ఈటలకు బీజేపీలో భవిష్యత్తుందా?

222

– ఇప్పటికే అగ్రనేతలకు అందని పదవులు
– కమలవనంలో ఈటల ఇమడగలరా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీ జాతీయ నేతల సమక్షంలో కమలం కండువా కప్పేసుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆ పార్టీలో భవిష్యత్తు ఉందా? అసలు బీజేపీలో ఈటల సర్దుకుపోగలరా? అన్న ప్రశ్నలు ఆ పార్టీలో తెరపైకి వస్తున్నాయి. విద్యార్ధి దశలో వామపక్ష ఉద్యమాలు నిర్వహించి, తర్వాత ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో చేరి,  ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నిర్వహించి మంత్రి పదవులు నిర్వహించిన ఈటల.. ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో మనుగడ సాగించగలరా అన్న చర్చ జరుగుతోంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమవకముందే, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల సోమవారం బీజేపీలో అధికారికంగా చేరడంతో.. ఆయన రెండవ పొలిటికల్ ఎపిసోడ్ ఆరంభమయినట్టయింది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల, టీఆర్‌ఎస్ టాప్ ఫైవ్ లీడర్స్‌లో ఒకరిగా కొనసాగారు. ప్రధానంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పార్టీ శాసనసభాపక్ష నేతగా పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ధిక, వైద్యశాఖ మంత్రి వంటి కీలకశాఖలు నిర్వహించారు. పార్టీలో కూడా కీలకపాత్ర పోషించారు. అంటే కేసీఆర్ నిర్వహించే అన్ని కీలక భేటీలోనూ భాగస్వామిగా ఉండేవారు. ఒక ప్రాంతీయ పార్టీలో అంత కీలకమైన స్థానంలో ఉంటూ, పార్టీ-ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో భాగస్వామిగా ఉండటం కొందరికే సాధ్యమవుతుంది. అది ఈటలకు లభించింది.

ఇప్పుడు ఆయన ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్ నుంచి… జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడంతో, ఆ పార్టీలో  ఈటల రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న చర్చకు,  ఇరు పార్టీలోనూ సహజంగానే తెరలేచింది. ఈటలను ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు సాదరంగా ఆహ్వానించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతో చేరిన వారికీ అదే గౌరవం లభించింది. అయితే ఈ గౌరవం- ఆదరణ ఎంతకాలం కొనసాగుతుందన్న ప్రశ్న బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే.. గతంలో ఇదే ఉత్సాహంతో వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన ప్రముఖుల పరిస్థితి, ఇప్పుడు గందరగోళంలో ఉండటమే ఆ ప్రశ్నలకు కారణంగా కనిపిస్తోంది.

టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపి చాడా సురేష్‌రెడ్డి, మరో మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి బీజేపీలో చేరి కాలం అయింది. ఇప్పుడు వీరికెవరికీ ఎలాంటి పదవులూ లేవు. పెద్ద గుర్తింపూ లేదు. ప్రధానంగా గరికపాటికి తిరిగి రాజ్యసభ ఇస్తామన్న హామీతోనే పార్టీలో తీసుకున్నారు. అయితే ఆయన పదవీకాలం పూర్తయి చాలాకాలం అయినప్పటికీ, ఇప్పటివరకూ దాని ముచ్చటే లేదు. ఇక రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన మోత్కుపల్లి, ఇ.పెద్దిరెడ్డి వంటి ప్రముఖులకు పార్టీలో పెద్దగా గుర్తింపులేదు. మాజీ ఎంపి వివేక్ ఉప ఎన్నికల్లో పార్టీని ఆర్ధికంగా ఆదుకుంటున్నప్పటికీ, ఆయనకూ పెద్దగా ప్రాధాన్యం లేదు. ఎన్నికల సమయంలోనే ఆయన సేవలు వాడుకుంటున్నారు.

