వైసీపీలో…విభీషణులు?

587

-ఆ రెండు సీట్లపై వైసీపీలో అసమ్మతి?
-లేళ్ల, తోటపై గవర్నర్‌కు ఫిర్యాదుచేసింది సొంత నేతలేనా?
– ఫిర్యాదుదారులపై పార్టీ నాయకత్వం ఆరా
( మార్తి సుబ్రహ్మణ్యం)

శాసనమండలిలో ఖాళీగా ఉన్న నాలుగు గవర్నరు కోటా ఎమ్మెల్సీ పదవులలో..  రెండు వివాదాస్పదం కావడానికి వైసీపీలో అంతర్గత కుమ్ములాటలే కారణమని తెలుస్తోంది. గుంటూరు జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు ఎంపికపై,  ఆ రెండు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలే వారిద్దరిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో మొదలయింది. వారు చేసిన ఫిర్యాదు ఫలితంగానే..  ప్రభుత్వం పంపిన జాబితాను వెంటనే ఆమోదించకుండా గవర్నర్, పెండింగ్‌లో ఉంచారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ వ్యవహారంలో గవర్నర్‌కు లేఖ ఎవరు రాశారన్న దానిపై నాయకత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం.

నిజానికి తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన తోట త్రిమూర్తులు, ఎన్నికల తర్వాతనే వైసీపీలో చేరారు. అప్పటికే అక్కడి నుంచి చక్రం తిప్పిన ఇప్పటి ఎంపి పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు తోట త్రిమూర్తులకు, చాలా కాలం నుంచి రాజకీయ శత్రుత్వం ఉంది. తోట కాపు వర్గానికి, పిల్లి-చెల్లుబోయిన బీసీ వర్గాలకు నాయకులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలో ఓటమి తర్వాత వైసీపీలో చేరాలన్న తోట ప్రయత్నాలను పిల్లి-చెల్లుబోయిన వర్గాలు చాలారోజులు అడ్డుకున్నారు. అయితే చివరకు వైసీపీ నాయకత్వం వారిద్దరి మాటను ఖాతరు చేయకుండా.. తోట త్రిమూర్తులును పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, అమలాపురం పార్లమెంటు పార్టీ అధ్యక్ష పదవి, మండపేట అసెంబ్లీ ఇన్చార్జి పదవి కూడా ఇవ్వడం తొలినుంచీ పార్టీలో పనిచేస్తున్న వైసీపీ సీనియర్లకు రుచించలేదు.

అదీగాక 2014,2019 ఎన్నికల్లో రాజోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొంతు రాజేశ్వరరావు కూడా, తూర్పు గోదావరి జిల్లా నుంచి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి ఆశించారు. వీరందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ, తోటకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఈ వర్గాలకు మింగుడు పడలేదు. అందుకే గవర్నర్ కోటాలో తోట పేరు ప్రకటించిన వెంటనే.. ఈ వర్గాలు ఏకమై, గవర్నర్‌కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తోట ప్రత్యర్ధులు.. ఆయనపై పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసును గవర్నర్ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకే, తోట ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఇప్పుడు పెండింగ్ కేసు గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా, ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుపడాలనుకున్నప్పటికీ… గవర్నర్ ప్రభుత్వ సిఫార్సును ఆమోదించడంతో, తోట ప్రత్యర్ధుల కోరిక ఆవిరయిపోయింది.

ఇక గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో, కమ్మ వర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా, టీడీపీ నుంచి చేరిన విడతల రజీనీకి ఇవ్వడం అసంతృప్తికి దారితీసింది.  దానిపై మర్రి అనుచరులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. అయితే మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి, తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని జగన్ గత ఎన్నికల ప్రచారంలోనే మాటిచ్చారు. ఇప్పటిదాకా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. పైగా చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనికి, ప్రభుత్వంలో కీలకస్థానంలోని ప్రముఖుడి ఆశీస్సులున్నాయన్న చర్చ బహిరంగంగానే జరుగుతోంది. ఒకవేళ మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇస్తే, ఎమ్మెల్యే ప్రభావం పెద్దగా ఉండే అవకాశాలు లేనందున.. ఆ ప్రభుత్వ ప్రముఖుడే రంగంలోకి దిగి, లేళ్లకు సీటు ఇప్పించడం ద్వారా ఎమ్మెల్యేకు పరోక్షంగా సాయం చేశారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

ఈ నేపథ్యంలో అదే గుంటూరు జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డికి ఎమ్మెల్సీ సీటు ప్రకటించడం, ఆయనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు గవర్నర్ వద్దకు ఫిర్యాదు రూపంలో వెళ్లడం చకచకా జరిగిపోవడానికి కారణం.. తోట, లేళ్ల ప్రత్యర్ధులేనన్న విషయం నాయకత్వానికి ఆలస్యంగా తెలిసిందట. దానితో సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగి, గవర్నరును కలసి ఆయనకు నచ్చచెప్పి, జాబితాను ఆమోదింపచేసుకోవలసి వచ్చింది. కాగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన వారెవరన్న దానిపై పార్టీ నాయకత్వం ఆరా ప్రారంభించినట్లు తెలిసింది.