ఆ ముగ్గురి మంతనాల మర్మమేమిటి?

330

– ఈటల సం‘కుల’ సంకటం!
– కొండా- జితేందర్‌రెడ్డితో భేటీ
– కాంగ్రెస్‌లో చేరతారంటూ సోషల్‌మీడియాలో కథనాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

హుజురాబాద్ ఉప ఎన్నిక యుద్ధానికి సిద్ధమవుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలో పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలకు, తాజాగా కొండా విశ్వేశ్వరరెడ్డితో భేటీ కావడం మరింత గందరగోళం రేపింది. కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరబోయేది త్వరలో ప్రకటి స్తానని.. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనను కలసిన సందర్భంగా, కొండా చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న ఈటల రాజేందర్‌తో.. కొండాతోపాటు బీజేపీ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కలసి రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశమయింది. ఇతర పార్టీల్లో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన అగ్రనేతల వైఖరి.. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా రావడంతో మారిందన్న ప్రచారం నేపథ్యంలో, ఈటల-కొండా-జితేందర్‌రెడ్డి భేటీకి సహజంగానే ప్రాధాన్యం ఏర్పడింది. ఈటల సతీమణి జమున కూడా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారేనన్నది తెలిసిందే.

గత కొద్దిరోజుల నుంచి ఈటల కేంద్రంగా, సోషల్‌మీడియాలో వస్తున్న కథనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆయన బీజేపీని వీడి త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారని, బీజేపీలో ఈటల ఇమడలేకపోతున్నారన్నది సోషల్ మీడియాలో వస్తున్న వార్తాకథనాల సారాంశం. అసలు ఈటల సతీమణి జమున కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా తాజాగా మొద లయింది. అయితే ఇదంతా టీఆర్‌ఎస్ సాగిస్తున్న దుష్ప్రచారంగానే ఈటల అనుచరులు కొట్టివేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రలో ఉన్న ఈటల రాజేందర్‌ను మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి కారులో కూర్చుని మంతనాలు సాగించడం మరింత ఉత్కంఠ రేపింది.

ఇటీవల తన నివాసానికి వచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో, తాను కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది త్వరలో చేరతానని మీడియా అడిగిన ప్రశ్నకు కొండా విశ్వేశ్వరరెడ్డి సమాధానంగా చెప్పారు. రేవంత్‌రెడ్డి కోసం కాంగ్రెస్ పార్టీ లోపల బయట కొట్లాడిన తనకు, పీసీసీ చీఫ్ కావడం సంతోషం వేసిందని వ్యాఖ్యానించారు. అటు రేవంత్‌రెడ్డి కూడా.. కొండా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారే తప్ప, కాంగ్రెస్ ఐడియాలజీకి కాదని నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ఘర్‌వాపసీలో భాగంగా కొండా విశ్వేశ్వరరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారన్న వార్తలు కాంగ్రెస్ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. రేవంత్ పీసీసీ చీఫ్ కాకముందు, కొండా బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కాంగ్రెస్‌లో చేరనున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇప్పటికే బీజేపీలో ఉన్న మరో మాజీ ఎంపి జితేందర్‌రెడ్డితో, ఈటలను కలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో ఉన్న ఈటలను కలవడంపై రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. అయితే బీజేపీ-కాంగ్రెస్ ఉమ్మడి శత్రువైన టీఆర్‌ఎస్‌ను ఓడించే వ్యూహంపైనే జితేందర్‌రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఈ భేటీపై మాజీ ఎంపి జితేందర్‌రెడ్డిని వివరణ కోరగా ‘టీఆర్‌ఎస్ వ్యతిరేకవర్గాలన్నింటినీ ఒకే వేదికపైకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోజు నా కారులోనే కూర్చుని మాట్లాడుకున్నాం’ అన్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరతానని ప్రకటించిన కొండాతో కలసి, మీరెలా ఈటలతో భేటీ నిర్వహిస్తారన్న ప్రశ్నకు.. ‘ విశ్వేశ్వరరెడ్డి గారు కాంగ్రెస్‌లో చేరతానని ఎప్పుడూ చెప్పలేదు. ఆరోజు రేవంత్‌రెడ్డి కర్టెసీగా వచ్చి కలిశారంతే. ఈ ఉప ఎన్నిక వరకూ ఆయన ఏ పార్టీలో చేరరని భావిస్తున్నా. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడించడమే ఆయన లక్ష్యం’ అని వివరించారు.