వీరిలో చాలామందికి పార్టీలో కీలకమైన కోర్‌కమిటీలో స్థానం లేకపోవడం, ప్రధానమైన సమావేశాలకు సైతం సమాచారం ఇవ్వకపోవడంతో.. వారంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అసలు కోర్ కమిటీలో ఎవరు ఉండాలన్న అంశంపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. టీడీపీ, కాంగ్రెస్‌లో ఉండి మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యుల స్థాయి  నుంచి వచ్చిన నాయకులకు, ఇప్పటిదాకా బీజేపీ వ్యవహారశైలి ఏమిటన్నది అర్ధంకాని పరిస్థితి. ఆయా పార్టీలో స్వతంత్రంగా వ్యవహరించిన వారికి, బీజేపీలో చేరిన తర్వాత ఒంటరివారన్న భావన ఏర్పడుతోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉండగా జిల్లాలను శాసించిన వారంతా,  బీజేపీలో చేరిన తర్వాత నామమాత్రంగా మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు మోత్కుపల్లి నర్శింహులు, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు డికె అరుణ ప్రత్యర్ధులపై విరుచుకుపడేవారు. ఇప్పుడు మోత్కుపల్లి మౌనంగా ఉండగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలయినప్పటికీ డికె అరుణలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో ఉన్న..  ఇద్దరు ముగ్గురు అగ్రనేతల్లో ఒకరిగా వెలిగిన ఈటల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ఆసక్తి కనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి పార్టీ అధ్యక్షుడు సంజయ్ ఎంపిగా ఉన్నందున, ఈటలకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని చెబుతున్నారు. పైగా ఈటల నిన్నటి వరకూ ఎమ్మెల్యేగా ఉన్న హుజురాబాద్‌కు, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈటల చేరికపై ఆయన అసంతృప్తితో ఉన్నటు,్ల పెద్దిరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలే స్పష్టం చేశాయి. వీటిని పక్కనపెడితే, నియోజకవర్గంలోని ముస్లిం, క్రైస్తవులు నిన్నటి వరకూ టీఆర్‌ఎస్‌లో ఉన్న ఈటలకు తిరుగులేని మద్దతునిచ్చారు. ఇప్పుడు బీజేపీలో చేరినందున, సిద్ధాంతపరంగా వారు బీజేపీలో ఉన్న ఈటలకు.. మునుపటిమాదిరిగా మద్దతునిచ్చే అవకాశాలు తక్కువేనంటున్నారు. అంటే.. ఈటల ముందు సొంత నియోజకవర్గంలోనే సమస్యలు చ క్కదిద్దుకోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

రాష్ట్ర పార్టీలో ఉన్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, సంజయ్ వర్గ రాజకీయాల్లో.. ఈటల ఎవరి వైపు మొగ్గుచూపినా కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌లో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆరే కాబట్టి.. పార్టీకి సంబంధించి ఏ అంశమయినా, ఆయన ఒక్కరితోనే చర్చిస్తే సరిపోయేది. ఇప్పుడు బీజేపీలో ఈటల ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా, రాష్ట్ర సంఘటనా కార్యదర్శితో చర్చించాల్సిందే. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడితో సంప్రదించాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌లో ఈటల ఎంత స్థాయి నాయకుడయినప్పటికీ, బీజేపీలో జిల్లా అధ్యక్షుడికి తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. పార్టీకి సంబంధించినంతవరకూ జిల్లా అధ్యక్షుడు, జిల్లా కోర్ కమిటీనే సుప్రీం. పైగా ఇప్పుడు ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరినంత సులువుగా, ఇకపై ఢిల్లీ నేతలను కలవడం కష్టం. వారి అపాయింట్‌మెంట్లు అంత సులభంగా లభించవు. కాబట్టి..బీజేపీలో ఈటల నెట్టుకురావడం అంత సులభం కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ధర్మేంద్రతోనే సరి!
బీజేపీలో చేరేందుకు ఉత్సాహంతో ప్రత్యేక విమానం వేసుకుని మరీ వెళ్లిన ఈటలకు , ఢిల్లీ కమలదళాల నుంచి ఆశించినంత గౌవరం- స్వాగతం లభించకపోవడం నిరాశ కలిగించే అంశమే. నిజానికి పార్టీ చీఫ్ నద్దా సమక్షంలో బీజేపీలో చేరి కండువా కప్పేసుకోవాలి. కానీ విచిత్రంగా నద్దా బదులు.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్‌చుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సమక్షంలో కండువా కప్పుకోవలసి రావడం, ఈటల వెంట వెళ్లిన వారిని తీవ్ర నిరాశ పరిచింది. తర్వాత అక్కడ నుంచి అంతా నద్దా నివాసానికి వెళ్లి, గ్రూప్ ఫొటో దిగాల్సిరావడం చర్చనీయాంశమయింది. ఆరకంగా జాతీయ పార్టీ వ్యవహారాలేమిటో, అక్కడ ఏ స్థాయిలో గౌరవం లభిస్తుందో.. ఈటల తొలిసారి అనుభవంలో రుచిచూశారన్నమాట!