వీ‘ఆర్‌ఎస్ ’ను కేంద్రం ఆమోదిస్తుందా?

453

– గతంలో అధికారుల వీఆర్‌ఎస్‌ను తిరస్కరించిన కేంద్రం
– ప్రవీణ్‌పై కొనసాగుతున్న ప్రభుత్వ విచారణ
( మార్తి సుబ్రహ్మణ్యం- హైదరాబాద్)

వివాదాస్పద ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ దరఖాస్తు చేస్తున్న వీఆర్‌ఎస్‌ను కేంద్రం ఆమోదించే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 26 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, హటాత్తుగా వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమయిది. అందుకు అనేక కారణాలు తెరపైకి వస్తున్పప్పటికీ, వాటిపై ఆయన ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. కొందరు ఆయన హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా తెరపైకి రానున్నారని, మరికొందరు రాజకీయాల్లో చేరేందుకే వీఆర్‌ఎస్ తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఆర్‌ఎస్‌పీ మాత్రం తన రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించారంటే.. వీఆర్‌ఎస్ అసలు లక్ష్యం అదేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

కాగా ‘ఆర్‌ఎస్‌పీ’ చేసుకున్న వీఆర్‌ఎస్ దరఖాస్తును, కేంద్రం ఆమోదిస్తుందా లేదా అన్న చర్చ అధికారుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సహజంగా సర్వీసు మధ్యలో విదేశాలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన అధికారులకు, 20 ఏళ్ల సర్వీసు ముగిసేంతవరకూ వీఆర్‌ఎస్‌కు కేంద్రం అంగీకరించదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రవీణ్‌కు మరో ఆరేళ్లు మాత్రమే సర్వీసు ఉన్నందున, అది ఆయనకు వర్తించదంటున్నారు.

అయితే.. ఆయనపై ఎంపీ రఘురామకృష్ణంరాజుతోపాటు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ ‘స్వేరోస్’ అనే ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్నారన్నది ప్రవీణ్‌పై ఉన్న ప్రధాన ఫిర్యాదు. ఆయన ప్రభుత్వ గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఉంటూ.. హిందూ మతానికి వ్యతిరేకంగా, క్రైస్తవానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గతంలోనే జాతీయ బాలల హక్కుల కమిషన్, కేంద్ర హోం శాఖకు కేంద్రానికి ిలీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. దానిపై స్పందించిన జాతీయ బాలల హక్కుల కమిషన్.. ఫిర్యాదుపై విచారణ నిర్వహించి, నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. మరోవైపు కేంద్రహోం శాఖ కూడా ప్రవీణ్‌పై వచ్చిన ఆరోపణలు దర్యాప్తు చేస్తున్న సమయంలో, హటాత్తుగా ఆయన వీఆర్‌ఎస్ ప్రకటించడం చర్చనీయాంశమయింది.

ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలు విచారణ దశలో ఉన్నందున, కేంద్రం ఆయన వీఆర్‌ఎస్ దరఖాస్తుకు స్పందించకపోవచ్చని కొందరు అధికారులు చెబుతున్నారు. ‘ ఆర్‌ఎస్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతున్నందున, అది పూర్తయ్యేవరకూ సర్వీసులో కొనసాగాలని కేంద్రం సూచించవచ్చు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఒక అధికారి చేసుకున్న వీఆర్‌ఎస్ దరఖాస్తును కేంద్రం వెంటనే ఆమోదించవచ్చు. లేదా ఆలస్యం చేయవచ్చు. ఈ రెండూ కాకపోతే తిరస్కరించే అధికారం కేంద్రానికి ఉంటుందని ఆయన వివరించారు.

గతంలో కొందరు ఐఏఎస్ అధికారులు చేసుకున్న వీఆర్‌ఎస్ దరఖాస్తును, కేంద్రం తిరస్కరించిన విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ ఆర్ధిక శాఖ ముఖ కార్యదర్శి వి.రామకృష్ణారావు గతంలో వీఆర్‌ఎస్ దరఖాస్తు చేసి మైటాస్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో, ఆయన పెట్టుకున్న వీఆర్‌ఎస్ దరఖాస్తును కేంద్రం తిరస్కరించడంతో, తిరిగి విధుల్లో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ కూడా, గతంలో వీఆర్‌ఎస్ దర ఖాస్తు చేసుకుని కొన్నేళ్ల పాటు ఎన్జీఓ సంస్థలో పనిచేసిన క్రమంలో, ఆయన దరఖాస్తును కూడా తర్వాత కేంద్రం తిరస్కరించడంతో తిరిగి విధుల్లో చేరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపిఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ పెట్టుకున్న వీఆర్‌ఎస్ దరఖాస్తును కేంద్రం ఆమోదిస్తుందా? తిరస్కరిస్తుందా అన్నది కచ్చితంగా చెప్పలేమన్న వ్యాఖ్యలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి.

కాగా రెండురోజుల క్రితం జరిగిన తెలంగాణ దళిత సాధికారిత సమావేశానికి హాజరుకావాలని కోరినప్పటికీ, ప్రవీణ్ వెళ్లకపోవడంతో చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు, ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది. ఆ ఘటనకు మనస్తాపం చెందిన ప్రవీణ్ రాజీనామా చేశారని చెబుతున్నారు. దానికితోడు, తాను వ్యక్తిగత శ్రద్ధతో అభివృద్ధి చేస్తున్న గురుకులాల విషయంలో, ప్రజాప్రతినిధుల జోక్యం ఎక్కువ కావడం కూడా ఆయనకు మింగుడుపడలేదన్న ప్రచారం జరుగుతోంది. తొమ్మిదేళ్లపాటు గురుకులాలను క్రమశిక్షణలో పెట్టి, విద్యార్ధులతో అద్భుతాలు సృష్టించిన తనకు స్వేచ్ఛ లేకుండా పోవడం ఆయనకు మనస్తాపం కలిగించిందని చెబుతున్నారు. ప్రధానంగా ఆయన శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి- ప్రవీణ్‌కుమార్‌కు బదిలీలు, శాఖాపరమైన నిర్ణయాలపై పొసగడం లేదు. ‘ఆర్‌ఎస్‌పీ’ వీఆర్‌ఎస్‌కు అదొక ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది.