వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తున్న సీఎం జగన్

133

– సామాన్య కార్యకర్తలకు సైతం నామినేటెడ్ పదవులు
– రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

మచిలీపట్నం, ఆగస్టు 12:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని, సామాన్య కార్యకర్తలకు సైతం నామినేటెడ్‌ పోస్టులను అప్పగిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ( నాని ) పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఛైర్మెన్‌గా బొర్రా దుర్గా నాగలక్ష్మి భవానితో మంత్రి కొడాలి నాని ప్రమాణం స్వీకారం చేయించారు. మంత్రి కొడాలి నాని, రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, పెడన శాసనసభ్యులు జోగి రమేష్, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావులు, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ సమక్షంలో మాజీ అర్బన్ బ్యాంకు ఛైర్మెన్ బొర్రా విఠల్ సతీమణి ముడా చైర్ పర్సన్ గా బొర్రా దుర్గా నాగలక్ష్మి భవాని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన కొన్నాళ్లకే ప్రతి వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చారని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెస్తూ, పాలనలో నూతన ఒరవడిని సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించి పేద, మధ్యతరగతి ప్రజలకు నామినేటెడ్‌ పోస్టులను కేటాయిస్తున్నారని చెప్పారు. కులాలు, మతాలు చూడకుండా ప్రజా ప్రతినిధులుగా ఎక్కువ మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉండడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే అణ‌గారిన వ‌ర్గాల‌కు సామాజిక న్యాయం సాధ్య‌మైంద‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాలకు ఎప్పుడూ అందనటువంటి నామినేటెడ్ పదవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించి ఎప్పుడూ అందని మేయర్, డిప్యూటీ మేయర్, ముడా ఛైర్మెన్ పదవులు, ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డిగారికే దక్కుతుందన్నారు.

గతంలో ఎప్పుడూ రాజకీయపరంగా కొన్ని వర్గాలకు ఇటువంటి అవకాశాలు కల్పించిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. ఇప్పుడు సామాజిక న్యాయం ప్రకారం, రాజకీయ పదవుల్లో సమాన అవకాశాలు పొందుతున్నారంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ గారి వల్లే సాధ్యమైందన్నారు. ముడా 13 మండలాలు, మచిలీపట్నం నగరపాలక సంస్థ, 272 గ్రామాల పరిధిలో విస్తరించి ఉందని, 3,800 ఎకరాలలో మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ సైతం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిపిఆర్ ఆమోదించారని చెప్పారు. ఆగష్టు 24 వ తారీఖు లోపు టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ప్రచురించారన్నారు. 25 వ తారీఖున టెండర్లు ఓపెన్ చేసి అర్హులైన వారికి నిర్మాణ పనుల బాధ్యత అప్పగించనున్నట్లు మంత్రి కొడాలి నాని తెలిపారు. సోషల్ ఇంజినీరింగ్ లో ఆరితేరిపోయిన శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఎందరికో అభిమానపాత్రుడన్నారు. సామాజిక వత్తిళ్లకు లొంగని నైజం ఆయన సొంతమని, అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేసుకొని అన్ని కులాల వారికి న్యాయం చేయడంలో మంత్రి పేర్ని నాని సమర్దులని అన్నారు. వందేళ్ల చరిత్రలో రూ. 350 కోట్లతో ఫిషింగ్ హార్బర్ పనులు, సముద్రంలో పడవలు సురక్షితంగా ప్రయాణించేందుకు మొగలో పూడిక తీయించిన తీరు గానీ, మచిలీపట్నంలో 550 కోట్ల రూపాయలతో వైద్య కళాశాల ఏర్పాటు, వచ్చే నెలలో ప్రారంభం కానున్న బందరు పోర్టు పనుల పురోగతి చూస్తుంటే మంత్రి పేర్ని నాని పట్టుదల, ఏదైనా తన నియోజకవర్గానికి సాధించుకోవాలని దీక్ష తనకు ఎంతో ప్రేరణ కలిగిస్తుందన్నారు. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి తన వాదన వినిపించి అయన అనుకొన్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే ధీశాలి పేర్ని నాని అని మంత్రి కొడాలి నాని ప్రశంసించారు. అనంతరం భారీ గజమాలతో అభిమానులు సత్కరించారు. ఈ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా (అచ్చాబా), పెడన మునిసిపల్ చైర్‌పర్సన్‌ బళ్ళ జ్ఞాన లింగం జోత్స్న రాణి, మచిలీపట్నం మాజీ జడ్పిటీసీ లంకె వెంకటేశ్వరావు (ఎల్వియార్), మచిలీపట్నం నగరపాలక సంస్థ కమీషనర్ ఎస్. శివరామకృష్ణ , పలువురు కార్పొరేటర్లు, ముడా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.