రైతాంగాన్ని దోచుకుంటున్న వైకాపా పభ్రుత్వం

55

– నిరసన దీక్షలో సోము వీర్రాజు ఆరోపణ

వైకాపా ప్రభుత్వం రైతులను దోచుకుతినే ప్రభుత్వంగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అభివర్ణించారు. పంటకొనుగోళ్లు, రవాణా, సంచులు, చెల్లింపుల్లో వ్యవసాయ, పౌరసరఫరా శాఖ అధికారులు, మంత్రులు అవినీతిలో భాగస్వాములై రైతులను దోచుకుతింటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి పాలనపై అవగాహనలేదని, కానుకలు ఇవ్వడమే పాలనగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు పాలనపై పట్టులేదని, అధికారులు, మంత్రులు ఏం చేస్తున్నా తెలుసుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా, అవినీతి లేకుండా సక్రమంగా యంత్రాంగం నడపడమే పాలన అనే విషయాన్ని ఆయన తెలుసుకోవాలని, దానిని ఆయనకు భాజపా నేర్పిస్తుందని అన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనదీక్షను మంగళవారం చేపట్టింది. రాజమండ్రి నుంచి జరిగిన నిరసనదీక్షలో పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు, ముఖ్యనాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మోట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసి నష్టాలపాలుచేసిందన్నారు. సకాలంలో పంటను సేకరించడం లేదని, అధికారులు, దళారులు కుమ్మకై పంట కొనుగోళ్లలో రైతులను దోపిడి చేస్తున్నారని, దోపిడిని అరికట్టాలని, కొనుగోలు చేసిన ధన్యానికి సకాలంలో నగదును చెల్లించడం లేదని. సూక్ష్మవ్యవసాయాన్ని రాష్ట్రంలో రెండేళ్లుగా అమలుచేయడం లేదని. యంత్రపరికరాలపై సబ్సిడీ ఇవ్వడం లేదని ఆరోపించారు. తక్షణం రైతు బకాయిలు చెల్లించాలని, మద్దతు ధరకు మొత్తం ధాన్యాన్ని కొనుగోలుచేయాలని, సూక్ష్మవ్యవసాయాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఇలా మాట్లాడారు….

లోపభూయిష్టంగా ధాన్యం సేకరణ
రైతుల నుంచి ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు విధానం లోపభూయిష్టంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ఈ ఏడాది 45 లక్షల టన్నుల ధాన్యం కొనగోలుచేయాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటికి 21 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. సేకరించిన ధాన్యానికి డబ్బు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సరైన ధర, సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుని వేల కోట్లు నష్టపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో స్లిప్పులు ఇవ్వడం లేదు. రవాణాకు డబ్బులు ఇస్తున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు ఇవ్వడం లేదు. మొత్తం వారే తినేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఈ అంశంపై అవగాహన లేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరగాలి.

నష్టపోతున్న రైతన్న
రైతులు ప్రతి ఏడాది పంటకు ఎకరానికి రూ.30 వేల చొప్పున ఆపై పంటవేసిన ఎకరాలకు వేల కోట్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కన్నా వేలకోట్లు పోగొట్టుకుంటున్నారు. మిలర్లు మాత్రం వేల కోట్లు సంపాదిస్తున్నారు. మిల్లర్లు రూ.2,200 లకు సన్నబియ్యం ధాన్యం బస్తాను కొంటున్నారు. ఆడించిన బియ్యాన్ని కిలో కొనాలి. కాని రూ.52 కు అమ్ముతున్నారు. ఈ బియ్యాన్ని 50 లక్షల కుటుంబాలు కొంటున్నాయి. కొలో బియ్యానికి రూ.10 చొప్పున ఏడాదికి రూ.15 వేల కోట్లు వంతున అయిదేళ్లకు రూ.75 వేల కోట్లు నష్టపోతున్నారు. ఇవి కాక ప్రభుత్వం ఇచ్చే సబ్సడీ రేషన్ బియ్యాన్ని కూడా రూ.10 లకు అమ్మేసుకోవడంతో ఆ మేరకు నష్టపోతున్నారు.

డ్రిప్ ఇరిగేషన్ సున్నా
రాష్ట్రంలో రెండేళ్ల నుంచి డ్రిప్ ఇరిగేషన్ అమలుచేయడం లేదు. కేంద్రం డ్రిప్ ఇరిగేషన్కు రూ.1,000 కోట్లు కేటాయించింది. రాయలసీమలో ఉద్యానపంటలు, కోస్తాలో నూనె పంటలకు డ్రిప్ ఇరిగేషన్ను ఉపయోగిస్తున్నారు. నాబార్డు రూ.600 కోట్లు ఇచ్చింది. కాని జగన్ పైసా దీనికి కేటాయించలేదు. వరికోత యంత్రాలు, రోటేటర్ వంటి యంత్రపరికరాలు సబ్సిడీతో అందించాలి.

