పీఠాథిపతులు నోరు విప్పరేం?

661

దేవుడిసొమ్ము ‘వాహనమిత్ర’కు దానంపై స్వాముల మౌనం
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగురాష్ట్రాల్లో పీఠాథిపతుల నోటికి గత రెండేళ్ల నుంచి ఎందుకో తాళాలు పడ్డాయి. స్వాములోర్లు ఇప్పుడు ఫెవికాల్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అంతకు ఐదేళ్ల ముందువరకూ అత్యుత్సాహంతో అంతెత్తున లేచిన ఈ స్వాముల ధర్మాగ్రహం, గత రెండేళ్ల నుంచి మంత్రం వేసినట్లు మాయమయిపోయింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో దారి తప్పిన ధర్మంపై, నాగుల్లా బసులుకొట్టిన ఈ ‘స్వరూపా’లు ఇప్పుడు అంతకుమించిన దారుణాలు జరుగుతున్నా..  చినముషిడివాడ కలుగునుంచి బయటకు రాకపోవడమే విచిత్రం. భక్తులకు-భగవంతుడికి ఏవిధంగా అంబికా దర్బార్‌బత్తి  అనుసంధాకర్తగా మారిందో, పాలకులకూ-నేతలకూ ఈ స్వాములు అలా అనుసంధానకర్తలయ్యాన్నమాట.

బాబోరి పాలనలో  బెజవాడలో నేలమట్టమయిన దేవాలయాల ఘటనపై ఆగ్రహించిన ఈ సర్వసంగపరిత్యాగులు (?), ఆధ్యాత్మిక శక్తులు, కాషాయ దళాలు.. ఇప్పుడు అంతకుమించిన అరాచకాలు జరుగుతున్నా నవరంధ్రాలూ మూసుకుని ఉండటం మరో వైచిత్రి. భక్తుల విరాళాలతో నడిచే దేవాలయాల సొమ్ము నుంచి, ముచ్చటగా 49 లక్షల రూపాయలను వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి విడుదల చేస్తూ, జగనన్న సర్కారు ఉత్తర్వులిచ్చి 24 గంటలుదాటింది. ఆ ముచ్చట మీడియా, సోషల్ మీడియాలో కోడై కూస్తున్నా ఇప్పటివరకూ పీఠాథిపతులు పీఠం వేసుకుని కూర్చుకున్నారే తప్ప, వారి స్వరపేటిక నుంచి ఒక్క ధర్మాగ్రహం కూడా వెలువడకపోవడమే ఆశ్చర్యం. సరే.. ఈ నయా రాజకీయ స్వాములకంటే ఏదో ఒక పొలిటికల్ అజెండా ఉందనుకోవచ్చు. అనుకోవచ్చేమిటి? అది నిజం కూడా!

కర్నాటకలో మఠాథిపతులే రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటారు. ఎంతపెద్ద సీఎం అయినా ఏదో ఒక మఠానికి దాసుడు కావలసిందే. ఆ రాష్ట్రానికి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు వచ్చినా అక్కడి ఫేమస్ మఠానికి వెళ్లి, సదరు స్వాముల ఆశీస్సులు తీసుకోవలసిందే. కర్నాటకలోని రెండు, మూడు కులాలను శాసించే మఠాలే పాలకులను నిర్దేశిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ పితలాటకాలేమీ లేకపోయినా, పార్టీలకు పీఠాలు కేరాఫ్ అడ్రసులవుతున్న మాట మనం మనుషులం అన్నంత నిజం. శ్రీనివాసానందస్వామి అనే ఆయన ఆ రహస్యం ఎప్పుడో బట్టబయలు చేశారు. అది వేరే ముచ్చట.

