చిక్కుల్లో సీఐడీ చీఫ్ సునీల్!

169

సర్వీసు నిబంధనల ఉల్లంఘనపై హోంశాఖకు ఫిర్యాదు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మొన్నటికి మొన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకూర్టులో వేసిన పిటిషన్. నిన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి, లోక్‌సభ స్పీకర్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు. తాజాగా అసలు మాల వర్గానికి చెందిన సునీల్‌కుమార్ మతం మారినందున, ఆయనను సర్వీసు నుంచి తొలగించాలంటూ ఏకంగా మళ్లీ హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సుమోటోగా కేసు బనాయించినప్పటి నుంచీ సునీల్‌కుమార్‌కు కష్టాలు మొదలయ్యాయి.

ఏపీ సీఐడీ చీఫ్ పి.సునీల్‌కుమార్ చిక్కుల్లో పడ్డారు.సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై బుధవారం కేంద్రహోంశాఖకు ఫిర్యాదు అందింది. ఎస్సీ మాల పేరుతో రిజర్వేషన్ పొంది, క్రిస్టియన్‌గా మతం మార్చుకున్న సునీల్‌కుమార్‌ను సర్వీసు నుంచి తప్పించాలంటూ, లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్‌ఐ జోషి తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు 6 పేజీలతో కూడిన లేఖ ద్వారా  ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఇటీవల చెన్నై హైకోర్టు తీర్పును తన ఫిర్యాదులో ఉటంకించారు. మతం మార్చుకున్నవారు రిజర్వేషన్‌ను వదులుకోవాలని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, సునీల్‌కుమార్‌ను సర్వీసు నుంచి తొలగించాలని జోషి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దానితోపాటు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి, అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో స్థాపించిన సంస్థపైనా పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన ఫిర్యాదు చేశారు. తన సంస్థ పేరుతో హిందూ వ్యతిరేక భావాలు ప్రోత్సహించిన సునీల్‌పై  సెక్షన్ 153 (ఏ), 295 (ఏ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి పూర్తి స్ధాయిలో దర్యాప్తు చేయాలని, జోషి కేంద్ర హోంశాఖకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీలలో విభజన తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, దానితోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అందులో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే..నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు,  సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌పై కేంద్రహోంశాఖ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కాగా, జోషి తన ఆరోపణలకు మద్దతుగా సునీల్‌కుమార్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సమర్పించారు.

దేశంలోని ఎంపీలందరికీ తనపై సీఐడీ జరిపిన దాడిని వివరిస్తూ లేఖలు రాయగా.. బీజేపీ ఎంపీల సహా, అన్ని పార్టీల ఎంపీలు రఘురామపై సీఐడీ దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావించనున్న రాజుకు, తామ మద్దతునిస్తామని చాలామంది ఎంపీలు ఇప్పటికే ఆయనకు భరోసా ఇచ్చారు. సీఐడీ చీఫ్ సునీల్ అంశంపై ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు రాజకీయంగా ఒక ప్రత్యేక అంశంగా చేసేందుకు ఎంపీ రాజు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే  లీగల్ రైట్స్ అడ్వైజరీ  కన్వీనర్ జోషి, హటాత్తుగా అదే సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌పై, కేంద్ర హోంమంత్రికి మతమార్పిడి కోణంలో ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. తాజా ఫిర్యాదుతో సునీల్‌కుమార్ జాతీయ స్థాయిలో చిక్కుల్లో పడిన్లయింది.