ఎస్వీ ప్రసాద్ మరణం మనకు ఇచ్చే సందేశం

764

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసి పదవీవిరమణ పొందిన ఒక ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ దంపతులు కోవిడ్ తో మరణించి ఈ సమాజానికి ఒక సందేశాన్ని పంపారు. అది ఒకటి కోవిడ్ కు సంబంధించినది అయితే, మరొకటి ఆయన తన ఉద్యోగ పదవికే వన్నె తెచ్చిన తీరు. మొదట కోవిడ్ గురించి మాట్లాడుకున్నట్లైతే రెండు డోసుల టీకాను తీసుకున్నా కూడా వైరస్ సోకి మరణించడం ఏమిటనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో నెలకొన్న సందేహం.

మంచి వైద్య నిపుణులతో కూడిన చికిత్స పొందడానికి ఏ విధమైన ఆర్థిక లోటు కూడా లేదు. అందుకోసమే హైదరాబాద్ లో మంచి కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కూడా మాజీ సిఎస్ దంపతులు ఇద్దరూ తుదిశ్వాస విడిచారు. అంటే ఇంతకాలం కార్పొరేట్ వైద్యశాలల్లో బెడ్లకు కృత్రిమ కొరత సృష్టించి, తరువాత జాయిన్ చేసుకుని, పది ఇరవై లక్షల రూపాయల బిల్లులతో విగత జీవులను ఇచ్చేది చూస్తుంటే రాష్ట్రంలో, దేశంలో మెడికల్ టెర్రరిజం నడుస్తుందా అని ప్రతి ఒక్కరి సందేహం కూడా లేకపోలేదు. రెండు డోసుల టీకా, మంచి పేరు, పలుకుబడి, ఆర్థిక పరిపుష్టి ఉండి కార్పొరేట్ వైద్య సేవలు పొందినా కరోనా వైరస్ నుండి రక్షింపబడలేదనే సందేశం ప్రతి ఒక్కరిలోకి వెళుతుంది. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే సందేహాలు కూడా వ్యక్తమవుతాయి.
    ప్రారంభంలోనే వైరస్ తీవ్రతను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. అందుకే పాజిటివ్, మరణాల రేటును కూడా తప్పుల తడకగా చూపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పగడ్బందీగా నివారణ చర్యలు చేపడుతున్నట్లు అప్పుడప్పుడు చెప్పుకుంటున్నారే తప్ప చేసిన పని శూన్యం అనే విమర్శలు కూడా లేకపోలేదు. దేశంలోకి వైరస్ ప్రవేశించిన ప్రారంభంలో ఆరు నెలల్లో టీకాలు వస్తున్నట్లు చెప్పారు. సంవత్సరంన్నర గడిచినా పది శాతం జనాభాకు కూడా వేయలేక పోయారు.
ఇప్పటికీ టీకాల విషయంలో స్పష్టత లేకపోవడం బాధాకరం. రెండు డోసుల మధ్య వ్యవధిని మొదట ఉన్న 28 రోజుల నుండి ఇప్పటికి ఎన్ని సార్లు మార్చారు. నిజంగా టీకా పనిచేసేందుకు మారుస్తున్నారా లేక సరైన ఉత్పత్తి లేక మారుస్తున్నారా అనే సందేహాలు ఇప్పుడు వస్తాయి. టీకాల కోసం జనం క్యూలు కట్టడమేమిటి, రెండు డోసుల టీకా తీసుకుని ఎస్వీ ప్రసాద్ దంపతులు ఇద్దరూ మరణించడం ఏమిటి, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ఎస్వీ ప్రసాద్ తన ఉద్యోగ పదవికే వన్నె తెచ్చిన తీరును ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, చంద్రబాబు నాయుడు ల వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా, రోశయ్య వద్ద చీప్ సెక్రటరీగా అంటే నలుగురు ముఖ్యమంత్రుల వద్ద అత్యున్నత పదవిలో పనిచేసి తన ఉద్యోగ పదవికే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎస్వీ ప్రసాద్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి వద్ద పనిచేసిన వారిని మరో ముఖ్యమంత్రి ఆ పదవిలో కొనసాగించరు, అలాంటిది ఒక పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల వద్దనే కాకుండా వేరు వేరు పార్టీల ముఖ్యమంత్రులు కూడా ఎస్వీ ప్రసాద్ సేవలను తీసుకున్నారంటే ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో నేడు వారు మరణించిన తర్వాత కానీ వారి గొప్పతనం తెలియలేదు.
నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్ దేశ వ్యాప్తంగా చూసినా కొందరు ఉద్యోగులు తమ ఉద్యోగ ధర్మాన్ని గుర్తెరిగి పని చేయకుండా రాజకీయ నాయకుల్లా పనిచేయడం చూస్తుంటే భవిష్యత్తులో ఈ దేశం ఏమై పోతుందా అని అనుమానాలు ఇప్పటినుంచే వ్యక్తమవుతున్నాయి. మన తెలంగాణా రాష్ట్రం ఒకడుగు ముందుకు వేసి తమ అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చిన వారికే, నచ్చిన పోస్టింగులు ఇవ్వడం అత్యంత దారుణమని, చివరకు ఇది ఎటువైపు దారితీసింది అంటే, ఎమ్మెల్యే ను తప్ప అదే పార్టీలో ఎంత పెద్ద పదవిలో ఉన్న వారిని కూడా లెక్క చేయకపోవడం.
        ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అనేది రాష్ట్రంలో అత్యున్నత సివిల్ సర్వీసు పదవి. ఆ పదవికే వన్నె తెచ్చిన ఎస్వీ ప్రసాద్ ను నేటి యువ ఐఏఎస్ అధికారులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందరో ఐఏఎస్ అధికారులు వస్తుంటారు పోతుంటారు, ఇక్కడ ఎస్వీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే, వారి యొక్క సమర్థవంతమైన పని విధానమే అని చెప్పక తప్పదు. ఇలాంటి గొప్ప వ్యక్తిని కరోనా కబళించడంలో నేటి పాలనా వైఫల్యాలు కూడా లేకపోలేదు. సాధారణంగా పదవీ విరమణ పొందిన వ్యక్తి మరణిస్తే తమ సన్నిహితులు తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అలాంటిది ఎస్వీ ప్రసాద్ గురించి ఇంతగా చెప్పుకుంటున్నామంటే వారు ఎంత గొప్ప వ్యక్తో ఇట్టే అర్థమై ఉంటుంది.
 – తుమ్మలపల్లి ప్రసాద్
                                                                            సీనియర్ జర్నలిస్ట్
                                                                                సెల్: 9912010030