జూబిలీహిల్స్‌లో ఆంజనేయస్వామికి అపచారం

269

– బజ్రంగ్ బలీ ఆలయం పదెకరాలు కబ్జా చేస్తున్న అక్బర్ ప్రాపర్టీస్
– దైవసాక్షిగా ఆగమశాస్త్రం ఆగమాగం

హైదరాబాద్‌ జూబిలీ హిల్స్ రామానాయుడు స్టూడియోను ఆనుకొని కొండమీద ఆంజనేయస్వామి ఆలయం మాయమవుతున్నది. భక్తులు ఆగ్రహంతో ఆందోళన చేస్తే భాజపా నేతలు సముదాయించి దగ్గరుండి విగ్రహాన్ని తొలగించారు. రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఏపీఎల్) యజమానులు ఆగమశాస్త్రాన్ని అపవిత్రం చేశారు. కబ్జాదారుల నుంచి ఆలయాన్ని కాపాడవలసిన అధికార పార్టీ ఎమ్మెల్యే, హిందూ ఆలయాలను రక్షించాల్సిన బీజేపీ కార్పొరేటర్‌ బాహాటంగా చేతులు కలిపి తోడుదొంగలుగా మారారు. ఆగమశాస్త్రాన్ని మంటగలిపి నిస్సిగ్గుగా హనుమాన్ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నారు.

మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేంర్‌, ఫిలింనగర్‌ బీజేపీ కార్పొరేటర్‌ దండి వెంకట్‌ కలిసి ఆంజనేయస్వామి ఆలయాన్ని తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారు. గుట్ట కింద ఆలయాన్ని పెద్దగా కడతామని స్థానికులను, భక్తులను మభ్యపెట్టి, మత్పరించి కబ్జాదారులకు లైన్‌ క్లియర్‌ చేస్తున్నారు. వందల ఏండ్ల కింద కొండమీద స్వయంభువుగా వెలసిన ఆంజనేయస్వామి ఆలయం రాజకీయ నేతల స్వార్థానికి నేలమట్టం కాబోతున్నది.

రెడ్ ఫోర్ట్ అక్బర్ కన్స్ స్ట్రక్షన్స్ అనే నిర్మాణ సంస్థకు అమ్ముడుపోయిన నేతలు ఆలయం ఉన్న చోటనే అభివృద్ది చేయాలనే స్థానికుల గొంతును బెదిరింపులతో నొక్కచూస్తున్నారు. దేవాలయాల ప్రాణప్రతిష్టకైనా, విస్థాపనకైనా హిందూ సంప్రదాయం ప్రకారం ఆగమ శాస్త్రాలు పాటించాల్సి ఉంటుందన్న సోయి లేక దొంగలుగా, దొంగలకు సద్దులు మోసే లంగలుగా లీడర్లు మారిపోయినారు. దేవుని పదెకరాలు కబ్జా చేసి, దాని బదులు వెయ్యి గజాల్లో కొత్తగుడి కట్టిస్తామని నమ్మబలుకుతున్నారు.

హిందూ సంప్రదాయం ప్రకారం శివాలయాలకు, వైష్ణవాలయాలకు, దేవీ ఆలయాలకు, గ్రామ దేవతలకు వేరువేరుగా ఆగమశాస్త్ర నియమాలు వర్తిస్తాయి. ఆగమశాస్త్ర విహితంగా వేదపండితులు, అర్చకులు, స్తపతులు ఆలయాలను నిర్మించి విగ్రహాలకు ప్రాణప్రతిష్ట చేస్తారు. ఒక గుడిని కానీ, విగ్రహాన్ని కానీ తరలించాలన్నా ఆగమశాస్త్రం అనుసరించవలసిందే. మినహాయింపు ఉండదు.

ఫిలింనగర్ గుట్టమీద మాత్రం ఏ శాస్త్రం పాటించకుండా ఏ పూజారి లేకుండా కేవలం ఓ ఎమ్మెల్యే, ఓ కార్పొరేటర్‌ కలిసి వాళ్ల పాపపు చేతులతోటి ఆలయాన్ని విస్థాపన చేయడం ఘోరమని భక్తులు మండిపడుతున్నారు. అక్బర్ నిర్మాణ సంస్థకు ప్రయోజనం చేకూర్చడం కోసం హిందూ భక్తుల మనోభావాలతో ఆటలాడుకునే నేతలను గల్లా పట్టి నిలదీస్తున్నారు. రౌరవాది నరకం చవిచూస్తారని, బతికుండగానే వైతరణీ నదిలో కొట్టుకుపోతారని హిందూ నేతలను, ఇతర మతాల భూకబ్జాదారులను శపిస్తున్నారు.

రెడ్ ఫోర్ట్ అక్బర్ నిర్మాణ సంస్థ ముస్లిం వ్యక్తుల యాజమాన్యంలో ఉన్న కంపెనీ. వారికి హిందూ ఆలయాలంటే ఏవగింపే. అక్బర్ నిర్మాణ సంస్థకు ఓ బీజేపీ కార్పొరేటర్, ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సహకరించడంపై భక్తులు ఆగ్రహిస్తున్నారు. మొన్నటి వరకు ఆలయం చుట్టూ ఇనుప రేకుల బోర్డు మీద 10 ఎకరాలు అని రాసి ఉండగా నేడు దాన్ని చెరిపేశారు. అంటే నిర్మాణ సంస్థ కుట్ర ఇక్కడే బయటపడుతున్నది.

ప్రభుత్వ స్థలాలను, పైగా గుడికి సంబంధించిన స్థలాన్ని కాపాడవలసిన నేతలు నిర్మాణ సంస్థకు అమ్ముడుపోయారనే అనుమానం సామాన్యులలో కూడా బలపడుతున్నది. గుడినీ, గుడిలో విగ్రహాన్ని సాక్షాత్తు హిందూమత సంరక్షకులే మాయం చేస్తే, కంచె నుంచి చేనును కాపాడవలసి వస్తున్నదని భక్తులు వాపోతున్నారు. కండ్లెర్ర చేసి, పండ్లు పటపట నూరుతున్నారు. “జై బజ్రంగ్ బలీ! తోఢ్ దుశ్మన్ కీ నలీ!!” అని దిక్కులు పిక్కటిల్లేటట్లు భక్తులు నినదిస్తున్నారు. రాజాసింగో, రేవంత్ రెడ్డో వచ్చి నిలబడాలని కోరుకుంటున్నారు.