ముఖ్యమంత్రి జగన్ ఒక వ్యాక్సిన్ కొనరు. ఒక ఇంజక్షన్ కొనరు. కేంద్రమే కొనాలని సిఎంలకు లేఖలు రాస్తారు. రాజ్యాంగం ప్రకారం వైద్యం రాష్ట్రం చేతిలో ఉంది. కాని వైద్యాన్ని గాలికి వదిలేసారు. కేంద్రం వ్యాక్సిన్ ఇస్తేనే చేస్తామంటున్నారు. వెంటిలేటర్లు ఇస్తే వాటిని మూలన పడేశారు. ఆక్సిజన్ సెంటర్లు ఏర్పాటుచేసుకోకపోవడం వల్ల తిరుపతి, హిందూపురం, విజయనగరంలో కోవిద్ రోగులు చనిపోయారు.

భరోసాల పరిపాలన కాదు
పాలన అంటే కానుకల్లా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పెద్దపెద్ద ప్రకటనలతో భరోసాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. భరోసాలతో పాలన సాగదు. పాలన అంటే కానుకలు కాదు. రైతును రక్షించాలి. వైద్యాన్ని, విద్యను సరిగా అందించాలి. ఈ ప్రభుత్వం వ్యాపారులు, మిల్లర్లతో లాలూచీ పడింది. నిజమైన పాలన ఎలాఉంటుందనేది భాజపా చూపిస్తుంది. ముఖ్యమంత్రికి భాజపా పరిపాలన నేర్పాలనుకుంటుంది.

రైతులను నట్టేట ముంచారు : జీవిల్ నరసింహారావు, రాజ్యసభ సభ్యులు
రైతులను వైకాపా ప్రభుత్వం నట్టేట ముంచింది. పంటల కనీస మద్దతు ధరను గత ప్రభుత్వం స్వాహా చేస్తే ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువగా మింగేస్తుంది. రైతులను అన్యాయం చేస్తోంది. 9 లక్షల హెక్టార్లలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే వాటిలో 40 లక్షల టన్నులే కొంటామని చెప్పిన ఈ ప్రభుత్వం అందులో సగం కూడా కొనలేదు. తమకు రావాల్సిన డబ్బు కోసం రైతులు వారాల తరబడి ఎదురుచూస్తున్నా డబ్బు జమకావడం లేదు. ఫాస్టర్లకు జాతీలు పెంచడానికి, వాలంటీర్లకు జీతాలు ఇవ్వడానికి నిధులుంటాయి కాని రైతులకు ఇవ్వడానికి మాత్రం నిధులుండవు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అనవసర విషయాల్లో తప్ప తనకు సంబంధించి విషయాల్లో మాట్లాడటం లేదు. కొడాలి నాని వైఫల్యంపై ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదు. వరి సేకరణకు 1,500 కేంద్రాలు పెట్టామన్నారు. అవి పనిచేస్తున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. మద్దతు ధరకన్నా 30 శాతం తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారంటే మీ ప్రభుత్వ వైఫల్యమా? లేక వ్యాపారులు, దళారులతో మీరేమైనా భాగస్వామ్యం కలిశారా అని ప్రజలు అనుమానిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కి బూతుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. బూతులు ప్రచారం చేసే మంత్రిగా ఆయన పనికొస్తారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సూక్ష్మసేద్యం పథకం కింద కేంద్ర సంపెద్దస్థాయిలో రాయితీలు ఇస్తోంది. కాని వాటిని రెండేళ్లుగా అమలుచేయడం లేదు.
రైతుల వెన్నుపోటు ప్రభుత్వం : సునిల్ డియోధర్, భాజపా జాతీయకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జి.
వైకాపా ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పొడిచింది. జగన్ రైతులకు నమ్మకం ద్రోహం చేశారు. రైతులకు న్యాయం చేస్తానని చెప్పి మోసం చేశారు. నిర్ణయించిన లక్ష్యంలో సగం ధాన్యం మాత్రమే కొని రైతులకు డబ్బు చెల్లించడం లేదు. ఆ డబ్బు ఇస్తేనే ఖరీఫ్కు పెట్టుబడులు పెట్టుకుంటారు డ్రిప్ ఇరిగేషన్కు రూ.400 కోట్లు అవసరం. కేంద్రం 40 శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండేళ్ల నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. ఫాస్టర్లు, ఇతర వర్గాలకు ఇస్తున్నారు. రైతులకు డబ్బు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. 48 గంటల్లో రైతులకు బకాయిలు చెల్లించాలి. 7 రోజులోల మొత్తం ధాన్యం సేకరించాలి.

విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నిరసన దీక్షలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజి, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా వెంకటశివన్నారాయణ. ఉప్పలపాటి శ్రీనివాసరాజు, అడపా శివనాగేంద్రరావు, వుల్లూరి గంగాధర్, బొడ్డు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఎమ్మెల్సీ పీవిఎన్. మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమారరాజు, పూర్వ అధ్యక్షులు డాక్టర్ కంభంపాటి హరిబాబు, లోకుల గాంధీ. అనంతపురం నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధనరెడ్డి, కాకినాడ నుంచి సూర్యనారాయణరాజు, గుంటూరు నుంచి పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్ బాబు, కిసాన్ మోర్చా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు సన్నాల సురేష్ రెడ్డి. ఓబీసీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు పీడీ పార్ధసారధి, రాజంపేట నుంచి రాష్ట్ర కార్యదర్శి నాగోతి రమేష్నయుడు. తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ కుమార యువ, మహిళా, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు వారి ప్రాంతాల్లో పాల్గొన్నారు.