టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అవమానిస్తున్నారు

131

సొంత పార్టీలోనే తనకు అవమానం జరుగుతోందని, అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే పేరుతో కొందరు పెత్తనం చెలాయిస్తున్నారని అశ్వాపురం జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆనందాపురంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోందని వాపోయారు. ఎమ్మెల్యే తమను సంప్రదించకుండానే కొందరికి పనులు కట్టబెట్టడంతో తమకు కనీసం ప్రొటోకాల్‌ కూడా లేకుండా పోతోందని జడ్పీటీసీ ఆరోపించారు. ప్రతిసందర్భంలో తనకు అవమానం జరుగుతున్నా రెండేళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తుల ఒత్తిడి మేరకు తన ఇంటి నిర్మాణం కోసం ఉంచుకున్న ఇసుకను రెవెన్యూ అధికారులు రెండు రోజుల క్రితం సీజ్‌ చేశారని, ఇదే విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు తాను రెండురోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన ఫోన్‌ తీయడం లేదని, పార్టీలో తనకు జరుగుతున్న అవమానానికి ఇదేనిదర్శనమని పేర్కొన్నారు. మండల పార్టీలో తనకు సమాచారం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఎవరెన్ని అవమానాలు చేసిన తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని, అన్ని విషయాలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. విలేకరుల సమావేశంలో జడ్పీటీసీ భర్త సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ బొర్రా శ్రీను, టీఆర్‌ఎస్‌ నాయకులు ఓరుంటి రమేష్‌, ఆవుల రవి, తూము రాఘవులు, మల్లయ్య, కొండల్‌రావు, నర్సింహరావు పాల్గొన్నారు.