సింహాసనం!

342

(ఉషాకిర‌ణ్)

ప్రధాని నివాసంలో అంతా కోలాహలంగా ఉంది. ఏడేళ్ళు దేశాన్ని విజయవంతంగా పాలించినందుకు నిరాడంబరంగా వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించారు. ఆ ఏర్పాట్లను స్వయంగా హౌంమంత్రి పర్యవేక్షిస్తున్నారు. రోజూ నాలుగు లక్షల విలువైన సూటు మాత్రమే ధరించేటంత నిరాడంబరత్వం ప్రధాని స్వంత మని, హౌంమంత్రికి బాగా తెలుసు! అందుకే ఆయన స్థాయిలో నిరాడంబరంగానే వేడుకలు జరపాలని పట్టుదలగా ఉన్నారు.

ఇంతలో కొందరు భక్తులు వచ్చారు. వారిని చూడగానే భక్తులని స్పష్టంగా తెలుస్తున్నది. నేరుగా హౌంమంత్రిని కలిశారు! ఏదో చెప్పారు! హౌంమంత్రి ఎంతో ఆనందపడ్డారు. ప్రధానికి ఈ సమయంలో తగిన కానుక అనుకున్నాడు! భక్తులకు అభయమిచ్చాడు! తగిన ఏర్పాట్లు చేయటానికి వెళ్ళారు భక్తులు!
సంబరాలు జరపటానికి ఒక పెద్ద హాలు ఏర్పాటు చేశారు! ప్రధానికి కావల్సిన ప్రత్యేక అతిథులకు మాత్రమే కొన్ని ఆసనాలు ఏర్పాటు చేశారు! వాటిల్లో ఒక ఆసనం మాత్రం తలకిందులుగా ఏర్పాటు చేశారు.

అతిథులుగా ముంబానీ, బేదాని, ఆవుస్వామి లాంటి కొందరు మాత్రమే వచ్చారు. ఆసనాల బాబా చేతులతో నడుచుకుంటూ వచ్చి తనకు కేటాయించిన తలకిందుల ఆసనంలో సుఖాసీనుడయ్యాడు. నెమలి వయ్యారంగా నడుస్తూ తోడురాగా, ప్రధాని స్లోమోషన్‌లో నడుచుకుంటూ వచ్చి అభివాదం చేశారు. అటూ, ఇటూ చూశారు. తనకు ఆసనం లేదు! ‘ఇదేమిటన్నట్టు?’ హౌంవైపు చూశారు. హౌం మెల్లిగా లేచారు!

”ఇది చారిత్రాత్మక సందర్భం! ఏ ప్రధాని ఇంత అద్భుతంగా పరిపాలన చేయలేదు! ఏడు సంఖ్యకు మనసంస్కృతిలో ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలుసు! మన ప్రధాని పాలనకు ఏడుఏళ్ళు ఐన సందర్భంగా, ఒక ప్రత్యేక సింహాసనం తెప్పించాము. విక్రమార్క చక్రవర్తి అధిష్టించిన సింహాసనం అది! మన ప్రధాని కూడా ఆ చక్రవర్తికి ఏమీ తక్కువ కాదని ప్రజలందరికీ తెలుసు! అందువల్ల ఆ సింహాసనాన్ని అధిరోహించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను!” అని హౌంమంత్రి, బంగారు పరదాను తొలగించారు. ఒక్కసారిగా అందరి కళ్ళు మిరమిట్లుగొలిపాయి! అద్భుతమైన సింహాసనం వెలిగిపోతూ కనిపించింది! దానికి ఏడు మెట్లు ఉన్నాయి.

