వెంకయ్య బాధకు అర్థం లేదు:సీపీ‌ఐ నారాయణ

153

అమరావతి , ఆగస్టు 12( ప్రధాన ప్రతినిధి )::ప్రజా వ్యతిరేక చట్టాలు, ప్రజల ఆందోళనలపై దేవాలయం వంటి పార్లమెంట్‌లో చర్చ జరగనీయకుండా గర్భగుడిలో కూర్చున్న వెంకయ్యనాయుడు.. బాధపడితే అర్థం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వంలో 78మంది క్యాబినెట్ మంత్రులు ఉంటే.. వారిలో 33 మంది నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో నేర చరిత్ర కలిగిన మంత్రులు చాలా మంది ఉన్నారని చెప్పారు.

నేర చరిత్ర కలిగిన వారితో ఎలా వ్యవహరించాలా.. అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ.. రాష్ట్రపతితో మొరపెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్రపతిని సుప్రిం కోర్టు చీఫ్ జస్టిస్ కలవడం ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు. కేంద్రం రూపొందించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల్లో.. 150 మంది చనిపోయారని చెప్పారు. తిరుపతి వేంకటేశ్వరుడి సాక్షిగా రుయాలో ఆక్సిజన్ కొరత కారణంగా 23 మంది చనిపోతే.. కలెక్టర్ నివేదిక ఆధారంగా 11 మంది అని సీఎం జగన్ ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వ ప్రకటన అబద్ధమని తేలిందన్నారు.

రుయా మరణాలపై సీఎం జగన్, జిల్లా కలెక్టర్.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాగే దేశ వ్యాప్తంగా 41 లక్షల మంది చనిపోతే… 4 లక్షల మంది చనిపోయారని కేంద్రం అసత్యాలు చెబుతోందన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా సీఎం నాయకత్వం వహించి.. అఖిలపక్ష రాజకీయ పార్టీలతో వత్తిడి చేయిస్తే కేంద్రం దిగి వస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఒక మాట, ఢిల్లీలో మరో మాట మాట్లాడుతూ ధ్వంధ్వ వైఖరి అవలంభిస్తోందని ఆయన పేర్కొన్నారు.