గుంతలను పూడ్చుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ

249

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా అడుగుకొక గుంతతో ప్రమాదకరంగా మారాయని టీడీపీ నాయకులు విమర్శించారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శనివారం రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చుతూ రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్‌లలో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేశారు. టిప్పర్లు, ట్రాక్టర్లులతో గుంతలలోకి మట్టి, గ్రావెల్‌ను తోలి ఆపై వాటిని జేసీబీలతో చదును చేయించారు. 175 నియోకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు అవినీతి దుబారా మానుకోండి..రోడ్ల నిర్మాణం చేపట్టండి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కొన్ని చోట్ల గుంతలలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.

రోడ్లకు మరమ్మతులు చేయాలని, గుంతలు పూడ్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఒక తట్ట మట్టి కూడా రహదారుల అభివృద్ధికి వేయలేదని అందుకే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పూనుకుందని నాయకులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోడ్లపై పంటలను కూడా పండిచుకోవచ్చని ఎద్దేవా చేశారు. రోడ్లకు ఎటువంటి మరమ్మత్తులు చేయకపోవడంతో గ్రామీణ రోడ్ల నుంచి ప్రధాన రోడ్ల వరకు గుంతలుపడిపోవడంతో ప్రాణాంతకంగా మారాయన్నారు. ఎక్కడ చూసిన గుంతలుగా పడి బావులు, కుంటలు, చెరువులను తలపిస్తున్నాయని అన్నారు. గంట ప్రయాణానికి మూడు గంటల సమయం పడుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ గాలిలో తిరగడం తగ్గించి అప్పుడప్పుడు రోడ్ల మార్గంలో ప్రయాణిస్తే సీఎంకు పాలనపై విసుగు కలుగుతుందని ఎద్దేవా చేశారు. రోడ్డెక్కితే భద్రంగా ఇంటికి చేరతామో లేదో అని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. డ్యాన్స్ రాకున్నా ఆటోమేటిక్‌గా డ్యాన్స్ చేయించే విధంగా రోడ్లు దర్శనమిస్తున్నాయని అన్నారు. దారి పొడవునా గుంతలే కనిపిస్తున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలోని రహదారులపై గుంతలు లేకుండా చేస్తాం, ప్రమాదాలను తగ్గిస్తాం అని గొప్పలు చెప్పిన వైసీపీ నాయకులు కనీసం రోడ్లకు మరమ్మత్తులు కూడా చేయకపోవడంతో అనేక మంది ఆ గుంతలలో పడి అనేక ప్రమాదాలకు గురి అవ్వుతున్నట్లు తెలిపారు. రోడ్ సెస్ ద్వారా రెండేళ్లలో రూ 1200 కోట్ల అదనపు ఆదాయం వచ్చిన రోడ్ల దుస్థితి మారడం లేదని ఇందుకు కమిషన్ల కోసం నిధులు దారి మళ్లింపే కారణం కదా… ? అని ప్రశ్నించారు. వరదలు, విపత్తులు వచ్చినప్పుడు తక్షణ అవసరాలకోసం ఉపయోగించాల్సీన నిధులను కూడా విడుదల చేయడం లేదన్నారు. గతంలో బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు.

రోడ్లపై ప్రయాణించేటప్పుడు రాత్రిపూట వీధి లైట్లు కూడా ఉండటం లేదన్నారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితిపై టీడీపీ ఇప్పటికే పలు ఆందోళనలు కార్యక్రమాలను చెపట్టింది. రహదారులపై వలలు వేసి చేపలు పట్టడం, వరినాట్లు, కొత్తిమీర నాట్లు వేయడం వంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించినప్పటికి ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. దెందులూరులో రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అడ్డుకోవడం, కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని రోడ్ల పరిస్థితిపై నిరసన చేస్తున్న టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కల్పించకుండా ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లాటరైట్ అక్రమ తవ్వకాల కోసం అటవీ ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం రాఘవపట్నం నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు 14 కి.మీ కేవలం 24 రోజుల్లో వేశారు. అదే గిరిజన ప్రాంతాల్లో ఒక్క రోడ్డైనా ఇంత త్వరలో జగన్ రెడ్డి వేసిన ధాఖలాలు ఉన్నాయా అని ఆరోపించారు.