ఇక్కడ స్వాములకు పాపం ఎంతసేపూ.. తమ వీఐపీ వ్యాపార శిష్యులకు, పాలకభక్తులకు చెప్పి ఏ పదవులు ఇప్పించుకోవాలా? వారికి ఏ కాంట్రాక్టులు ఇప్పించుకోవాలా? తమ వద్దకు వీవీఐపిలు వచ్చిన సమయంలో… సదరు వీఐపి వ్యాపార శిష్యులను పిలిపించి, వచ్చిన ఆ వీవీఐపిలతో భేటీలు వేయించి ఫలానా కాంట్రాక్టు మా వాడికి ఇప్పించవోయ్.. మనకు బాగా కావలసినవాడని సిఫార్సు చేయించడంలోనే మన స్వాముల సమయం సరిపోతుంది. ఈ ప్రపంచంలో బతక డానికి అనేక విద్యలు. వ్యాపారాలయితే పలురకాలు. అందులో మార్కెటింగ్ ప్రధానం. మన స్వాములు చేసేది కూడా మార్కెటింగే. కాకపోతే దానికి ఆధ్యాత్మికమనేది ఒక ముసుగు. అయితే ఎప్పుడయినా స్పాన్సర్లు వ్యాపారులూ-రాజకీయ పార్టీలే.  నడిచేది నడిపించేది అంతా వారే. ఈ పీఠాథిపతులు, మఠాథిపతులూ కేవలం నిమిత్తమాత్రులే. తెలుగురాష్ట్రాల్లో 90 శాతం జరుగుతోంది ఇదే. కాబట్టి.. దేవుడి సొమ్ము దారి మళ్లించిన సర్కారుపై శివమెత్తి, పాలక శిష్యులపై ఆగ్రహించేందుకు సహజంగానే ‘సర్కారీ స్వాములకు’ మొహమాటం ఉంటుందని సరిపెట్టుకోవచ్చు.

ఇక బీజేపీ సంగతి సరేసరి. ఆయనే ఉంటే మంగలితో పనేమిటని వె నకటికి సామెత చెప్పినట్లు.. రాష్ట్రంలో మా బీజేపీకి అంత వీరత్వం అఘోరిస్తే, ఈ దుస్థితి ఎందుకున్నది సొంత పార్టీ నేతల కామెంటు. చంద్రబాబు హయాంలో హిందూ ధర్మం కృష్ణానదిలో కలుస్తోందంటూ, రోజు మార్చి రోజు తెగ శోకాలు పెట్టినాయనే ఇప్పుడు ఆ పార్టీకి దళపతి. మరి ఇప్పుడు అదే హిందూ ధర్మం అన్ని నదుల్లో మంటకలుస్తున్నా సదరు శోకవీరుడు కిమ్మకనకపోవడమే విచిత్రం. ఆ పార్టీని నడిపించే సంఘపరివారం కూడా ఈ విషయంలో బెల్లంకొట్టిన రాయిలా ఉండటమే కాదు. పార్టీని కార్యాచరణకు ప్రేరేపించలేని  నిస్సహాయంగా  ఉండటమే వింత. బీజేపీ నేతలతో.. అయోధ్యలో మందిర చందాలు, శాఖల పెంపు, ఫల్‌టైమర్లకు భోజనాలు, వివిధ క్షేత్రాల కార్యక్రమాలకు స్పాన్సర్‌షిప్పులు ఇప్పించే శ్రద్ధలో… రాష్ట్రంలో దారితప్పుతున్న ధర్మంపై పదోవంతు కూడా చూపించకపోవడమే ఆశ్చర్యం.

