నా పేరు పినాకిని.. నా వయసు 25

400

దయచేసి వినండి.. పినాకిని ఎక్స్‌ప్రెస్‌గా ప్రయాణికులకు సుపరిచతమైన నా వయస్సు 25 ఏళ్లు. పాతికేళ్ల కిందట విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రారంభమైన నా ప్రయాణం రోజూ విజయవాడ – చెన్నైల మధ్య సరదాగా సాగుతోంది.. అప్పటి నుంచి చెన్నె, విజయవాడసహా మార్గమధ్యలో ఉన్న 20 స్టేషన్ల ప్రయాణికులను గమ్యం చేరుస్తున్నా. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా పలు రైళ్లు ఉన్నా చెన్నై నగరానికి చేరుకొనే ప్రయాణికుల డిమాండ్‌ అధికంగా ఉండడంతో అప్పటి ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల దశాబ్దాల పోరాటం ఫలితంగా నా ప్రస్థానం ప్రారంభమైంది.

01 జులై, 1992లో విజయవాడ చెన్నై మధ్య ప్రారంభమైన నా ప్రయాణంలో విజయవాడ, కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రయాణికులను అలసట లేకుండా వారి గమ్యాలను చేరుస్తున్నాను. విజయవాడ మీదుగా చెన్నెకి ప్రస్తుతం 50కిపైగా రైళ్లు నడుస్తున్నా ఇప్పటికీ రద్దీ తగ్గలేదంటే ప్రయాణికుల్లో నాకున్న ఆదరణే ఉదాహరణ. టిక్కెట్‌ ధర తక్కువ ఉండడంతో ఉద్యోగులు, వ్యాపారుల, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతోంది.

25 ఏళ్లు.. 24 బోగీలు
12711/12712 నెంబరుతో ప్రారంభంలో 11బోగీలతో చెన్నెకి నా ప్రయాణం ప్రారంభమైంది. ప్రజల అవసరాలను గమనించిన అధికారులు క్రమేణా బోగీలు పెంచుకుంటూ వెళ్లారు. ప్రారంభంలో అన్నీ సాధారణ బోగీలేకాగా ప్రస్తుతం రెండు ఏసీ చైర్‌కార్లు, 8 స్లీపర్‌ క్లాస్‌ సీటింగ్‌ బోగీలు, 11 సాధారణ, ఒక ప్యాంట్రీకారు, గార్డు బోగీతో కలిపి 24బోగీలతో ప్రయాణికులను వారి ప్రాంతాలకు చేరవేస్తున్నాను.

రోజూ 4వేల మంది రాకపోకలు..రూ.8లక్షల ఆదాయం
విజయవాడ – చెన్నైల మధ్య రాకపోకలతో రోజూ నాలుగువేల మంది ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుస్తున్నాను.రోజుకు సుమారు రూ.8లక్షల ఆదాయం వస్తుండగా నెలకు రూ.2.40కోట్లు ఏడాదికి రూ.28కోట్లు ఆదాయం రైల్వేకు సమకూరుస్తున్నాను.

శుభ్రతకు ప్రాధాన్యం
దక్షిణ మధ్య రైల్వే లోనే మొదటి హరిత మరుగుదొడ్లు ఏర్పాటుకు నాంది పలికింది నేనే. దీనిద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుస్తున్నాను. రాత్రికి విజయవాడకు చేరుకోగానే నన్ను నిర్వహణ పనుల నిమిత్తం రైల్వే యార్డుకు తరలిస్తారు. కోచింగ్‌, సీఅండ్‌ డబ్ల్యూ, మెకానికల్‌తో పాటు వివిధ విభాగాల సిబ్బంది 6 నుంచి 8గంటల క్షుణ్నంగా తనిఖీలు నిర్వహిస్తారు. పారిశుద్ధ్య సిబ్బంది బోగీలను అత్యాధునిక యంత్రాల సహాయంతో శుభ్రం చేస్తున్నారు. రోజూ నిర్ణీత సమయానికి గంట ముందే ప్లాట్‌ఫారం పైకి వస్తాను.

నిత్యం రద్దీతో నడుస్తుంది: సురేష్‌, స్టేషన్‌ సూపరింటెండెంట్‌
పినాకిని రైలు ఏడాది పొడవునా రద్దీతో నడుస్తోంది. సమయపాలన కచ్చితంగా ఉండడం, శుభ్రమైన బోగీలు, నాణ్యమైన ఆహారం లభిస్తుండడంతో ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. నాణ్యత విషయంలో రాజీపడకుండా రోజూ తనిఖీ నిర్వహిస్తున్నాం.

కచ్చితమైన సమయపాలన!
విజయవాడలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై 20 స్టేషన్లలో ఆగుతూ మధ్యాహ్నం ఒంటి గంటకు చెన్నై చేరుకుంటా. తిరిగి 1.10కి బయలుదేరి విజయవాడ వచ్చేసరికి రాత్రి 9.10 అవుతుంది. అన్ని స్టేషన్లలో ఒక నిమిషం మాత్రమే ఆగుతూ ఏడు గంటల్లో గమ్యాన్ని చేరుకుంటున్నా. గంటకు 110 కి.మీ., నుంచి 140 కి.మీ., వేగంతో నా ప్రయాణం కొనసాగుతోంది.

రెండింతలకుపైగా పెరిగిన సాధారణ టిక్కెట్‌ ధర
ప్రారంభంలో.. పాతికేళ్ల కిందట విజయవాడ నుంచి చెన్నెకి రూ.65 మాత్రమే.

ప్రస్తుతం: సాధారణ టిక్కెట్‌ ధర రూ.155 ఏసీ చైర్‌కార్‌: రూ.605

రోజూ సమయానికే చేరుకుంటున్నాం– జి. లక్ష్మి, ఉద్యోగిని
నేను ఐదేళ్లుగా రోజూ ఈ రైలులోనే ఒంగోలుకు వెళుతున్నా. విధులకు ఎప్పుడూ ఆటంకం కలగలేదు. ఏ రోజు కూడా ఆలస్యం కాలేదు. తిరిగి సాయంత్రం ఇదే రైలులో విజయవాడ చేరుకుంటున్నా. చాలా సౌకర్యవంతంగా ఉంది.

నన్ను గుర్తించారు..
నాకు 25ఏళ్లు నిండిన సందర్భంగా నన్ను గుర్తుంచుకొని విజయవాడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు, అధికారులు, సిబ్బంది కలిసి వేడుకలు నిర్వహించడం సంతోషం వేసింది. వేడుకలో ప్రయాణికులు స్టేషన్‌ సూపరింటెండెంట్‌సురేష్‌, చీఫ్‌ హెల్త్‌ ఇన్స్‌పెక్టర్‌ వాసుదేవరావు తదితర రైల్వే సిబ్బంది పాల్గొనడం గర్వంగా అనిపించింది.

– సురేష్ పులగం, జర్నలిస్ట్