అనతికాలంలోనే పాలన పై పట్టు సాధించిన జగన్మోహన్ రెడ్డి

163

– అనతికాలంలోనే పాలన పై పట్టు సాధించిన ముఖ్యమంత్రి,  పార్టీ పైన సైతం దృష్టి సారిస్తారు… డాక్టర్ వైయస్ థామస్ రెడ్డి,అవర్ స్టేట్ అవర్ లీడర్,వైయస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం”.

“అవర్ స్టేట్ అవర్ లీడర్” – “వైయస్సార్ ఇంటలెక్చువల్ ఫోరమ్” సంయుక్త సారధ్యంలో గ్రూపుల అధినేత జి శాంతమూర్తి ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త  కోపల్లి జయకర్ బాబు అనుసంధానకర్తగా  “సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం” బ్యానర్ పై  వరల్డ్ బైస్కిల్ డే సందర్భం పురస్కరించుకొని సుపరిపాలన ప్రస్థానంలో రెండేళ్లు –  “సవాళ్లు – సాఫల్యాలు” అనే శీర్షికన ప్రముఖ వైద్యులు డాll శ్రీ వైయస్ థామస్ రెడ్డి , కదలిక పత్రిక సంపాదకులు  ఇమామ్, ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ రాజకీయ విశ్లేషకులు సి వి నాగార్జున రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం నాయకులు   కొవ్వూరి త్రినాధ రెడ్డి, మానవతా సంస్థ కోకన్వీనర్  సలీం మాలిక్  ముఖ్యఅతిథులుగా  జూమ్ సదస్సు నిర్వహించారు.
గత ప్రభుత్వ పాలనా లోపాలను సరిదిద్దుతూనే సంక్షేమ సంరంభాన్ని కొనసాగిస్తూ…అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలిపే దిశగా పాలన సాగిస్తున్న  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి దేవుని చల్లని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయన్నారు ప్రముఖ వైద్యులు  వైఎస్ థామస్ రెడ్డి. హోదా విషయం తాను ఎన్నడూ మరువలేదు అని , సంక్షేమం సైతం అభివృద్ధిలో ఒక భాగమేనని విమర్శలు మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.

డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేరువగా సేవలను అందించడంలో  ప్రజాదర్బార్ విశిష్టతను జ్ఞాపకం చేస్తూ జగన్మోహన్ రెడ్డి  రచ్చబండ, ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలతో ప్రజలతో నేరుగా , చేరువగా తన ప్రస్థానాన్ని సాగించాలని ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్  నాగార్జున రెడ్డి సూచించారు.అధికారులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తమ వైఫల్యాలను ప్రభుత్వానికి ఆపాదించే విషయమై జాగరూకత వహించాలని సలహా ఇచ్చారు.

కదలిక సంపాదకులు  ఇమామ్,  వైయస్ కుటుంబంతో తన అనుబంధాన్ని స్మరిస్తూ…ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేయడం ప్రజా ప్రభుత్వం లక్షణమని , అది వైయస్ కుటుంబం రక్తంలోనే ఉందని వైయస్ కుటుంబపు పాలనా దక్షతను కొనియాడారు.

కొందరు స్వార్థపూరిత వ్యవహార శైలి వల్ల తలెత్తుతున్న సమస్యలను అంగీకరిస్తూనే…బృహత్తరమైన కార్యక్రమంలో చిన్నచిన్న లోపాలు ఉంటాయని వాటిని సమర్థవంతంగా సరి చేయగల సత్తా ముఖ్యమంత్రి సొంతమని రైతు సంఘం రాష్ట్ర నాయకులు   కొవ్వూరి త్రినాధ రెడ్డి అన్నారు. అంతేగాక అత్యంత సూక్ష్మ అంశాలను సైతం సునిశిత, సున్నిత దృష్టితో సంగ్రహించగల ముఖ్యమంత్రి బుద్ధికుశలతను తన స్వీయఅనుభవపూర్వక దృష్టాంతాలతో వివరించారు.

ముఖ్యమంత్రి హోదాను అధికారంగా వినియోగించకుండా, సేవకునిగా పనిచేస్తూ ఉపన్యాసానికి సన్యాసం ఇచ్చి, పనికి పని చెప్పిన పనిమంతుడైన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అంటూ కితాబిచ్చారు మానవతా సంస్థ కన్వీనర్ సలీమ్ మాలిక్.

గతంలో  ఉత్తుత్తిగా ఉన్న వ్యవసాయానికి సహాయం అందించి, కేవలం రెండేళ్లలోనే ఉత్పత్తి వ్యవసాయంగా మార్చి , వ్యవసాయ ఉత్పత్తులను పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని లామ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్  గిరిధర్ కాళిదాసు ప్రశంసించారు.

సుపరిపాలనలో తన మార్కు చూపుతూ నేటి ముఖ్యమంత్రి రైతుకు భారంగా మారిన వ్యవసాయాన్ని రైతు భరోసాతో వరంగా మార్చారని  శిరసాని సుందర రామ కోటిరెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రముఖ కవి కాపిరెడ్డి కృష్ణారెడ్డి, కారుమంచి రవి ,  రాజరత్నం, విశ్రాంత శాస్త్రవేత్త సుధాకర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ మంకెన, రేఖ నెమ్మాని , మాదిరెడ్డి నీలకంటేశ్వర రెడ్డి , బాపన అంకంరెడ్డి,  అప్పారావు మల్లెల్లీ తదితర దేశ,విదేశ ప్రతినిధులు, వైయస్సార్ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వందేమాతరగీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం జాతీయగీతంతో ముగిసింది.