రెండేళ్ల జగన్ పాలనలో వ్యవసాయం పురోగతి

130

ముఖ్యమంత్రిగా  వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్త‌యిన‌ సందర్భాన్ని పురస్కరించుకుని ఓపెన్‌ మైండ్స్‌ సంస్ధ ఆధ్వర్యంలో ”వ్యవసాయరంగం పురోగతి” అనే అంశంపై వర్చువల్‌ సమావేశం శుక్రవారం నిర్వహించారు. వ్యవసాయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన మాజి వైస్‌ ఛాన్సలర్లు, రైతులు ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

ఓపెన్‌ మైండ్స్‌ సంస్ధ అధ్యక్షులు గంగిరెడ్డి మాట్లాడుతూ… వైయ‌స్ జ‌గ‌న్  వైయస్సార్‌ రైతు భరోసా కింద 13,500 రూపాయలను మూడు విడతలుగా రైతులకు నేరుగా అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంటలకు గిట్టుబాటుధర, సాయిల్‌ టెస్టింగ్, అవసరమైన సమయాలలో సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది. 10,778 రైతు భరోసా కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. వైయస్సార్‌ జలకళ కింద ఉచితంగా రెండు లక్షల బోర్లు రైతులకు వేయిస్తున్నారు. ధరల స్ధిరీకరణనిధి, వైయస్సార్‌ సున్నా వడ్డీ, వైయస్సార్‌ ఉచిత పంటల భీమా రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మత్స్యకార భరోసా, 1700 కోట్లకు పైగా రూపాయలతో వ్యవసాయానికి పగటిపూట నాణ్యమైన విద్యుత్ వంటివి ఇవ్వ‌టంతో పాటు, రాష్ట్ర వ్యవసాయ కమీషన్‌ ఏర్పాటు చేశారు.

ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబాల‌కు ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం, ఆవులు, గేదెలు మృతి చెందితే 15 వేల నుంచి 30 వేల రూపాయలవరకు నష్టపరిహారం అందిస్తున్నారు. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ టాక్స్‌ రద్దు చేశారు. ఇలా వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వ్యవసాయం, రైతులకు ఆయన ఇస్తున్న ఆగ్ర ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నాయి.

ఆచార్య ఎన్‌ జి రంగా యూనివర్శిటి మాజి వైస్‌ ఛాన్సలర్‌  ప్రొఫెసర్‌ వి.రాఘవరెడ్డి మాట్లాడుతూ… వ్యవసాయానికి మూలం పెట్టుబడి. రాష్ట్రంలోని అర్హులైన రైతులంద‌రికి ఏటా 13,500 చొప్పున  వారి ఖాతాలలోకి రైతుభరోసా కింది వేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు చాలా ఊరటనిచ్చే అంశం. ఇంకా రుణాలు సున్నా వడ్డీ కింద అందించడం జరుగుతుంది.  కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల రూపంలో కూడా రుణాలు అందిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ఆర్‌ బి కే లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. వాటిలో రైతులకు అవసరమైనవి అందిస్తున్నారు. ఏ పైరు ఏ సమయంలో వేయాలి వంటి సలహాలు సైతం ఇస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు జరిగిన సమయంలో వారికి పరిహారం చెల్లించే ఏర్పాటుచేశారు. తిరిగి రైతులు పంటలు వేసుకునేందుకు కూడా సహాయం అందిస్తున్నారు. గతంలో రైతులు నష్టపోతే అన్యాయానికి గురయ్యేవారు. జగన్‌ గారి ప్రభుత్వం వచ్చాక రైతులకు సత్వరమే న్యాయం జరుగుతుంది. వర్షాధారంగా ఉండే రైతులకు కూడా అవసరమైన విత్తనాలు అందిస్తున్నారు.

ఆచార్య ఎన్‌ జి రంగా యూనివర్శిటి మాజి వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఏ.పద్మరాజు మాట్లాడుతూ… వైయస్‌ జగన్‌ గారు రైతుల బాగోగులు తెలుసుకునేలా స్వయంగా వ్యవసాయ కమీషన్‌ ఏర్పాటు చేశారని అన్నారు. జగన్‌ గారు తీసుకున్న నిర్ణయాలు రైతులకు ఎంతగా మేలు చేస్తున్నాయంటే… మాకు స్వంతంగా ఒక ఎకరం పొలం ఉంది, అందులో వేసిన పంట‌ ప్రకృతి వైపరిత్యాలపరంగా పాడైతే వెంటనే నేరుగా మా ఎకౌంట్ కు పరిహారం వచ్చింది. ఇది ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. విలేజ్‌ వాలంటీర్ల వ్యవస్ధ రైతులకు ఎంతో మేలు చేస్తుంది. రైతులకు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు రైతులలో విశ్వాసం పెంచుతోంది. వ్య‌వ‌సాయ శాస్త్రవేత్తలను విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లుగా నియమించడం రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది.

ఫిషరీష్‌ ద్వారా రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తోంది. దానిపై జగన్‌ దృష్టి సారించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. పండ్లతోటల పెంపకం ద్వారా కూడా రైతులకు మంచి ఆదాయం వస్తుందని తెలియచేశారు.

వ్యవసాయశాస్త్రవేత్త  డాక్టర్‌ చెంగారెడ్డి మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన‌ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై  వైయస్‌ జగన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారని అన్నారు. వ్యవసాయం దండగ అనే నానుడిని దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి  మార్చి వ్యవసాయంను పండుగగా మార్చారు. అదే రీతిలో జగన్‌ గారు రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం వల్ల గత రెండేళ్లలో 2 లక్షల హెక్టార్ల ల్యాండ్‌ ను నూతనంగా ఇరిగేషన్‌ లోకి తెచ్చామని అన్నారు. ఎంతగా పరిశ్రమలు వచ్చినా ఏపి వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడి ఉంది. భవిష్యత్తు లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. జిడిపి గ్రోత్‌ రేటు వ్యవసాయంకు సంబంధించి మన రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. నీటి వనరులను అభివృద్ది చేయడం, ఆర్‌ బి కేలు, సమస్యల పట్ల వెంటనే స్పందించడం, సున్నా వడ్డీకింద రుణాలు వంటి వాటివ‌ల్ల ఇది సాధ్యమైంది.

ప్రొగ్రెసివ్‌ ఫార్మర్‌ రమణమూర్తి మాట్లాడుతూ… పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా చేసిన ఘనత వైయస్‌ జగన్‌ గారిదన్నారు. గతంలో రైతులకు అవగాహన లేక అందినకాడికి పంట‌లు అమ్ముకునేవారన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏళ్ల తరబడి నష్టపరిహారం అందేది కాదు, నేడు వారికి సరైన సమయంలో ఆ పరిహారం అందేలా జగన్‌ గారు చేయగలిగారన్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరారు. వ్య‌వ‌సాయంలో మెకనైజేషన్‌ పై కూడా దృష్టి సారించాలన్నారు.

పశ్చిమగోదావరి నుంచి రైతు ఏసుబాబు మాట్లాడుతూ… జగన్‌  వచ్చాక ప్ర‌వేశ‌పెట్టిన‌ రైతుభరోసా కేంద్రాల వల్ల మాలాంటి సన్నకారు, చిన్నకారు రైతులకు ఎంతో ఉపయోగం కలుగుతోందన్నారు. రైతులకు, పంటలకు భీమా సౌకర్యం కల్పించడం కూడా మాకు మేలు చేస్తుందన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని గతంలో ఏ ప్రభుత్వం ఇంతగా రైతులకు మేలు చేయలేదన్నారు.