రాయలసీమపై కక్ష దేనికో?

324

“కత్తికి కత్తి తలకి తల ప్రాణానికి ప్రాణం” ఒకపుడు ఇదే రాయలసీమ సూత్రం! “చంపు లేదా చావు” చిత్తూరు మినహా మిగతా జిల్లాల్లో ఇదే రాయలసీమ సిద్దాంతం! నీళ్ళకి కరువైనా రక్తానికి కొదవలేదు! మీసాలు తిప్పి పౌరుషాలతో ప్రాణం పోగొట్టుకున్నవారు ఎందరో!? బాంబులు చుట్టినవారు బకెట్లలో పెట్టుకుని మోసిన వారు బాంబులు జేబులో పెట్టుకుని తిరిగిన వారు ఉండేవారు .. కాదనం! నాయకుల పంతాలకి పగలకి ప్రతీకాలకీ బలైపోయిన అనుచరులు ఎందరో? ఫ్యాక్షన్ భూతాలకు బలైపోయిన ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు! శివారెడ్డి.. రాజారెడ్డి.. చిన్నపురెడ్డి .. కాటసాని వెంకటప్పనాయుడు.. బాలిరెడ్డి ..పరిటాల.. ఇలా కొందరు ఉన్నారు! రాయలసీమ అంతా ఇంతేనా అంటే కాదు అయిననూ ఒకపుడు ఇదే పేరు ఉండేది! విచ్చు కత్తుల్లాంటి తమ కోరల్ని బాగా లోతుగా దింపి వాళ్ళ రక్తాన్ని పీల్చి శరీరాల్ని అవతల పడేసే తరహాలో ఇపుడు రాయలసీమలో ఫ్యాక్షన్ లేదు!

ఒకపుడు ఉన్న ఫ్యాక్షన్ ఇపుడు ఉందా? అంటే లేదు… అక్కడక్కడా పాత కక్షలు వర్గ పోరు మినహా స్మశానంలో సమాధుల్లా నిర్జీవంగా ఉన్న ఊళ్ళు ఇపుడు లేవు! నాగరికత పెరిగింది! కత్తులు భూమిలో పాతేసి పైర్లు పండిస్తున్నారు బతకడం నేర్చుకున్నారు నరకటం మానేశారు శ్రమటోర్చి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు! రాళ్ళ నేలలో కార్లు పండుతున్నాయ్! చెప్పులు వేసుకుంటే నెత్తిన పెట్టి నడిపించిన దాఖలాలు అనంతపురం లో ఉన్న దాఖలాలు లేవు! ఆ స్థాయి దళిత వివక్ష రాయలసీమలో ఉందా? రివ్యూ పేరిట చుండూరు లక్ష్మిపేట కారంచేడు సీతారాంపురం ప్రస్తావిస్తున్నారు అవేవీ రాయలసీమలో లేవు!

రాయలసీమ అంటే నరుకుడు తెగనరుకుడేనా? కాదు కాదు చాలా ఉంది! రాయలసీమలో మగోళ్ళు కడుపులో కత్తులు పట్టుకుని పుడతారు అని కొన్నాళ్ళ క్రితం కడప సినిమా సమయంలో వర్మ మాట! శ్రీ వెంకటేశ్వర స్వామి రచనలు రాసిన తాళ్ళపాక అన్నమాచార్యులు.. గురజాల ముల్లుతో కాలజ్ఞానం రాసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి.. తత్వవేత్త యోగి వేమన.. సినీ దర్శకుడు జీఎన్ రెడ్డి.. ఆర్థికవేత్త రిజర్వు బ్యాంకు గవర్నర్ యాగ వేణుగోపాల్ రెడ్డి.. న్యాయమూర్తి జయచంద్రారెడ్డి వీరంతా రాయలసీమ వాసులే. వీరంతా మగోళ్ళే . వీరెవ్వరూ కడుపులో కత్తి పట్టుకుని పుట్టలేదే? కాసుల కోసం అరవ సినిమా అరువుగా తెచ్చుకుని, రాయలసీమపై లేనిది రుద్దటం ఎంతవరకూ సమంజసం?

ఇది ఒక రాయలసీమ బిడ్డ ఆవేదన