సమాజం నాకెంతో ఇచ్చింది-నేనూ సమాజానికి అంతో ఇంతో ఇవ్వాలి!

79

– కావలి మాజీ శాసనసభ్యులు బీదా మస్తానరావు

కీర్తి సంపాదించడం నిజంగా గొప్ప విషయమే . లోకంలో ధనం చాలామంది సంపాదిస్తారు .కానీ కీర్తిని సంపాదించే వాళ్ళు కొందరే వుంటారు . కీర్తి అంత తక్కువగా లభించేది కాదు . ఎంతో అంకితభావం , నిబద్ధతమైన జీవితం , నిరంతరం కృషి , నీతి – నిజాయితీ , సహనం , ఔదార్యం వంటి ఉత్తమ గుణాలతో ప్రవర్తించే వాళ్లే కీర్తి సంపాదించగలుగుతారు . ” కృషితో నాస్తి దుర్భిక్ష్యం ” అన్న సూక్తికి అంకితమై వ్యాపారరంగంలోకాలూని ఇంతై ఇంతింతై వటుడెంతోఅయి అన్నరీతిలో తనదంటూ ఒక వ్యాపారసామ్రాజ్యాన్ని నిర్మించుకొని , ” బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించి ఆ ట్రస్ట్ ద్వారా పేదలకు ఎనలేని సేవలు అందిస్తూ ” దానశీలి ” గా కీర్తినార్జించిన మాజీ శాసనసభ్యులు బీదా మస్థానారావు కరోన కష్టకాలంలో ప్రజలకు తొలివిడతగా , రెండవ విడతగా తాను అందించిన – అందిస్తున్న సేవలు గురించి ఆయన మాటల్లోనే ….

ప్రశ్న : బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రారంభించారు ? ఈ ట్రస్ట్ ఆశయాలేంటి ??
జవాబు : బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ను 2004 లో స్థాపించాను . అణగారిన వర్గాలకు , వెనుకబడిన వర్గాలకు , ఆర్ధికంగా వెనుకబడిన వాళ్లకు నావంతు సేవలందించాలన్న సంకల్పంతో ఈ ట్రస్ట్ ను ప్రారంభించాను .

ప్ర: బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు ?
జ: జాతిపిత మహాత్మాగాంధీ  సందేశాలే నాకు స్ఫూర్తినిచ్చాయి . ” సమాజం నీకేమిచ్చిందన్నది కాదు – సమాజానికి నువ్వేమిచ్చావు ” అన్న మహాత్ముని మాటలు నాలో ట్రస్ట్ పెట్టడానికి ప్రేరణ కలిగించాయి . నేను అంతో ఇంతో సేవాకార్యక్రమాలు చేయడానికి మహాత్ముడే నాకు స్ఫూర్తిప్రదాత .

ప్ర : 17 సంవత్సరాలుగా బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ కోట్లాది రూపాయలు వెచ్చించి చేస్తున్న సేవలు ఎన్నోవున్నాయి . ఇప్పుడు తొలివిడత కరోన క్లిష్టసమయంలో మీ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు ?
జ : మొదటిసారి 2020లో కరోన వచ్చిన సమయంలో బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 3 కోట్ల 15 లక్షలు వెచ్చించి 25 వేల పేదకుటుంబాలకు 1250 -00 రూపాయల విలువచేసే నిత్యావసరవస్తువులు బియ్యం , కందిపప్పు , చక్కెర , ఆయిల్ తదితరవస్తువులు కిట్లలో అమర్చి పంపిణీ చేయడం జరిగింది . కావలి నియోజకవర్గంలోని  కావలి రూరల్ మండలం , అల్లూరు , బోగోలు , దగదర్తి మండలాల్లోని పేద కుటుంబాలకేకాక – కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పినట్లు ఆ నియోజకవర్గంలోని తీరప్రాంతాలున్న మండలాలైన కోవూరు , విడవలూరు , రామతీర్థం మండలాల్లోని పేద కుటుంబాలకు కూడా నిత్యావసరవస్తువులు అందజేశాము . అలాగే గూడూరు శాసనసభ్యులు వరప్రసాదరావు కోరినట్లు గూడూరు నియోజకవర్గంలోని తీరప్రాంతాలలో నివసించే పేద కుటుంబాలకు నిత్యావసరవస్తువులు అందించాము .

