ఏర్పాటుచేసుకోవాల్సిందే’’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ హయాంలో నేలమీదనే బోర్డు మీటింగులు!
ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత బోర్డు సమావేశాల తీరును మార్చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. అంతకుముందు వరకూ ఏసీ రూముల్లో, ఈజీ చైర్లలో కూర్చుని సమావేశాలు జరిగేవి. దానిని గ్రహించిన ఎన్టీఆర్ రంగనాయక మండపంలో సభ్యులకు నేలమీదనే బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. దేవుని సేవకులకు సుఖాలెందుకని ప్రశ్నించారు. ఆ విధానం రెండేళ్ల పాటు విజయవంతంగా అమలయింది. అప్పట్లో చైర్మన్లు, పాలకమండలి సభ్యులు కూడా స్వచ్ఛందంగా రవాణా ఖర్చులు భరించి సమావేశాలకు హాజరయ్యేవారు. ప్రస్తుతం స్థానికంగా ఉండే వారికి మినహాయించి, బయట ప్రాంతాల నుంచి వచ్చే బోర్డు సభ్యులకు రవాణా ఖర్చులు, సమావేశం రోజు వాహన సౌకర్యం కల్పిస్తున్నారు. చైర్మన్‌కు 2, ఈఓకు 3 కార్లు ఏర్పాటుచేశారు.

ఆర్డినెన్సే శరణ్యమా?
ప్రస్తుతం ఉన్న 25 మందిబోర్డు సభ్యుల సంఖ్యను పెంచాలంటే మళ్లీ అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. అయితే ఇప్పట్లో అసెంబ్లీ సమావేశం జరిగే అవకాశం లేదు. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా,బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుకోవడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమని గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఆర్డినెన్స్ ఇవ్వకుండా సంఖ్య పెంచుకోవడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుకున్న సంఖ్యలోనే సభ్యులు ఉండాలనుకుంటే.. 25 మంది బోర్డు సభ్యుల సంఖ్యను కదిలించకుండా, ఇప్పుడున్న 11 మంది ప్రత్యేక ఆహ్వానితుల స్థానంలో 36 మందిని నియమించినా ఆశ్చర్యం లేదంటున్నారు.