వైసీపీ పాలనలో బడ్జెట్ కేటాయింపులు 2019-20…రూ. 6,202 కోట్లు, 2020-21 రూ. 6,588 కోట్లు, 2021-22 రూ. 7,294 కోట్లు మూడు బడ్జెట్‌లలో మొత్తం 20,084 కోట్ల కెటాయింపులు జరిగినప్పటికీ రోడ్ల పరిస్థితి మారలేదు. టీడీపీ పాలనలో బడ్జెట్ కేటాయింపులు 5 ఏళ్లలో రూ.6,532 కోట్లతో 25, 194 కి.మీ సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇది కాశీ నుంచి కన్యాకుమారి అంత దూరం ఇది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత. తెలుగుదేశం హయంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజక్ కింద ఏపీలో జిల్లాల వారీగా మొత్తం 2737.789 కి.మీ రోడ్ల నిర్మాణం జరిగింది. రెండేళ్లలో జగన్ రెడ్డి ప్రభుత్వం వేసింది. 300 కి.మీ మాత్రమే. రూ. 6,400 కోట్లతో ఎన్డీబీ(న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్) రుణం తీసుకొని అధికారపక్షం మంత్రులు, నాయకులు కంపెనీకి అప్పన్నంగా అప్పగించేందుకు కాంట్రాక్ట్ నిబంధనలు మార్చారు. దీని వల్ల చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనకుండా జిల్లాను యూనిట్‌గా చేసినట్లు తెలిపారు.
టీడీపీ హయంలో 2018-2019 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 156 పనులకు రూ. 1,755.04 కోట్లు, 27 పనులకు రూ. 268.94 కోట్లతో 178.416 కి.మీ పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా రూ.1,486.10 కోట్లతో 129 పనులు పురోగతిలో ఉన్నాయి.
2014-19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో 2737.78 వేల కి.మీ బీటీ రోడ్లు వేశారు.
2,164 కి.మీ మేర రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారులుగా మార్చారు.
రాష్ట్రంలో రూ.3,676 కోట్ల ఏఐఐబీ నిధులతో కొత్తగా 4,826 కి.మీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
2019-20లో గిరిజన ప్రాంతాల్లో 119.89 కోట్లతో రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు.
432 బ్రిడ్జిలను నిర్మించేందుకు కంకణం కట్టారు. 39 జాతీయ రహదారులకు సంబంధించి రూ. 16,878 కోట్లతో 1,384 కి.మీ మేర చేపట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ నిరసన కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్‌రావు, మంతెన రామరాజు, బెందాళం అశోక్, వేగుళ్ల జోగేశ్వరరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, పార్లమెంట్ అధ్యక్షులు గుమ్మడి సంధ్యారాణి, కిమిడి నాగార్జున, బుద్దా నాగజగధీష్, రెడ్డి అనంతలక్ష్మి, జ్యోతుల నవీన్, గన్నీ వీరాంజనేయులు, నెట్టెం రాఘురాం, కొనగళ్ల నారాయణ, తెనాలి శ్రావణ్ కుమార్, నూకసాని బాలాజీ, అబ్దుల్ అజీజ్, నర్సింహ యాదవ్, పులవర్తి నాని, గౌరు వెంకటరెడ్డి, సోమిశేట్టి వెంకటేశ్వర్లు, లింగారెడ్డి, మాజీ మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు, బండారు సత్యనారాయణమూర్తి, గొల్లపల్లి సూర్యరావు, పీతల సుజాత, అమర్‌నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ, చింతమనేని ప్రభాకర్ రావు, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, వంతల రాజేశ్వరి, కురుగొండ్ల రామకృష్ణ, పాశీం సునీల్ కుమార్, బొబ్బిలి చీరంజీవులు జితేంద్ర గౌడ్, చెంగల్‌రాయుడు, సుగుణమ్మ, బి.సి జనార్థన్ రెడ్డి, నెల్లూరు సిటీ ఇంఛార్జ్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.