బాలుడికి అక్షర-గీతం

205

 ( గంగాధర్‌ వీర్ల  )

బాలుడి పాటకు.. టోల్‌ గేట్లుండవ్‌!!
”ఏం పాడాడ్రా..!!
ఇరగదీస్తాడనుకో.. ఏన్టీవోడికి, నాగ్గాడికి, కృష్ణకి, శోభన్‌బాబుకి, వెంకటేష్‌కీ, నాగార్జున్‌కీ అంతెందుకు నిన్నామొన్న వచ్చిన బుడ్డ హీరోలకీ కూడా అచ్చంగా ఆళ్ళే పాడినట్టు..సూపర్‌గా పాడతాడెహే” అని ఎక్కడో అమలాపురంలో కిళ్లీకొట్టు దగ్గర కూర్చున్న ఓ సాదాసీదా మనిషి ఆ పాట గురించి ఎంతో అభిమానంగా అనేస్తాడు.
పద్మకమలాల కీర్తిని భుజానెత్తుకుని, చేతికి గండపెండేరం తొడిగించుకున్న మహామహా గాయక మురళీకృష్ణులు సైతం.. ”నాలా.. శాస్త్రీయ సంగీతాన్ని బాలుడు అవలీలగా పాడేయగలడుగానీ.. నేను మాత్రం బాలులా అస్సలు పాడలేను” అని చేతులెత్తి అభినందించిన ముచ్చటైన వేదికలెన్ని చూడలేదు మనం.
అందుకేనేమో.. సాపనిసలు రావంటూనే ”శంకరాభరణం” రాగాన్ని అచ్చమైన శాస్త్రీయంగా పాడేసి సంప్రదాయ సంగీతంలో నేనేం తక్కువకాదని అయన ఎప్పుడో.. ఏమీ ఎరగనట్టు, అమాయకంగా ”రాగం, తానం, పల్లవిని” ఏకం చేసేసీ.. జాతీయస్థాయిలో బెస్ట్‌ప్లేబ్యాక్‌ సింగర్‌ అనిపించుకోలేదూ!?
అసలు ఏం చెప్పాలి ఆయన గురించి?! బాలు పాట పుట్టింది మొదలు.. ఆ పాట ఆయన ఆధీనంలో లేకుండా పోతూనే ఉంది. ఇది ఇప్పటి మాటకాదు. ఏభై ఏళ్ళుగా ఆయన పాట.. నిజంగానే ఆయన ఆధీనంలో లేదు. ఆయన అంతెత్తు గొంతెత్తి పాడిన పాట ఆయన ఆధీనంలో లేకుండా పోవడమేంటబ్బా.. మరీ విడ్డూరం కాకపోతేనూ?! అని డౌట్‌ పడకండి. అదంతే. ఎందుకంటే.. బాలుడి గొంతుని ఇప్పటిదాకా అనుకరించిన వాళ్ళెందరో ఎక్కడికో వెళ్ళిపోయిన సందర్భాలున్నాయి. ఆయన స్వరాన్ని, గళాన్ని అనుసరించినవాళ్ళెందరో.. మకుటంలేని మహాగాయకులై వెండితెరపై ”నువ్వా నేనా” అని ఆయనతోపాటే పోటీపడిన సందర్భాలూ ఉన్నాయి. అంతెందుకు ఆయన్ని మక్కీకి మక్కీ దింపి జీవితాంతం నిక్షేపంగా , ధర్జాగా బతికేస్తున్న గాయకుల్నైతే లెక్కేపెట్టలేం. ఇంకా ఏంచెప్పాలి?!!
*
ఎస్పీబాలు.. కేవలం నాలుగు అక్షరాల పదం. కానీ ఆ నాలుగు అక్షరాలే లక్షల మందిలో సంగీత స్ఫూర్తిని రగిలించిన భీజాక్షరాలు. పలానా పాట ఎంతో బావుంది.. అనే మాటను తోసిరాజంటూ.. ఏపాటకు ఆపాటే మేటి అనిపించుకున్న సాటిలేని గాన గంధర్వుడాయన.
*
పేరుకి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యమైనా.. పామర రంజకమైన గాత్రంతో.. పండితుల్ని సైతం .. ఔరా అనిపించడం అయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో..!! అందుకే ‘దొరుకునా ఇటువంటి సేవా’ అంటూ.. సశాస్త్రీయమైన .. సంగీతాన్ని వీనులవిందుగా స్వరాభిషేకం చేశారాయన
*
మంచి సంగీతమంటే.. మంచి పాట.. మంచి పాటంటే.. ప్రేక్షకుల నోట పలికే పాట, పదికాలాలపాటు ‘పల్లవించవా నాగొంతులో’ అంటూ.. సాగేపాట. అలాంటి ఎన్నో జనరంజకమైన గీతాల్ని ‘పాడుతా తీయగా’ అంటూ.. నిత్యనూతనంగా పాడటం కూడా ఒక్క బాలుడికి మాత్రమే సాధ్యం.
*
ఆ గొంతుకి ‘చిత్రం భళారే విచిత్రం’ అంటూ తారక రాముడి గాంభీర్యం పలికించడం తెలుసు.అదే గొంతుకు ‘నా కళ్ళు చెబుతున్నాయి. నిను ప్రేమించానని’ అంటూ.. నటసమ్రాట్‌ నటనలోని వయ్యారాన్ని ఒలక బోయడమూ తెలుసు.
*
‘నేనొక ప్రేమ పిపాసిని..’ అంటూ ప్రేమలోని గాఢతను పంచాలన్నా.. ‘ప్రేమ ఎంత మధురం” అంటూ ప్రేమికుల గుండెలో దాగిన విరహవేదనని ప్రకటించాలన్నా.. ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి యెరుకా..’అనే జీవితసారాన్ని, తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా.. ఆ గొంతులో ఆ నాలుగక్షరాలు పడితేగానీ, అసలు విషయం బోధపడదు
*
సినిమా పాట అంటే.. భక్తి, ముక్తి, రక్తి తెలిసిన పాట. సినిమా పాటంటే హాస్యం, లాస్యం, వినోదం, సందేశం చాటిన పాట.. సినిమా పాటంటే.. ఇవన్నీ కలగలిపిన పాటల పూతోట. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ పాటల పూదోట పేరే బాలు.. బాలు అంటే బాలగోపాలం మెచ్చేపాట
*
తెలుగు వారికి ఓ గోదావరి ఆసరా ఉంది!
తెలుగు వారికి ఓ కృష్ణమమ్మ సాయమూ ఉంది!!
తెలుగువారికి.. తరతరాలకూ తరిగిపోని బాలు గారి పాటలూ ఉన్నాయి
*
బాలు పాటకు టోల్‌ గేట్లు అడ్డురావ.ు
బాలు పాటకు.. లాంగ్వేజ్‌ సమస్యలు అంతకన్నా లేవు.
బాలు పాటంటే యూనివర్సల్‌.
బాలు పాటంటే.. సంగీత ప్రపంచానికి ఓ మిరాకిల్‌
ఎస్పీ బాలు అనే పేరుకి నిర్వచనం చెప్పాలంటే..
దివి నుంచి భువికి సంగీతాన్ని తీసుకొచ్చి.. కాలానికతీతంగా సంగీతప్రియుల్ని పరవశింపజేసే ఓ సంగీత మాంత్రికుడు. తెలుగింట నిత్యం సందడిచేసే బాలుడు.. ఖ్యాతికెక్కిన పద్మభూషణుడు. ఇంకా ఇంకా మరెన్నో… !!!