రమణా..లోడెత్తాలి…చెక్‌పోస్టు పడతాది!

364

టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎల్.రమణ సన్నాహాలు
గతంలోనే పార్టీ మారడం లేదంటూ ఖండన
తాజాగా జగిత్యాలలో అనుచరులతో మంతనాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

రమణా..లోడెత్తాల.. చెక్‌పోస్టు పడతాదీ.. ఇది మహేష్ సినిమాలోని ఓ డైలాగ్! చెక్‌పోస్టు పడక ముందే వెళ్లాలని విలన్ భావన. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం చీఫ్ ఎల్.రమణ పరిస్థితి కూడా అంతే కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌లో చేరాలా? వద్దా అన్న మీమాంసలో ఉన్న రమణ, వాటికి తెరదించి ఎట్టకేలకు కారెక్కబోతున్నారు.  ఆ మేరకు స్థానికంగా రంగం సిద్థం చేసుకుంటున్నారు. తాను టీఆర్‌ఎస్‌లో చేరితే తనతోపాటు ఎంతమంది వస్తారన్న దానిపై ఆయన అభిప్రాయసేకరణ ప్రారంభించారు. ఈటల నిష్క్రమణతో ఖాళీ అయిన బీసీ నేత లోటును, రమణతో భర్తీ చేయాలన్నది టీఆర్‌ఎస్ నాయకత్వం ఆలోచన.

అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతో రమణ భేటీ అయ్యారు. వారంతా తాము రమణ వెంట వస్తామని భరోసా ఇచ్చారు. అయితే మరికొంతమంది కార్యకర్తలు మాత్రం.. తాము టీఆర్‌ఎస్‌లోకి వెళితే అక్కడ ఏమి గుర్తింపు, పదవులు లభిస్తాయన్న సందేహం వ్యక్తం చేశారు. దానికి స్పందించిన రమణ మనం పదవులు ఆశించి చేరి, అదిరాకపోతే ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అందుకే అసలు ఎలాంటి ఆశలు లేకుండా చేరితే అందరం సుఖంగా ఉంటామని సర్దిచెప్పారు. తాను టీడీపీలో ఇన్నాళ్లు పనిచేసినప్పటికీ, ఎప్పుడూ గుర్తింపు కోరుకోలేదని,  చంద్రబాబునాయుడే తనకు వాటిని ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు మనం చేరే చోట కూడా ఎలాంటి పదవులు ఆశించ కపోతే, ఎలాంటి నష్టం ఉండదని చెబుతూ.. తాను టీఆర్‌ఎస్‌లో చేరేది ఖాయమన్న సంకేతాలు పంపారు.

కాగా తొలి నుంచీ టీడీపీలో కొనసాగుతున్న సీనియర్లు మాత్రం పార్టీని వీడవద్దని సూచించారు.దానికి స్పదందించిన రమణ..  తెలంగాణలో టీడీపీ అభివృద్ధి కోసం తాను ఎంత కృషి చేసినా ఫలితం కనిపించడం లేదని, అయినా టీఆర్‌ఎస్‌లో ఇప్పుడున్న వారిలో 70 శాతం తెలుగుదేశం పార్టీ వారే కాబట్టి, అక్కడ పార్టీ మారిన భావన ఉండదని సర్దిచెప్పారు. కాగా  జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలెవరూ ఆయన వెంట వెళ్లడం లేదని టీడీపీ వర్గాలు చెప్పాయి. రమణను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పొలిట్‌బ్యూరోసభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులంతా పార్టీ అధినేత చంద్రబాబునాయుపై ఎంత ఒత్తిడి చేసినా, ఆయన రమణ వైపే మొగ్గు చూపారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఆరేళ్లలో రమణ ఒక్క ఎన్నికల్లో కూడా పార్టీని కనీసం రెండవ స్థానంలో కూడా తీసుకురాలేకపోయారని చెప్పారు. ‘ఎంతోమంది సీనియర్లు పార్టీని వీడారు. ఇప్పుడు అందులో రమణ ఒకరవుతారు. టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ నేతలు ఎంతమంది సౌకర్యంగా ఉన్నారో రమణ ఒసారి తెలుసుకుంటే మంచిది. నాయకులు ఎంతమంది వెళ్లినా క్యాడర్ పార్టీలోనే ఉన్నార’ని పొలిట్‌బ్యూరో సభ్యుడుకొరు వ్యాఖ్యానించారు.