మంత్రులకు కేబినెట్‌ ప్రశంసలు

134

హైదరాబా‌ద్‌ : రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్యశాఖల అభివృద్ధికి విశేష కృషి చేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై కేబినెట్‌ ప్రశంసల జల్లు కురిపించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో రానున్న వానాకాలంలో పంటల సాగు, వ్యవసాయశాఖ సంసిద్ధతపై సమీక్ష నిర్వహించింది. ప్రాజెక్టుల పరిధిలో సాగు విస్తీర్ణం భారీగా పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. గతేడాది కోటికిపైగా ఎకరాల్లో 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రావడంపై సంతోషం ప్రకటించింది. సాగు విస్తీర్ణం పెంపునకు కృషి చేసిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డితోపాటు ఆ శాఖ సిబ్బందిని అభినందించింది. వానాకాలం సాగుకు రైతులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. అదేవిధంగా మత్స్యశాఖ అభివృద్ధికి కృషి చేసిన మంత్రి తలసాని, సిబ్బంది సేవలను సైతం కేబినెట్‌ ప్రశంసించింది.