ప్రధాని తెల్లటి గడ్డాన్ని నిమురుకుంటూ అందరివైపు చూశారు. సింహాసనాన్ని అధిరోహించటానికి మొదటి మెట్టుపై కాలు పెట్టబోయారు!
”ఆగు!” అన్నది మొదటి మెట్టుపైనున్న సాలభంజిక! ప్రధాని ఆశ్చర్యపడుతూ ఆగిపోయారు!
”ఇది విక్రమార్క చక్రవర్తి సింహాసనం! ఆ చక్రవర్తికి ఉన్న పాలనా దక్షత, ప్రజలపై ప్రేమ, ధైర్య సాహసాలు, నీతి, నిజాయితీ, కష్టజీవుల పట్ల ఆదరణ ఇవన్నీ ఉన్నవారే ఈ సింహాసనాన్ని అధిరోహించాలి! నీ ఏడేండ్ల పాలనలోని ఏడు ముఖ్యమైన నిర్ణయాలపై ఫలితాలను, మా ఏడు సాలభంజికలు ప్రశ్నిస్తాయి. వాటికి సరియైన జవాబు ఇచ్చినప్పుడే నీకు ఈ సింహాసనాన్ని అధిరోహించే అవకాశం లభిస్తుంది!” అన్నది మొదటి సాలభంజిక.

”ప్రధానికి కించిత్‌ ఆగ్రహం కలిగింది. విక్రమార్క చక్రవర్తి కన్నా తాను ఏమి తక్కువ? అనుకున్నాడు. పైకి మాత్రం ”సరే!”’ అన్నాడు.
”మొదటి ప్రశ్న! పెద్దనోట్ల రద్దువల్ల నీ రాజ్యంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేవారికి ఏమి ప్రయోజనం కలిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమైనా ఉపయోగం కలిగిందా?” ప్రశ్నించింది పాలభంజిక.

నోట్ల రద్దు వల్ల బారులు తీరిన ప్రజలు, ఆ లైన్లలోనే ప్రాణాలు వదులుకున్న ప్రజలు, కోలుకోలేనంతగా దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కోల్పోయిన నాలుగుకోట్ల మంది ప్రజలు, నోట్ల రద్దుకు ముందు +7శాతంగా ఉన్న వృద్ధిరేటు -7శాతానికి పడిపోవటం అన్నీ ప్రధానికి గుర్తుకు వచ్చాయి. తల అడ్డంగా ఆడిస్తూ, హౌంమంత్రి వైపుచూశాడు. మరుక్షణం మొదటి సాలభంజిక మాయమైంది.

ఇక ప్రధాని రెండో మెట్టుపై కాలుబెట్టపోయాడు!
”ఆగు” అన్నది రెండో పాలభంజిక. ప్రధాని ఆగిపోయారు!
”దేశానికి అన్నం పెట్టే రైతులు గత ఏడు నెలలుగా, కొత్త వ్యవసాయచట్టాలు రద్దు చేయాలని పోరాడుతున్నారు. రైతులకు తద్వారా దేశానికి నష్టం కలిగించి వ్యవసాయం పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయేలా చేసిన ఈ కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు రద్దు చేయటం లేదు. నేరుగా రైతులతో ఎందుకు చర్చించటంలేదు?” ప్రశ్నించింది రెండవ సాలభంజిక.

కష్టపడి పెంచుకున్న మీసాలు, గడ్డాల చాటున ప్రధాని చిన్నగా నవ్వుకున్నాడు. ఇప్పుడు భూములు ఎక్కువగా రైతుల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ కార్పొరేట్ల చేతుల్లో పెట్టాలన్నదే తన లక్ష్యం. దానికోసమే నూతన వ్యవసాయ చట్టాలు చేసింది. రైతులతో తాము చర్చిస్తే ఆ ఆశయం ఎలా నెరవేరుతుంది? ఈ పిచ్చి సాలభంజిక ఇలా అడుగుతుందేం? అనుకుంటూ హౌం వైపు చూశాడు. హౌం తన నున్నటి తల తడుముకున్నాడు. అంతే రెండవ సాలభంజిక కూడా మాయమైయ్యింది.
ప్రధాని ముచ్చటగా మూడో మెట్టుపై కాలుపెట్టబోయాడు.
షరా మామూలుగానే మూడవ సాలభంజిక కూడా ప్రధానిని ఆపింది. తన ప్రశ్నకు సమాధానం ఇవ్వందే ముందుకు కదలరాదంది!
అడగమన్నట్టు చూశాడు ప్రధాని!