మరి హిందూ ధర్మ పరిరక్షణపై పేటెంటీ పొందిన పార్టీలు, సంస్థలు.. పేరుగొప్ప పేపర్ పులుల  ముఖాలు, ఈ ‘దేవాలయ నిధుల దారిమళ్లింపు’ సేవను నిలువరించకుండా ఎక్కడ దాక్కున్నాయన్నది ప్రశ్న? ఈ ముఖాలతో రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ సాధ్యమేనా? ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ వంటి డజను సంస్థలు అసలు ఆంధ్రాలో పనిచేస్తున్నాయా? లేక ఎదగలేని బీజేపీ సేవలో తరిస్తున్నాయా అన్నది జనం సందేహం. మొన్నటి దేవాలయాలపై దాడుల ఘటన నుంచి.. నిన్నటి దేవాలయ నిధుల మళ్లింపు అంశాల వరకూ ప్రత్యక్ష కార్యాచరణ లేకుండా, చచ్చు పుచ్చు ఇచ్చకాలతో కాలక్షేపం చేస్తున్న ఈ సంస్థల వల్ల, తమకు ఒరిగేదేమీ లేదన్నది హిందువుల వాదన.

అదేదో సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం చెప్పినట్లు.. ధర్మ పరిరక్షణకు ఉపకరించని వీరి ఉపన్యాసాలతో, ఏళ్లూ- పూళ్లూ కాలం వెళ్లదీస్తున్న వీరి వల్ల ఎవరికి ఉపయోగమన్నది ప్రశ్న. అప్పుడెప్పుడో కంచి స్వామి తమిళనాడు ఊరిచివర  నిర్వహించిన చింతన్‌బైఠక్‌లో చేసిన తీర్మానాలు, ఏ కాకి ఎత్తుకెళ్లిందో అర్ధం కాదు. దారి తప్పుతున్న ధర్మాన్ని దారిలో పెట్టాలంటూ నాడు భేటీ అయిన స్వాముల ఆవేదన, కార్చిన కన్నీరు.. పెన్నా, హంద్రీ-నీవా నదులను ముంచెత్తింది. సర్కారుకు ఆ మహాసభ పంపిన తీర్మానాలు ఏ చెత్తబుట్టలో సుఖనిద్ర పోతున్నాయో మరి? బహశా తమ  తాటాకు చప్పుళ్లకే పాలకులు బెదిరిపోతారనుకున్నారు కామోసు?! ఆంధ్రులకే కాదు, స్వాములదీ ఆరంభశూరత్వమేనన్నమాట!

ఇప్పుడు ఏపీ సర్కారు.. వాహనమిత్ర పథకానికి ఇచ్చిన 49 లక్షల రూపాయల దారిమళ్లింపు ఉత్తర్వును తప్పుపట్టాల్సిన పనిలేదు. అవి ప్రజల డబ్బులే కాబట్టి, తిరిగి ప్రజలకే వెళుతున్నాయి. మంచిదే. ఎలాగూ జగనన్న సర్కారు సొమ్ములను పథకాల పేరుతో  పప్పుబెల్లాల మాదిరిగా అన్ని వర్గాలకూ పంచుతోంది కాబట్టి, ఈ పని ఇప్పుడు కాకపోయినా రేపయినా చేయకతప్పదు. సరే… ఎలాగూ నిధుల్లేక అల్లాడుతున్న సర్కారు.. అటు మసీదు, ఇటు చర్చిలలో కూడా గుళ్ల మాదిరిగానే హుండీలు పెట్టించి, వాటికి ఉన్న భూములను.. ఇప్పుడు దేవాలయ భూములను వేలం వేస్తున్నట్లే, మసీదు-చర్చి భూములను కూడా వేలం వేస్తే పథకాలకు పైసల కొరతే ఉండదు కదా? మరి ఈ విషయంలో దేవాలయాలు చేసిన పాపమేమిటి? చర్చి-మసీదులు చేసుకున్న పుణ్యమేమిటన్నది ప్రశ్న. ఈ ఆలోచన జగనన్నకు రాకపోయినా… ఆయనకోసం తపశ్శక్తులు ధారపోసిన చినముషిడివాడ కేంద్రంగా ఉన్న ‘జగనన్న భక్తసమాజమయినా చెప్పాలి కదా? హేమిటో… ఈ స్వాముల లీల.. హిందువుల గోల!