జగన్‌పై మరోసారి రఘురామ అస్త్రాలు

159

షెడ్యూల్-10ను ఉల్లంఘించలేదు
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు

న్యూఢిల్లీ:నరసాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ నేత రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు అంశంపై తమ ఎంపీలు న్యాయశాఖ మంత్రిని కలిశారని వెల్లడించారు. ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని వారు మంత్రిని కోరారని తెలిపారు. కానీ, ఫిరాయింపుల చట్టంలో షెడ్యూల్-10ను తాను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో తాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు లేఖ రాశానని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఫిరాయింపు కేసులు ఏమైనా ఉంటే చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. రాజకీయాల్లో విలువలను కాపాడడం కోసం, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు..కర్నూలుకి హైకోర్టు మార్చాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిని కలిసి వైసీపీ ఎంపీలు కోరారని, న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందన్నారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ మార్చినంత త్వరగా కోర్టును మార్చుతారా? అని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం తిరుమల నిధులపై గురిపెట్టిందని, వెంకన్ననూ వదలడం లేదని, ‘మా దేవుడిని వదిలేయమని వేడుకుంటున్నానని’ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. టీటీడీ నుంచి ప్రస్తుతం ఏడాదికి రూ.1.25 కోట్లు వస్తుండగా, ఇక నుంచి ఏటా రూ.50 కోట్లు వచ్చేలా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని అన్నారు. వెంకన్న నగలు కూడా అమ్మేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. స్వామి ఆస్తులను ముట్టుకోవద్దంటూ, భక్తులందరూ కలిసి సీఎంకు వినతిపత్రం పంపిద్దామని రఘురామ పిలుపు ఇచ్చారు.