భారతదేశంలో ఆ మాటకొస్తే, ఈ భూమ్మీద ఎక్కడైనా సంపద సృష్టికర్తలు కార్మికులే! గత ఏడేళ్ళలో కార్మికులకు ఏమి చేశారు! ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్‌లుగా మార్చటం ద్వారా కార్మికులకు ఇప్పటిదాకా వస్తున్న కొద్దిపాటి ప్రయోజనాలు కూడా తిరిగి పోతున్నాయి కదా! కార్మిక చట్టాలు మార్చే సమయంలో కార్మికులతో ఎందుకు చర్చించలేదు?” ప్రశ్నించింది మూడవ సాలభంజిక.

పెద్దగా నవ్వబోయాడు ప్రధాని, కాని తమాయించుకున్నాడు. తమదేమైనా కమ్యూనిస్టు ప్రభుత్వమా? కార్మికులకు, కష్టజీవులకు సేవ చేయడానికి? అచ్చంగా కార్పొరేట్లకు సేవచేసే ప్రభుత్వం కదా! పాత కార్మిక చట్టాల వల్ల, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ, పెన్షన్‌, కార్మికుల సంక్షేమం లాంటి వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాంతో ఆ మేరకు పెట్టుబడిదారులకు నష్టం కలుగుతుంది! అందుకే పాత చట్టాలు రద్దు చేసి లేబర్‌ కోడ్స్‌ ఏర్పాటు చేశాము! ఇందులో కార్మికులతో చర్చించాల్సిన అవసరం ఏముంది? అనుకుంటూ హౌంవైపు చూశాడు. దాంతో మూడవ సాలభంజికా మాయమైపోయింది.

”దేశం సార్వభౌమాధికారం సాధించటానికి, స్వావలంబనతో ముందుకు సాగటానికి, ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు, రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వరంగ సంస్థలు గత 50ఏళ్ళలో ఎంతో తోడ్పడ్డాయి! అంత గొప్ప సంస్థలను ప్రయివేటు పరం చేయటం వల్ల దేశానికి తీరని నష్టం జరుగుతుందని ఎందుకు గుర్తించడటం లేదు? పాలకుడిగా ఇది మీ బలహీనత కాదా? ప్రశ్నించింది నాలుగవ సాలభంజిక.

బలహీనత అన్న మాట వినగానే ప్రధానికి ఆగ్రహం పెల్లుబికింది. ప్రభుత్వరంగ సంస్థలు ఉంటే ప్రయివేటు రంగం ఎలా అభివృద్ధి చెందుతుంది? ముంబానీ, బేదానీ లాంటి తన స్నేహితులు ఎలా అభివృద్ధి చెందుతారు. వాళ్ళు బాగుపడితే దేశమే బాగుపడినట్టు కదా! ఇంత చిన్న లాజిక్‌ సాలభంజిక ఎలా మిస్సయ్యింది? అనుకుంటూ హౌం వైపు చూశాడు. దాంతో నాలుగవ సాలభంజిక మాయమయ్యింది.

”గత ఏడేళ్ళలో 459శాతం పెట్రోలు ధరలు పెరిగాయి! దీనివల్ల సామాన్యుడు కోలుకోలేకపోతున్నాడు. మంచి నూనె ధర రూ.90 నుంచి రూ.200 వరకు పెరిగి పోయింది. పెట్రోలు, డీజిలు, ఎల్‌పీజీల ధరలు పెరగటంతో నిత్యా వసర సరుకుల ధరలన్ని పెరిగిపోయాయి! మీరు అధికారంలోకి వస్తే రూ.35లకే పెట్రోలు ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు ధరల పెరుగుదలను అరికట్టలేకపోతున్నారు. ఇంతటి చేత కాని తనంతో ప్రజలను పరిపాలించగలరా?” ప్రశ్నించింది సాంభంజిక.

ప్రధానికి మళ్ళీ కోపం వచ్చింది! ధరల పెరుగుదల దేశం కోసం, ధర్మం కోసం, అందువల్ల వాటిని భరించటం ప్రజల బాధ్యత. పెట్రోల్‌ ధర రూ.400 అయినా తాము సంతోషంగా భరిస్తామని భక్తులు చేస్తున్న ప్రచారం, ఈ సాలభంజికకు చేరలేదు! అనుకున్నాడు. ఈ సారి ప్రధాని తిరిగి చూడకుండానే సాలభంజిక మాయమయ్యింది.

”దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి! అప్పుడే ప్రజలకు సౌకర్యాలు పెరుగుతాయి! అందుకు సైన్సును ప్రోత్సహించాలి! మీరు మూఢ విశ్వాసాలను, అశాస్త్రీయ భావనలను పెంచి పోషిస్తున్నారు. దీనివల్ల రాబోయే తరాలు అజ్ఞానంలో మునిగిపోతాయి. దేశాభివృద్ధి కుంటుపడుతుంది! మీ ఆసనాల బాబా, అల్లోపతి వైద్యం, పనికిరాదంటే మీరు స్పందించటం లేదు ఎందుకు?” ప్రశ్నించింది ఆరవ సాలభంజిక.

”ప్రజలు ఎంత అజ్ఞానంలో ఉంటే పాలకులకు అంత మంచిది! పశుపోషణ వృత్తిగా భాసిల్లిన వేదకాలంలోకి ప్రజలను మళ్ళించాలన్నది తమ పాలనలో ప్రధాన లక్ష్యం! ఆ దిశగా తమ ప్రయత్నం కొనసాగుతున్నది. అల్లోపతి వైద్యంపై తాను స్పందించలేదంటే ఆసనాల బాబాను సమర్థించటమేనని అర్థం! అని అనుకంటుండగానే ఆరవ సాలభంజికా మాయమయ్యింది! హౌంమంత్రిని మనసులోనే మెచ్చుకుంటూ, చివరిదైన ఏడవమెట్టు ఎక్కబోయాడు ప్రధాని.

”కరోనాను కట్టడి చేయలేదు! ప్రజలకు టీకాలు వేయించటానికి ఒక ప్రణాళిక లేదు! దేశంలో తయారైన టీకాలు విదేశాలకు అమ్మేశారు! దేశ ప్రజలు ఆసుపత్రులు లేక, బెడ్లు లేక, మందులు, ఆక్సిజన్‌లేక ఎక్కడికక్కడ అన్యాయంగా ప్రాణాలు ఒదులుతున్నారు. చనిపోయిన తర్వాత దహన సంస్కారాలకు దిక్కులేదు! 30లక్షల కోట్ల బడ్జెట్‌లో కేవలం 30వేల కోట్ల ఖర్చుపెడితే 130కోట్ల మందికి టీకాలు వేయించగలిగేవారు. ఆ ప్రయత్నం చేయలేదు. ఆసుపత్రులు కట్టించటానికి, టీకాలు తయారు చేసే కంపెనీల సామర్థ్యం పెంచటానికి మీ ప్రభుత్వం ఎలాంటి తోడ్పాటు అందించలేదు. ఐసీఎంఆర్‌, డీఆర్‌డీఓ లాంటి ప్రభుత్వరంగ సంస్థలు కనిబెట్టిన కోవాక్జిన్‌ టీకాను భారత్‌ బయోటెక్‌కు డీ1ఓ2 మందును రెడ్డి ల్యాబ్స్‌కు అప్పగించి, ప్రజల నిలువు దోపిడీకి రాచబాట వేశారు. ఒకేదేశం ఒకే పాలసీ అన్న మీరు, టీకాలు మాత్రం రాష్ట్రాలే కొనుక్కోవాలని ఆదేశించారు! అలాగైతే మీరెందుకు ప్రధానిగా ఉండాలి? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా? ఇదేనా పరిపాలన? మిమ్మల్ని ప్రశ్నించినవారి గొంతులు నొక్కటం మీకు అలవాటు. అందుకే నా తోటి సాలభంజికలను మీ హౌంమంత్రి మాయం చేసిన సంగతి నాకు తెలుసు! విక్రమార్క చక్రవర్తికి ప్రజల మీదున్న ప్రేమలో శతకోటి సహస్రాంశం కూడా లేని మీరు ఈ మహౌన్నత సింహాసనమే కాదు, ఏ కూర్చీలో కూడా కూర్చోవటానికి అనర్హులు! తక్షణం దిగిపోండి!” అంటూ సాలభంజిక, సింహాసనంతో సహా మాయమైపోయింది. ప్రధాని నేలమీద పడ్డాడు.

  – నవ తెలంగాణ  సౌజన్యంతో