గొట్టిపాటి మురళీమోహన్ ఇకలేరు

173

సేవాతత్పరుడు, జీవితాంతం నిరాడంబరంగా గడిపిన గొట్టిపాటి మురళీమోహన్ గారు ఇకలేరు. వారు ఎనికేపాడులో ఉన్న శ్రీవిజ్ఞాన విహార (సి.బి.ఎస్.ఈ సిలబస్ తో నడిచే) పాఠశాలకు తమ కుటుంబం తరఫున స్థలదానం చేయించారు . మాంటిస్సొరీ కళాశాల, సత్యనారాయణ పురం లోని శిశు విద్యామందిరం, విజ్ఞాన విహార పాఠశాలల నిర్వహణలో చురుకైన పాత్ర వహించారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (యూనివర్సిటీ) సెనేట్  సభ్యులుగా పట్టభద్రుల తరఫున ఎన్నికైనారు. బెజవాడ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా చాలా సంవత్సరాలు బాధ్యత వహించారు. జాగృతి వారపత్రికను, సాహిత్యనికేతన్ పుస్తక విక్రయశాలనూ నిర్వహించే జాగృతి ప్రకాశన్ ట్రస్టులో దశాబ్దాలపాటు ట్రస్టీగా వ్యవహరించారు.

1977లో దివిసీమలో ఉప్పెన సంభవించగా , ఆతర్వాత జరిగిన సేవాకార్యక్రమాలలో, 1986లో గోదావరినదికి వఱదలు వచ్చిన తర్వాత ప.గో జిల్లాలో జరిగిన వఱద బాధితుల సహాయ కార్య క్రమాలలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1980లో నాగాయలంకలో ఏర్పరచిన దీనదయాళ్ హాస్పిటల్ స్వంత భవన వసతి ఏర్పరచటంలో అనేక గ్రామాలకు స్వయంగావెళ్లి విరాళాలు సేకరించి ఇచ్చారు. యాబై సంవత్సరాలకు పైబడిన వారి సమాజసేవారంగ కార్యకలాపాలలో మచ్చుకు వీటిని పేర్కొనటం జరుగుతున్నది.

1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమ సమయంలోను,1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలోనూ ఆంతరంగిక భద్రతా చట్టం(మీసా) క్రింద జైలులో నిర్బంధింపబడి , హెబియస్ కార్పస్ పిటీషన్లు దాఖలుచేసి , కేసు వాదించుకొని విడుదల పొందారు. 1977లో లోకసభకు జరిగిన ఎన్నికలలో విజయవాడనుండి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 1970 తొలి సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ విజయవాడ నగర కార్యవాహ గా బాధ్యత స్వీకరించారు.1979నుండి కృష్ణా జిల్లా సంఘచాలక్ గా,1981నుండి 1987వరకూ కృష్ణా, గుంటూరు, ప.గో. జిల్లాలతో కూడిన విజయవాడ విభాగ్ సంఘచాలక్ గా బాధ్యత వహించారు. ఆతర్వాత కూడా కృష్ణా , గుంటూరు జిల్లాలతో కూడిన విజయవాడ విభాగ్ సంఘచాలక్ గా కొనసాగి ఆపై 1991-93సంలలో పూర్వాంధ్ర ప్రాంత కార్యవాహగా బాధ్యత వహించారు.
రా.స్వ.సంఘ సర్ సంఘచాలకులుగా విజయవాడ విచ్చేసిన సందర్భాలలో పూజనీయ  గురూజీ, బాళాసాహెబ్ దేవరస్ ల వంటి పెద్దలకు ఆతిథ్యమిచ్చిన భాగ్యం వారికి లభించింది.

 ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం
ప్రముఖ న్యాయవాది ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుడు గొట్టిపాటి మురళీమోహన్ మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తనకు ఎంతో సన్నిహితుడని ప్రధానంగా చాలా సౌమ్యులు…. స్నేహశీలి అని అన్నారు. న్యాయవాద వృత్తి పట్ల వారికి గల నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ తో కూడిన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జైలుకు వెళ్లారని అన్నారు. యువతలో ఈ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ నిరంతరం వారిలో స్ఫూర్తి నింపే వారని అన్నారు. మురళీ మోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నాయుడు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.