నిబంధనల పేరిట వాహన మిత్ర పథకానికి డ్రైవర్లను దూరం చేస్తున్నారు

166

* ఇంట్లో అమ్మ ఒడి, పింఛన్ పొందేవారు ఉంటే వాహనమిత్రకు అనర్హులా?
* కరోనా కష్టాల్లో ఉంటే లబ్ధిని దూరం చేస్తున్నారు
* అద్దెకు ఆటో నడిపేవారికీ పథకం వర్తింపజేయాలి
* ఆటో డ్రైవర్ల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ఏడాదిగా విధించిన జరిమానాలు రద్దు చేయండి
* దేవాదాయ శాఖ నిధులు మళ్లింపుపై భక్తులకు క్షమాపణలు చెప్పాలి
* జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

ఏడాదికో కొత్త నిబంధన తీసుకొచ్చి వాహన మిత్ర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ విమర్శించారు. వాహన మిత్ర అంటూ ఎంతో హడావిడి చేసిన  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఈ రోజు ఈ పథకానికి గాలి తీసి తుస్సుమనిపించారన్నారు. ఆటో డ్రైవర్‌ భార్యకు అమ్మ ఒడి వచ్చినా, తల్లిదండ్రుల్లో ఎవరికైనా వృద్ధాప్య పింఛను ఇచ్చినా వాహనమిత్ర పథకానికి అనర్హులుగా ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. 300 యూనిట్ల విద్యుత్‌ వాడితే లబ్ధి ఇచ్చేది లేదు అని నిబంధన పెట్టారని తెలిపారు  ఆటో ఫైనాన్స్ కోసం ఐటీ రిటర్న్‌ దాఖలు చేస్తారు.. ఆ పేరుతో ఆ డ్రైవర్లను అనర్హుల జాబితాలోకి వేయడం సిగ్గుచేటని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు 50 వేల మందికి పైగా లబ్ధిదారులు అర్హత కోల్పోయారని తెలిపారు. బుధవారం విజయవాడలో పోతిన వెంకట మహేష్ వీడియో ద్వారా వాహన మిత్ర పథకం అమలులో లో వైఖరిని తప్పు పడుతూ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ “ప్రతి ఏడాది ప్రతి ఇంటికి రెండు నుంచి ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు.. ఒక పథకం కింద రూ. పదివేలు ఇచ్చి ఇంకొక పథకానికి అనర్హులుగా ప్రకటించడమేనా లబ్ధి చేకూర్చడం అంటే? రెండు నెలలుగా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు కిరాయిలు లేక కుటుంబాలను పోషించలేక పస్తులుంటే… మీరిచ్చే రూ. పదివేలకు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసమా? ఒక చేత్తో వాహనమిత్ర పథకం కింద రూ. పదివేలు ఇచ్చి … మరోవైపు కేసులు, ఈ-చలాన్లు అంటూ లాక్కోవడం నిజం కాదా? ప్రభుత్వం పదివేలుతో ఆటోలకు రిపేర్లే చేయించాలా? లేక ఇన్సురెన్సులే కట్టాలా? కుటుంబాలనే పోషించాలా?

కరోనా విపత్కర సమయంలో కొత్త నిబంధనలు పెట్టి అర్హుల జాబితాకు కోత పెట్టడం ఎంత వరకు కరెక్టో జగన్ గారే ఆలోచన చేయాలి. సొంత ఆటో ఉంటేనే లబ్ధి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అద్దెకు ఆటో నడుపుకునే వాళ్ళు, టాక్సీ నడుపుకొనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ పేద డ్రైవర్ ల పరిస్థితి ఏమిటి? ఆ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేయాలి.

చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించండి
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం మీద ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వ పన్నును తగ్గించుకోవచ్చు కదా? లేదా ఈ ఏడాది ఆటోలు, ట్యాక్సీలపై వేసిన ఫైన్లను రద్దు చేయోచ్చు కదా? అలా చేయరు. రూ. 10 వేలు ఇవ్వడం ప్రచారం చేసుకోవడం. వచ్చే ఏడాది అర్హుల జాబితాను కోతలు ఎలా పెట్టడం అని ఆలోచించడం. ఆటో డ్రైవర్ అంటే యాజమానే అయి ఉండాలా? అద్దెకు తీసుకొని ఆటో నడిపే వారికి ఎందుకు ఈ పథకం వర్తింప చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే వాహనమిత్ర పథకం కింద ఆటో యజమానులకు, అద్దెకు తీసుకొచ్చి తిప్పుకుంటున్న డ్రైవర్లందరిని లబ్ధిదారుల జాబితాలో చేర్చాలి.

మంత్రి వెల్లంపల్లి సమాధానం చెప్పాలి
వాహనమిత్ర పథకానికి దేవాదాయ శాఖ నిధులు మళ్లించే హక్కు ప్రభుత్వానికి లేదు. దేవాలయాల అభివృద్ధి, హిందూ ధర్మప్రచారం కోసం భక్తులు హుండీల్లో వేసిన డబ్బును వాహన మిత్ర పథకానికి ఎలా మళ్లిస్తారు? దీనిపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భక్తులకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో దూప,దీప, నైవేధ్యాలకు నోచుకోని అనేక దేవాలయాలతో పాటు శిథిలావస్థకు చేరుకున్న అనేక ఆలయాలు ఉన్నాయి. వాటి బాగోగులు గురించి ఆలోచించకుండా దేవాదాయశాఖ నిధులను శాఖ పరిధిలో లేని పథకాల కోసం ఖర్చు చేయడం ఎంత వరకు సమంజసం. ఇలా నిధులు మళ్లించడం భక్తుల మనోభావాలను అగౌరపరిచినట్లే. దీనిపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భక్తులకు క్షమాపణలు చెప్పాలని” డిమాండ్ చేశారు.