ప్ర : రెండవిడత కరోన విజృంభిస్తున్న సమయంలో మీ బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అందించిన సేవలు ?
జ : ఈసారి మా ట్రస్ట్ ఆరోగ్యంకు ప్రాధాన్యత కల్పించింది . నెల్లూరు కార్పొరేషన్ లో పారిశుధ్యం మెరుగుపరచడానికి 1 కోటి విరాళాన్ని మంత్రి పీ  అనీల్ కుమార్ ద్వారా కలెక్టర్ కు అందజేశాము . దాదాపు 1 కోటి 35 వెచ్చించి 5 లీటర్ల సామర్ధ్యం కలిగిన ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్స్ 250 మరియు 60 లక్షలు వెచ్చించి 10 లీటర్ల సామర్ధ్యం కలిగిన ఆక్సిజన్ కాన్సేన్ ట్రేటర్స్ 50 సింగపూర్ నుండి తెప్పించి గతనెల 29 వతేదీ రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి , పీ అనీల్ కుమార్ , రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనీల్ బాబుల సమక్షంలో నెల్లూరుజిల్లా కలెక్టర్ చక్రధరబాబుకు ఇవ్వడం జరిగింది .అలాగే 31 వతేదీ జిల్లా జైలుకు 10 లీటర్ల ఆక్సిజన్ కాన్సెన్ ట్రేటర్ ను ఇచ్చాము . కావలి ప్రభుత్వ ప్రధాన వైద్యాశాలకు 10 లీటర్లవి 5 , 5 లీటర్లవి 10 కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి , ఏఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి చేతులమీదుగా  అందించాము . అదేవిధంగా అల్లూరు ప్రభుత్వ వైద్యాశాలకు 10 లీటర్లవి 2 , 5 లీటర్లవి 3 అందిందించడం జరిగింది . ఇవికాక జిల్లా కలెక్టర్ కు 5 లీటర్ల సామర్ధ్యం వున్నవి 100 , రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి కోరిన విధంగా ప్రకాశం జిల్లా వైద్యశాలలకు 5 లీటర్లవి 35 , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు 5 లీటర్లవి 10 ఇవ్వడం జరిగింది . కావలి ప్రభుత్వ వైద్యశాలకు 20 ఆక్సిజన్ సిలెండర్లు , అల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు 10  సిలెండర్లు  కూడా మా ట్రస్ట్ అందజేసింది .ఇకపోతే జిల్లాలోని వివిధ వైద్యశాలలకు 20 వెంటిలేటర్లు ఒక్కొక్కటి 3 నుండి 10 లక్షల ఖరీదైనవి కూడా త్వరలో అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది .

ప్ర : మీరు చేసిన సేవాకార్యక్రమాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చింది ?
జ: అన్ని సేవాకార్యక్రమాలు ఇష్టంతో చేసేవే . నాకు ఎక్కువ సంతృప్తి నిచ్చింది మా ట్రస్ట్ నార్త్ రాజుపాలెంలో స్థాపించిన  ” బీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ “. ఈ సెంటర్ ను మా ట్రస్ట్ 24 – 3 – 2018 న ప్రారంభించింది . ఆంద్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ మరియు బీఎంఆర్ చారిటబుల్ సంయుక్త నిర్వహణలో 2300 మంది శిక్షణపొందడమే గాక ఉద్యోగాలు పొందడం నాకెంతో ఆనందాన్నిచ్చింది . పరిశ్రమల్లో పనిచేసే అనుభవజ్ఞులైన ఉద్యోగుల చేత యువతకు శిక్షణ ఇప్పించాను . అలాగే సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ ( CIBA) , మైరన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ( MDEDA ) మరియు విక్రమ సంహపురి యూనివర్సిటీ ల నుండి నిష్ణాతులైన ప్రొఫెసర్లను పిలిపించి శిక్షణ ఇప్పించడం నేను మరచిపోలేని మధురస్మృతులు . 10 వ తరగతి నుండి పీజీ చదివే విద్యార్థుల వరకు ఇక్కడ శిక్షణ పొందారు . అన్నివసతులతో , హాస్టల్ సౌకర్యంతో డిజిటల్ క్లాస్ రూంలు ఈ బీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసాను . నాకెంతో సంతృప్తిని ఇచ్చిన అంశం ఇది .

 ప్ర : మీ బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందించే దాతలకు  ఇన్ కం ట్యాక్స్ రాయితీలు ఎంతవరకు ఉంటాయి ?
జ : 1 కోటి రూపాయలవరకూ దాతలు బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ కు సమర్పించి సేవలు అందించవచ్చు . ఇన్ కం ట్యాక్స్ రాయితీ పొందొచ్చు . 2021 మార్చి నుండి బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ కు 1 కోటి రూపాయల రాయితీ సౌలభ్యం లభించింది . సేవాదృక్పధం కలిగిన వాదాన్యులు ఈ సందర్భంగా నేను స్వాగతం పలుకుతున్నాను .

– ప్రభాకర్ జలదంకి
ఎడిటర్ & పబ్లిషర్
స్వతంత్ర ప్రభ దినపత్రిక