చెత్తపై పన్నుపై కమలం సమరం!

181
-నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు 
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధనరెడ్డి 

( జొన్నలగడ్డ రఘునాధ్- గుంటూరు)

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చత్తపై విధించిన పన్నును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధనరెడ్డి తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో విష్ణువర్ధన్రెడ్డి మీడియాతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ప్రాంతాల్లో చెత్తపై పన్ను విధించిందన్నారు. దీని వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రూ.10 వేల కోట్లు ప్రజలపై భారం పడుతోందన్నారు. ఇప్పటికే కోవిద్ చికితిపోయిన పేదలపై ఇది మరింత ఆర్ధికభారాన్ని మోపనుందన్నారు. ఈ నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా బుధవారం రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా శ్రేణులంతా పాల్గొంటారని, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అలాగే వ్యవసాయక్షేత్రాల్లో ని పంపులకు మీటర్లు అమర్చేందుకు వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భాజపా వ్యతిరేకిస్తోందన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ను ఎత్తివేయడానికి యంత్రాంగం తయారుచేసుకునేందుకు మీటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు ఆరోపించారు. తక్షణం ఈ ప్రతిపాదనను విరమించుకోవాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే భాజపా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉ మిస్తుందన్నారు.

వారిది అసత్యప్రచారం

విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు మీటర్లు ఏర్పాటుచేసుకోమని అలాగే మున్సిపాలిటీల్లో ఆర్థికభారాన్ని తగ్గించుకునేందుకు చెత్తపై పన్నులు వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్రం అలాంంటి ఆదేశాలు ఇస్తే చూపించాలని పేర్కొన్నారు. ఇదంతా కమ్యూనిస్టు పార్టీలు అసత్యప్రచారంగా మండిపడ్డారు.

తెలుగు భాషపై ప్రభుత్వానికి కక్షెందుకు?

డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థుల అభీష్టానికి వ్యతిరేకంగా 1336 కళాశాలల్లో తెలుగు మీడియాన్ని నిలిపివేసి. ఇంగ్లీషు మీడియాన్ని మాత్రమే వచ్చే ఏడాదికి నుంచి అమలుచేయడాన్ని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు భాజపై రాష్ట్రప్రభుత్వం పట్టింపులకు పోయి కోర్టు చేతిలో భంగపడిందన్నారు. సుప్రీం కోర్టు విచారణలో ఉన్న తెలుగు మాధ్యమం అంశంపై మరల రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరైన పద్దతి కాదన్నారు. ఇదిలా ఉంటే పాఠశాల విద్య చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా తెలుగు డిక్షనరీలు అందిస్తామన్న ప్రాధమిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జీవో జారీ చేసిన విషయం ఈ ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. తెలుగు భాష, బోధనా మాధ్యమం, విద్యార్థుల భవిష్యత్ అంశాలపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని అన్నారు. బోధనా మాధ్యమంలో రాష్ట్ర ప్రభుత్వం అనవసర జోక్యం చేసుకుంటోందని తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు రుణాలు ఇళ్లకోసం ఇవ్వాలా?

ప్రణాళిక సమావేశంలో రైతులకు రైతుణాలివ్వాలనేది మరచి జగనన్న ఇళ్లకు మౌలికసదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ బ్యాంకర్లను కోరడాన్ని విష్ణువర్ధన్ రెడ్డి తప్పుపట్టారు. రైతుల పేరుచెప్పి తమ పథకాలకు ఆర్థిక వనరులు సేకరించుకుని రాజకీయ ప్రచారం పొందడాన్ని ఆక్షేపించారు. బ్యాంకులు, ప్రభుత్వం కలసి రైతులను మోసం చేస్తున్నాయని, రెండేళ్ల నుంచి ఎంత మంది రైతులు, కౌలు రైతులకు కొత్త రుణాలిచ్చారో శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఏటా బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వవని, 80 శాతం పాత రుణాలనే రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు.

రైతులను ముంచుతున్నారు

రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏ మాత్రం ఉపయోగపడటం లేదని విమర్శించారు. ఇవి కాంట్రాక్టర్లకు వైకాపా కార్యకర్తలకు ఉపాధి కార్యాలయాలుగా, మిల్లర్లకు, దళారులకు కమీషన్ అందించే కేంద్రాలుగా మారాయన్నారు. రైతు భరోసా కేంద్రానికి అనుబంధంగా కనీసం ఒక్క గోడౌన్ అయినా ఉందా అని ప్రశ్నించారు. మిల్లర్లు, దళారులు, ప్రభుత్వం కలిపి రైతులను ముంచుతున్నారని ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి తక్షణం డబ్బు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హిందూ వ్యతిరేక విధానాలు మానుకోవాలి

వైకాపా ప్రభుత్వం హిందూధర్మంపై జోక్యం చేసుకుని వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని, తక్షణం ఈ విధానాలు విడనాడాలని డిమాండ్ చేశారు. హిందూ ధార్మిక సంస్థల ట్రస్ట్ల విషయంలో అనవసర జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. అవినీతి జరిగితే జోక్యం అవసరమేనని నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోరాదన్నారు. గుంటూరులో ఒక చర్చికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో జరిగిన హత్యలపై ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందూ సంస్థల ఆస్తులపై చూపించే ఆసక్తి వర్ఫ్, చర్చి ఆస్తుల విషయంలో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జీతాలు, ఫాస్టర్లు, మౌలీల జీతాలు మసీదులు, చర్చిల నుంచి వచ్చే ఆదాయం నుంచి మాత్రే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మఠాలకు సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకోడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. హిందూ స్వామీజీలను లక్ష్యంగా చేసుకుని మఠాలు తమ ఆధీనంలోకి తీసుకోడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకట శివన్నారాయణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి పాల్గొన్నారు.