రాజధాని జిల్లాలో టీడీపీ నేతలు కనిపించడం లేదు..

235

-అప్పుడు పెత్తనం చేశారు ఇప్పుడు చేతులెత్తేశారు
– గుంటూరు జిల్లాల్లో తమ్ముళ్లు గాయబ్

తెలుగుదేశం పార్టీ అగ్రనేతలకు గుంటూరు జిల్లా ఖిల్లా..అలాంటి గుంటూరు జిల్లాలో 5 ఏళ్ల అధికారంలో అగ్ర తాంబూలంలో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలు ముఖం చాటేయడం ఆ పార్టీలో నిస్తేజాన్ని కలిగిస్తుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉండే ప్రధాన ప్రాంతం ఇది. అయినా అధికారంలో పదవులు పొందిన నేతలు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఐదేళ్లు ముఖ్యమైన మంత్రిపదవి అనుభవించిన పత్తిపాటి పుల్లారావు ప్రతిపక్షంలో ఏ ఆందోళన కార్యక్రమం ముందుండి నడిపించినది లేదు. హైదరాబాదులో మాకాం ఉంటూ అప్పుడప్పుడు చిలకలూరిపేటకు అతిథిగా వచ్చిపోతున్నారు.పత్తిపాటి ఒక్కరే కాదు. ఓడిన చాలామంది మాజీలంతా హైదరాబాద్‌లోనే మకాం పెట్టి, అప్పుడప్పుడు చుట్టంచూపుగా నియోజకవర్గాలకు వచ్చివెళుతున్న దుస్థితి.

హోం మంత్రికి సమాంతరంగా పోలీస్ శాఖను శాసించిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరుకు పరిమితమై, అప్పుడప్పుడు మీడియా ప్రకటనలలో కనిపిస్తున్నారు. నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని కార్యకర్తల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండగా, అన్ని రంగాల్లో చక్రం తిప్పిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులెత్తేయడంతో, గురజాలలో ఏకగ్రీవమయ్యాయంటున్నారు.

నరసరావుపేట ఎంపీగా చేసిన రాయపాటి సాంబశివరావు ఆయన కుటుంబ సభ్యులు ఈ రెండేళ్ల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కూడా మెరుపులా మెరుస్తూన్నారు. గుంటూరు ప్రస్తుత తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేవలం పార్లమెంటు సమావేశాలకు పరిమితమయ్యారు. మార్కెట్ యార్డ్ చైర్మన్లు గా చేసిన మన్నవ సుబ్బారావు, వెన్నా సాంబశివారెడ్డి లు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు.వీళ్లందరూ అధికార పార్టీ నుండి ఎదురవుతున్న ఒత్తిళ్లు, అక్రమ కేసులు, అవినీతి ఆరోపణలు, సిబిఐ, సిఐడి కేసులతో కనిపించకుండా తిరుగుతున్న వాదనలు లేకపోలేదు.ఇక మాచర్ల, సత్తెనపల్లి, లకు సరైన నాయకత్వం లేక ఇంచార్జ్ లను కూడా నియమించక, అక్కడ పార్టీ జండా మోసే నాధుడే కరువయ్యారు. కోడెల శివరాం నాయకత్వాన్ని స్థానిక నేతలు అంగీకరించడం లేదు. ఆయన ఎంత తిరిగితే పార్టీకి అంత నష్టం అని స్పష్టం చేస్తున్నారు. అధికారంలో ఉండగా చేసిన ఘన కార్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేస్తున్నారు. స్థానిక నేతకే నాయకత్వం అప్పగించాలని చంద్రబాబును కలసి డిమాండ్ చేసినా ఫలితం శూన్యం.

నరసరావుపేట ఇన్చార్జిగా గత ఎన్నికల్లో ఓడిపోయిన డాక్టర్ చదలవాడ ఆరవిందబాబును ఆ పార్టీ ఇన్చార్జిగా నియమించినా, బలమైన కమ్మ సామాజిక వర్గం ఆయనకు సహకరించడం లేదని చెబుున్నారు. కోడెల శివప్రసాద్ లాంటి ఉద్దండుడు పనిచేసిన ఆ కోటలో అరవింద బాబు శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదని కొందరు పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎదుర్కొవడం అరవిందబాబుకు సాధ్యం కావడం లేదని చెబుతున్నారు.

