తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ ‘టీ’కా వార్!

140

బీజేపీ దాడిపై కేటీఆర్ ఎదురుదాడి
కేంద్ర గణాంకాలతో మళ్లీ కయ్యం
కొత్తగా తెరపైకి ‘విదేశాల్లో మిగులు టీకాలు’ అంశం
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్-కేంద్రంలో అధికారంలోని బీజేపీ మధ్య టీకా పంపిణీ కేంద్రంగా తెలంగాణలో మళ్లీ లెక్కల యుద్ధం మొదలయింది. రాష్ట్రంలో ప్రజలందరికీ టీకాలు ఇవ్వడంలో కేసీఆర్ సర్కారు విఫలమయిందని, కేంద్రం ఇస్తున్న వ్యాక్సిన్ల సంగతేమిటని బీజేపీ వరసగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులతో టీఆర్‌ఎస్ పెద్దలు కుమ్మక్కయి, కరోనా వ్యాపారంలో కోట్లు దోచుకుంటున్నారన్న ఆరోపణల దాడితో బీజేపీ… కేసీఆర్ సర్కారుపై శరపరంపరంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ, తెలంగాణ సర్కారును జనం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. దీనితో ఇప్పటివరకూ ఆ అంశంలో  మౌనంగా ఉన్న టీఆర్‌ఎస్ సర్కారు, హటాత్తుగా కేంద్రంపై ఎదురుదాడికి దిగడంతో ‘వ్యాక్సిన్ వార్’ ఆసక్తికరంగా మారింది. తాజాగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్, కొత్త అంశాలను తెరపైకి తెచ్చి కేంద్రాన్ని కడిగేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో యుద్ధానికి తెరలేపినట్టయింది.

తెలంగాణలోనే ఉన్న వ్యాక్సిన్ కంపెనీ ఉత్పత్తికి కేంద్రం ఇప్పటికే 1500 కోట్ల రూపాయలను, 30 కోట్ల డోసుల ఉత్పత్తికి చెల్లించిన విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాష్‌రెడ్డి తాజాగాపై చర్చలోకి తీసుకువచ్చారు. ఇప్పటికే వ్యాక్సిన్ల కొనుగోలుపై  కేంద్ర విధానాన్ని ప్రశ్నించిన కేటీఆర్, మళ్లీ మరోసారి కొనుగోలు వైఖరిని ఆక్షేపించారు. దానిపై స్పందించిన బీజేపీ నేత ప్రకాష్‌రెడ్డి.. అసలు ఇప్పటికే కరోనా చికిత్స, వ్యాక్సిన్ల పేరుతో కోట్లాదిరూపాయలు సంపాదించుకున్న ప్రైవేటు కంపెనీలలో మీ మావాటా ఎంతో తేల్చాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చేందుకే, కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు.

అటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో విస్తృతంగా పర్యటిస్తూ, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంతోపాటు, ప్రైవేటు ఆసుపత్రులతో టీఆర్‌ఎస్ పెద్దల కుమ్మక్కు అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈటల రాజేందర్ వైద్య శాఖ మంత్రిగా ఉన్నంతవరకూ, బీజేపీ నేతల ఆరోపణలపై ఎదురుదాడి చేసేవారు. ఆయనను బర్తరఫ్ చేసిన తర్వాత ప్రభుత్వపరంగా ఎదురుదాడి తగ్గడం, అదే సమయంలో బీజేపీ నేతల ఆరోపణలకు ప్రాధాన్యం పెరిగిన ఫలితంగా పార్టీ-ప్రభుత్వపరంగా టీఆర్‌ఎస్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేటీఆర్.. నేరుగా కేంద్రంపైనే కాలు దువ్వడం చర్చనీయాంశమయింది. టీకాల కోసం బడ్జెట్‌లో కేటాయించిన 35 వేల కోట్లు ఏమయ్యాయి? అన్ని దేశాలూ ఎప్పటి నుంచో టీకాలు ఉచితంగా ఇస్తుండగా, కేంద్రం మాత్రం ప్రైవేటు ఆసుపత్రులను పెంచి పోషిస్తూందంటూ విరుచుకుపడటం బీజేపీని ఆత్మరక్షణలో పడేసింది. వ్యాక్సిన్ల కోసం ముందస్తుగా ఆర్డర్లు పెట్టడంలో కేంద్రం విఫలమయిందని విరుచుకుపడ్డారు. విదేశాలకు పంపిన వాక్సిన్లను ఆయా దేశాలు వాడనందున, వాటిని వెనక్కి తెప్పించాలన్న కొత్త డిమాండ్‌తో కేటీఆర్ కేంద్రాన్ని ఇరుకునపెట్టారు. కెనడా వంటి దేశాల్లో వాడని,  50 కోట్ల డోసులను వెనక్కి తీసుకురావాలన్న కేటీఆర్ డిమాండ్ అటు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమయింది. ఇప్పటిదాకా  కేటీఆర్ మాదిరిగా, విదేశాల్లో ఉన్న మిగులు టీకాల గురించి ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడమే దానికి కారణం. దీనితో ఆదివారం ‘ఆస్క్ కేటీఆర్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయింది.

వెంటనే కేటీఆర్ విమర్శలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఆదివారం రాత్రికే  తెలంగాణకు సరఫరా చేసిన టీకాలు, వాటి వినియోగంపై గణాంకాల వివరాలు వెల్లడించడం ద్వారా, టీఆర్‌ఎస్ సర్కారును ఆత్మరక్షణలోకి నెట్టడం ఆసక్తికలిగింది. టీఆర్‌ఎస్ సర్కారు నిర్వహణ వైఫల్యం వల్ల తెలంగాణలో 2.21 లక్షల టీకా డోసులు వృధా అయ్యాయన్న సంచలన విషయాన్ని కేంద్రం వెల్లడించింది. జనవరి-మార్చి మధ్య 41.4 లక్షల డోసుల లభ్యత ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల డోసులే పంపిణీ చేసిందని వెల్లడించింది. జనవరిలో 8.9 లక్షల డోసులకు 1.7 లక్షల డోసులు, ఫిబ్రవరిలో 13.8 లక్షల డోసులకు 2.5 లక్షల డోసులు, మార్చిలో 18.7 లక్షల డోసులకు 8.8 లక్షల డోసులు మాత్రమే పంపిణీ చేసిన విషయాన్ని కేంద్రం బట్టబయలు చేసింది. పైగా 69.23 లక్షల డోసులు తెలంగాణ రాష్ట్రానికి ఉచితంగా ఇస్తే, 2,21 లక్షల డోసులను నేలపాలు చేయడం అమానవీయమని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలు జూన్ 4 నాటికి తెలంగాణలో 64 శాతం మంది ఆరోగ్యసిబ్బందికి మాత్రమే టీకాలు వేశారంటే, రాష్ట్ర ప్రభుత్వం వాక్సిన్లు ఉపయోగించుకోవడంలో విఫలమయిందన్నది స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది.
ఆ మేరకు కేంద్రం.. ఏయే రాష్ట్రాలు టీకా డోసులను వృధా చేశాయన్న జాబితాను విడుదల చేయడం విశేషం.  కేటీఆర్ ట్విట్టర్ ద్వారా చేసిన ఎదురుదాడికి స్పందించిన కేంద్రం ఇచ్చిన  గణాంకాలతో, ఇప్పుడు టీఆర్‌ఎస్ ఆత్మరక్షణలో పడినట్టయింది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ఆధారాలతో,  బీజేపీ నేతలు తాజాగా టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగుతుండటం ప్రస్తావనార్హం.