‘విభూ.. నీ దారిలో నా ప్రయాణం మొదలైంది’ !

160

లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టిన పుల్వామా వీరుడి సతీమణి.

■  ‘‘విభూ.. నీవు వదిలి వెళ్లిన దారిలో నేను ప్రయాణం మొదలు పెడుతున్నా. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు అనిపిస్తోంది. ‘సాధించావ్‌..’ అని నాకు చెబుతున్నట్లుగా అన్పిస్తోంది’’.. ఆర్మీ కమాండ్‌ చీఫ్‌ తన భుజంపై నక్షత్రాలను పెడుతున్నప్పుడు లెఫ్టినెంట్‌ నిఖితా కౌల్‌ అంతరంగమిది. పెళ్లయ్యి ఏడాది తిరగకముందే టెర్రరిస్టుల చేతిలో కట్టుకున్నవాడు దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయినా కుంగిపోకుండా నాడు భర్తను సగర్వంగా సాగనంపిన ధీర వనిత ఇప్పుడు ఆయన వారసురాలిగా సైన్యంలో చేరారు.

శనివారం చెన్నైలో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పుల్వామా అమరుడు మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ సతీమణి నిఖిత  ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషీ స్వయంగా ఆమె భుజాలపై నక్షత్రాలు పెట్టి సైన్యంలోకి తీసుకున్నారు.2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మేజర్‌ విభూతి శంకర్‌ అమరులయ్యారు.అప్పటికి ఆయనకు వివాహమై తొమ్మిది నెలలే అయింది.27 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయిన ఆమెను చూసి అందరూ బాధపడ్డారు. కానీ ఆమె మాత్రం జాలి కాదు.. గర్వపడమని చెప్పారు. ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుని ‘ఐ లవ్యూ’ అని చెప్పి ఒక ముద్దుతో ఆయన్ని సాగనంపారు. అంతేకాదు,భర్త మీద ప్రేమతో ఆయన బాధ్యతను కూడా పంచుకున్నారు. దిల్లీలో ఎంఎన్‌సీ ఉద్యోగాన్ని వదిలేసి సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకున్నారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) రాతపరీక్షనూ, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూనూ విజయవంతంగా పూర్తిచేశారు.’విభూ.. నీ దారిలో నా ప్రయాణం మొదలైంది’.‘రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు హాజరైనపుడు విభూ పొందిన అనుభూతిని నేనూ అనుభవించగలిగాను. అది నాకు బలాన్నిచ్చింది’ అంటారు నిఖిత. తన భర్త శిక్షణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలోనే సీటు సాధించారు. ‘అర్హత సాధించడానికి చాలా కష్టపడ్డాను. ఏడాది శిక్షణనూ పట్టుదలగా పూర్తిచేశాను. అందరూ, ముఖ్యంగా విభూ గర్వించే ఆఫీసర్‌ అవ్వాలన్నది నా కల’ అంటారామె.

ఇంటర్వ్యూలో బోర్డ్‌ సభ్యులు ఆమెను పెళ్లై ఎంత కాలమైందని అడిగారు. రెండేళ్లని చెప్పారు. దానికి వాళ్లు ‘అదేంటి? మేం తొమ్మిది నెలలని విన్నా’మన్నారు. దానికి ఆమె ‘విభూ శారీరకంగా దూరమయ్యారు. అంతమాత్రాన మా బంధం ముగిసినట్టు కాదు కదా!’ అని సమాధానమిచ్చారు. శిక్షణ పూర్తి చేసుకుని నేడు లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తన భర్తను గుర్తుచేసుకుంటూ..’‘నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. విభూ వదిలి వెళ్లిన మార్గాన్ని నేను కొనసాగిస్తున్నా. నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఐ లవ్‌ యూ విభూ.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా’’ అని ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. భర్తతోపాటు ఆయన బాధ్యతనీ ప్రేమించి, దేశానికి సేవ చేయాలన్న తన కలను కొనసాగించడానికి కొత్త ప్రమాణం మొదలుపెట్టిన నిఖితా కౌల్‌ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతున్నారు.