పొన్నూరు నియోజకవర్గంకు చెందిన మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర పార్టీలో సీనియర్ నేత. ఆయన సంగం డైయిరీ ఛైర్మన్ గా ఆ సంస్థ కార్య కలాపాలకు పరిమితమై పార్టీ కార్యక్రమాల్లో అంటిముట్టనట్లగా ఉన్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవల దూళిపాళ్ళ నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేసిన సమయంలో, జిల్లా పార్టీ నేతల నుంచి పెద్దగా రీయాక్షన్ రాలేదని చెప్పవచ్చు.

నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో, కార్యకర్తలకు అండగా నిలిచే స్థానిక నాయకుడు ఎవరన్నది అగమ్యగోచరంగా మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి గెలిచిన మద్దాల గిరి, వైసీపీకి మద్దతునిచ్చి జగన్ పంచన చేరడంతో ఇక్కడ అదే పరిస్థితి నెలకొంది.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం యువరక్తాన్ని తెలుగుదేశం పార్టీ చేసిన ప్రయోగం, అక్కడి సీనియర్లలో అసంతృప్తికి దారితీసింది.ఏప్రిల్ లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది.గుంటూరు నగరంలో వైసీపీ నేతలతో సత్సంబంధాలు, వ్యాపారాలు, సెటిల్‌మెంట్లలో భాగస్వాములుగా ఉన్నవారిని, నాయకత్వం ప్రోత్సహిస్తుండటంపై క్యాడర్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ నేతలతో కొందరు టీడీపీ నేతలు మ్యాచ్‌ఫిక్సింగుకు పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. ఆ ఎన్నికల్లో ఎంపి పెద్దగా ఆసక్తిచూపకపోవడం, బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టడం ద్వారా వైసీపీకి పరోక్ష లబ్థి చేకూర్చారన్న ఆరోపణలపై నాయకత్వం ఇప్పటిదాకా దృష్టి సారించలేదంటున్నారు.

జిల్లాలో నరసరావుపేట జిల్లా పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు ఒక్కరే చురుకుగా ఉన్నారంటున్నారు. పార్టీ అధికారంలో ఉండగా పెదకూరపాడు నుంచి గెలిచిన కొమ్మాలపాటి శ్రీధర్‌పై, అప్పట్లో వచ్చిన ఇసుక కుంభకోణం ఆరోపణలపై పార్టీ ఎదరుదాడి చేసింది. అయితే ఆయన ఇప్పుడు పార్టీకి పెద్దగా సమయం కేటాయించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాపట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్నం సతీష్ బీజేపీ జెండా కప్పుకోవడంతో అక్కడ పార్టీకి నాయకత్వ కొరత వచ్చింది. పత్తిపాడు నుండి పోటీ చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైసీపీతో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ప్రత్తిపాడులో నాయకత్వ లోపం ఏర్పడింది.

రేపల్లె తెలుగుదేశం నుండి గెలిచిన అనగాని సత్యప్రసాద్ అక్కడి నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం చేస్తున్న పోరాటం అంతంత మాత్రమే. ఇటీవల మోపిదేవి వర్గీయులు అక్కడ నిర్వహించిన పేకాట క్లబ్‌పై పోలీసులు దాడి చేసిన వైనాన్ని, రాజకీయంగా మలచుకోవడంలో అనగాని ఆసక్తిచూపని వైనం విమర్శలకు దారితీసింది. బాపట్ల ఎంపీ గా పోటీ చేసిన శ్రీరామ్ మాల్యాద్రి కూడా పార్టీ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే పాల్గొంటున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి పార్టీ కమిటీలో ప్రాధాన్యత ఇవ్వలేదని అలకబూని ఉన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా చేసిన దాసరి రాజా మాస్టారు ఇటీవల తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. అమరావతి రాజధాని కోసం రైతులు 565 రోజులుగా నిర్విరామంగా ఉద్యమం నడుపుతూ ఉంటే, అండగా ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రెస్ మీట్లతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఏదిఏమైనా తెలుగుదేశం కు అండగా ఉన్న గుంటూరు జిల్లా నాయకత్వంలోనే ఈ పరిస్థితి నెలకొని ఉంది అంటే పార్టీ మనుగడ ఎలా ఉంటుందో అన్న ఆందోళన కేడర్లో కనిపిస్తుంది. అధికారం కోల్పోయి రెండేళ్లు అయినా నాయకుల్లో చలనం కనిపించడం లేదు. కేడర్ ను నడిపించే పటిష్టమైన నాయకత్వం కోసం ఆ పార్టీ కార్యకర్తలు ఎదురుచూపు తప్పడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నాయకత్వం పనితీరును ప్రక్షాళన చేసి చేయాలన్న డిమాండ్, కింది స్థాయి క్యాడర్‌లో వినిపిస్తోంది.

– వీ.ఆర్