విశాఖలో ప్రభుత్వ భూములను పెద్దఎత్తున కబ్జా చేసిన టీడీపీ నేతలు

189

– పల్లా శ్రీనివాస్ కబంధ హస్తాల్లోనే స్టీల్ ప్లాంట్ భూములు
– ఉత్తరాంధ్ర అభివృద్ధి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యం
వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, కేకే రాజు, ఏ. విజయ నిర్మల

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించి, అన్ని విధాలా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో … దేశం గర్వించేలా తీర్చిదిద్దేందుకు  ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు పనిగట్టుకుని ఉత్తరాంధ్రపైన, విశాఖ నగరంపైనా విషం చిమ్ముతున్నాయి. తమకు వత్తాసు పలికే మీడియాను అడ్డం పెట్టుకుని విశాఖలో భూకబ్జాలు, తనఖాలు అంటూ అడ్డగోలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.

రాజ్యసభ సభ్యులు  విజయసాయిరెడ్డి ప్రజా మద్దతుతో చేస్తున్న విశాఖ నగర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ఇంట్లో కూర్చుని జూమ్ మీటింగ్ లు, ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టడం కాదు, వాస్తవాలు గ్రహిస్తే మంచిది. ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదు కాబట్టే, ఏనాడూ వాస్తవాలు గ్రహించలేదు గనుకే, టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు.

గత చరిత్ర చూస్తే… టీడీపీ హాయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆ పార్టీ నేతలే భూ కబ్జాలకు పాల్పడ్డారు. మొన్నటికి మొన్న పీలా గోవిందరావు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు.. వీరంతా విశాఖలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి, పైకి రాజకీయ నేతల ముసుగు తగిలించుకున్నారు.  టీడీపీ నేతల కబ్జాలు వెలుగులోకి వచ్చేసరికి విశాఖపై విషం చిమ్ముతున్నారు. టీడీపీ నేతల కబ్జా కోరల్లో ఉన్న విలువైన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే భూములు దోచుకున్నాట్లా? భూ కబ్జాలకు పాల్పడినట్లా?

నోరు ఉంది కదా అని టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాసరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే మీ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు కబ్జాలకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మీరు కబ్జాకోరులై, మీరు అంటించుకున్న బురదను వేరేవారిపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

మీ కబ్జాలను, మీ నేరలు, ఘోరాలను చూసే, చంద్రబాబును విశాఖలో అడుగుపెట్టేందుకు కూడా ఇక్కడ ప్రజలు ఇష్టపడటం లేదు.  ఈప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పిస్తే… దాన్ని కూడా కోర్టులకు వెళ్లి టీడీపీ నేతలు అడ్డుకోవడం దుర్మార్గం.

విశాఖపై ఎన్నిరకాల ఆరోపణలు, కుట్రలు చేసినా, రోజూ పనిగట్టుకుని విషం చిమ్మినా.. జగన్‌మోహన్‌రెడ్డి  ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన రాజధాని ఇక్కడికి తరలి వస్తుంది. తద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం తథ్యం.

విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త  కేకే రాజు మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
టీడీపీ విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబం ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని కబ్జాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?. తవ్వే కొద్దీ పల్లా శ్రీనివాసరావు భూ కబ్జాలు, అక్రమాలు నిత్యం పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్నది నిజం కాదా..? ఇప్పటికైనా కబ్జా చేసిన భూములను ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పి… ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలి.

2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు భీమిలీ, ఆనందపురం, గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పెద్ద ఎత్తున వారి ఆస్తులను అన్యాక్రాంతం చేసుకున్నారు. వైయస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లు లేని నిరు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని ..వాటిని పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారు.

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు విశాఖ నగర పరిధిలో నిరుపేద అక్కచెల్లెమ్మలకు సుమారు 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడితే.. ఇందులో భాగంగా  టీడీపీ నేతలు ఆక్రమించుకున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటుంటే అక్రమాలు, కబ్జాలు అంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మీద, పార్టీ నేతలపై లేనిపోని అభండాలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి మీద, విజయసాయిరెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. విశాఖలో కబ్జాదారులు ఎవరో… ప్రజల ఆస్తులను సంరక్షిస్తున్నది ఎవరో ఈ ప్రాంత ప్రజలకు బాగా తెలుసు.

పల్లా శ్రీనివాస్‌ వందలాదిగా ఆక్రమించిన ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్న మాట వాస్తవం కాదా? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునే పేరుతో దొంగ దీక్ష చేసిన పైలా శ్రీనివాసరావు కబంధ హస్తాల్లోనే స్టీల్‌ప్లాంట్‌కు చెందిన భూములు ఉన్నమాట వాస్తవం కాదా? నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే, నగర ప్రజలకు, స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పి… ఆ భూములను తిరిగి ఇవ్వాలి.
గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పరిశ్రమల పేరుతో అక్రమంగా భూములను పందేరం చేసి,  నిబంధనలు అతిక్రమించి లీజ్‌ లకు ఇచ్చిన మాట వాస్తవమా .. కాదా? వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితిగా, చిత్తశుద్ధితో ప్రభుత్వ భూములను కాపాడుతుంటే… ప్రజలను మభ్యపెట్టడం కోసం ప్రభుత్వంపై బురదజల్లే విధంగా మీకు సంబంధించిన పత్రికలు, టీవీ చానల్స్‌ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త  ఏ. విజయ నిర్మల మాట్లాడుతూ.. ఏమన్నారంటే
ఇది ప్రజా ప్రభుత్వం… ప్రజల అవసరాలను తీర్చేందుకే ఉంది. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు టీడీపీ నాయకులు తాము చేసిన కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకు… ఎదుటి వారిపై నిందలు వేస్తున్నారు. విశాఖలో టీడీపీ నాయకులు వేలాది ఎకరాలు కబ్జాలు చేశారు. ప్రభుత్వం సదుద్దేశంతో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలనుకుంటే… కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి పరిపాలన అందిస్తున్నారు.

అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన జరుగుతుంటే.., టీడీపీ నేతలు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, వాటిని ఎదుటి వాళ్లపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్‌, బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని భూములను కబ్జా చేశారో ప్రజలకు తెలుసు.  వెలగపూడి రామకృష్ణబాబు నుంచి టీడీపీకి చెందిన చోటా నాయకులు వరకూ విశాఖలో ప్రభుత్వ భూములను సెంటు సెంటు కూడా వదలకుండా, ఆక్రమించుకుని, షాపులు నిర్మించి అద్దెలకు ఇచ్చుకున్నారు. టీడీపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాలి. వాటన్నింటిని పేద ప్రజలకు అందజేస్తాం.

విశాఖలో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగితే ఇక్కడ మాత్రం పేదలకు పక్కా ఇళ్ళు రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఏరోజు పేదవారికి ఓ సెంటు భూమి ఇవ్వలేదు. అలాంటిది కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రెండేళ్ళలోనే 1.35 లక్షల కోట్లు ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా పేదలకు పంచారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.